Begin typing your search above and press return to search.

ప్రపంచంలోనే టాప్ 100 ఎఫెక్టివ్ కంపెనీల్లో మన కంపెనీలు ఎన్నంటే?

ఈ జాబితాలో రిలయన్స్ రెండోసారి చోటు దక్కించుకుంటే.. టాటా కూడా గతంలో ఉంది. ఈసారి సీరమ్ సంస్థ చోటు దక్కించుకోవటం ఆసక్తికరంగా మారింది

By:  Tupaki Desk   |   31 May 2024 6:25 AM GMT
ప్రపంచంలోనే టాప్ 100 ఎఫెక్టివ్ కంపెనీల్లో మన కంపెనీలు ఎన్నంటే?
X

మన దిగ్గజ కంపెనీలు ప్రపంచం వ్యాప్తంగా తమ సత్తాను చాటాయి. తాజాగా టైమ్స్ మ్యాగజైన్ సిద్ధం చేసిన జాబితాలో ప్రపంచంలోనే అత్యంత ప్రభావవంతమైన టాప్ 100 కంపెనీల జాబితాలో మన దేశానికి చెందిన మూడు దిగ్గజ కంపెనీలు చోటును సొంతం చేసుకున్నాయి. ఈ జాబితాలో రిలయన్స్ రెండోసారి చోటు దక్కించుకుంటే.. టాటా కూడా గతంలో ఉంది. ఈసారి సీరమ్ సంస్థ చోటు దక్కించుకోవటం ఆసక్తికరంగా మారింది.

2024గాను ప్రపంచంలోనే టాప్ 100 ఎఫెక్టివ్ కంపెనీల జాబితాలో మనదేశానికి చెందిన మూడు సంస్థలు చోటు దక్కించుకోవటం ఇదే తొలిసారిగా చెబుతున్నారు. మొత్తం కంపెనీల్ని ఐదు విభాగాలుగా వర్గీకరించారు. టైటాన్స్ కేటగిరీలో రిలయన్స్.. టాటాలు చేరాయి. పయనీర్స్ కేటగిరిలో సీరమ్ చోటు దక్కించుకుంది.

టెక్స్ టైల్స్.. పాలీస్టర్ కంపెనీగా 58 ఏళ్ల క్రితం ఏర్పాటైన రిలయన్స్ ఇండస్ట్రీస్ నేడు 200 బిలియన్ డాలర్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ తో భారతదేశంలోనే అత్యంత విలువైన కంపెనీగా ఎదిగిన విషయం తెలిసిందే. ఇదే విషయాన్ని టైమ్స్ పేర్కొంది. ఇక వందేళ్లకు పైనే భారతీయులతో ప్రత్యేక అనుబంధం కలిగిన దేశీ దిగ్గజ టాటా గ్రూప్ గురించి టైమ్స్ పేర్కొంటూ.. ‘‘సాల్ట్ నుంచి సాఫ్ట్ వేర్ వరకు వివిధ రంగాల్లో విస్తరించింది. 2023లో ఐఫోన్లను అసెంబుల్ చేసే తొలి భారతీయ కంపెనీగా నిలిచింది’’ అని పేర్కొంది.

కరోనా కష్టకాలంలో అందరికి సుపరిచితంగా మారిన సీరమ్ గురించి టైమ్స్ పేర్కొంటూ.. ఏటా 3.5 బిలియన్ డోసుల టీకాను ఉత్పత్తి చేస్తూ.. ప్రపంచంలోనే అతి పెద్ద వ్యాక్సిన్ తయారీ సంస్థగా సీరమ్ నిలిచినట్లు పేర్కొంది. ఏమైనా ప్రతిష్ఠాత్మక జాబితాలో మన దేశానికి చెందిన మూడు కంపెనీలు ఉండటం ఆసక్తికరమైన అంశంగా చెప్పక తప్పదు.