పత్రికా స్వేచ్ఛలో మనం ఎక్కడ? తెలుసా?
ఒక్క మన దేశంలోనే కాదు.. ప్రపంచ దేశాల్లోనూ పత్రికల పాత్ర అనిర్వచనీయం.
By: Tupaki Desk | 6 May 2024 3:56 AM GMTపత్రిక.. ఏదో 12 పేజీలో.. 14 పేజీలో ఉండి.. వార్తలు ముద్రణ వేసే ``పేపర్``గా పైకి కనిపించినా.. దీనివెనుక సమున్నత ఆశయాలు లక్ష్యాలు ఉన్నాయి. కేవలం వార్తల ముద్రణకే కాదు.. జనజాగృతిని పెంచేందుకు కూడా.. పత్రికా రంగం సమున్నతంగా వ్యవహరించిన తీరు స్వాతంత్ర సంగ్రామంలో మనకు కనిపిస్తుంది. ఆ ఒక్క అంశమే.. కాదు.. ప్రభుత్వాలకు-ప్రజలకు మధ్య వారధిగా.. సారథిగా కూడా పత్రికా రంగం పనిచేస్తున్న విషయం తెలిసిందే.
ఒక్క మన దేశంలోనే కాదు.. ప్రపంచ దేశాల్లోనూ పత్రికల పాత్ర అనిర్వచనీయం. కరోనా మూలాలను కనుగొ నడంలోను.. మహమ్మారుల విషయంలో జాతిని జాగృతం చేయడంలోనూ.. నిరంకుశత్వ విధానాలను దు నుమాడడంలోనూ పత్రికల పాత్ర అనన్యసామాన్యం. ఎంతో మంది మేధావులు.. జర్నలిజంలో కృషి చేశారు. దేశానికి స్వాతంత్య్రం రాకమునుపు.. స్వాతంత్య్ర ఉద్యమంలో పార్టిసిపేట్ చేసిన మేధావులు అందరూ పేపర్లు పెట్టిన వారే. ఇలా.. అనేక దేశాల్లో పత్రికల రంగం కీలక పాత్ర పోషిస్తోంది.
అందుకే.. ప్రజాస్వామ్య దేశాల్లో.. మరింత ఎక్కువగా ప్రాధాన్యం ఉన్న రంగం జర్నలిజం. ఫోర్త్ ఎస్టేట్‌గా దీనిని పేర్కొన్నారు. ఎగ్జిక్యూటివ్, లెజిస్లేటివ్,జ్యుడీషియరీల తర్వాత.. ఫోర్త్ పిల్లర్‌గా ఉన్నది జర్నలిజమే. రాను రాను ఈ జర్నిలిజంపై పాలకుల ఆధిపత్యం.. పనిచేస్తోందన్నది ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రధాన ఆందోళన. ఫలితంగా జర్నలిజం.. అనేక ఆటుపోట్లకు గురవుతోందని మేధావులు సైతం ఆవేదన చెందు తున్నారు. ఎప్పటికప్పుడు జర్నలిజంపై జరుగుతున్న దాడులను.. దాని స్వేచ్ఛను చర్చకు పెడుతూనే ఉన్నారు.
ఇలా చూసుకుంటే.. భారత దేశం ప్రపంచానికి ఆదర్శంగా ఉండాలని అందరూ అనుకుంటారు. ఎందు కంటే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం మనదే కాబట్టి. కానీ.. మన దేశంలో జర్నలిజం పరిస్థితి దారుణంగా ఉంది. ఎక్కడా స్వేచ్ఛలేదంటే.. అతిశయోక్తికాదు. ప్రస్తుతం.. ప్రపంచదేశాల్లో జర్నలిజానికి ఉన్న పరిస్థితిని వివరిస్తూ.. ర్యాంకులు ఇచ్చింది.. ప్రపంచ పత్రికా స్వేచ్ఛ ఇండెక్స్ రిపోర్టు. దీని ప్రకారం.. భారత్.. ప్రపంచ దేశాల్లో 159వ స్థానంలో ఉండడం గమనార్హం.
ఇవీ.. ర్యాంకులు.
నార్వే, డెన్మార్క్, స్వీడన్, నెదర్లాండ్స్, ఫిన్‌లాండ్, ఎస్టోనియా, పోర్చుగల్, ఐర్లాండ్, స్విట్జర్లాండ్, జర్మనీలు.. వరుస పది స్థానాల్లో ఉన్నాయి. ఎక్కడో 159వ స్థానంలో భారత్ ఉంది. మొత్తం 180 దేశాలకు సంబంధించిన పత్రికా స్వేచ్ఛపై అధ్యయనం జరగడం గమనార్హం. ఇక, ఇదే ర్యాంకుల్లో గత ఏడాది భారత్కు 161వ స్తానం రావడం గమనార్హం. అంటే. ఇప్పుడు ఈ స్థానం కొంత బెటర్ అయిందన్నమాట.