ఇకపై ఈమె ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలు!
ఈమె ఆ వయసులో తుది శ్వాస విడిచినట్లు ఇటీవల ఆమె కుటుంబ సభ్యులు ప్రకటించారు. దీంతో మరో మహిళ ఆ స్థానాన్ని అక్రమించారు.
By: Tupaki Desk | 23 Aug 2024 9:51 AM GMTప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలిగా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులకెక్కిన స్పెయిన్ మహిళ మరియా బ్రన్యాస్ ఇటీవల మృతిచెందిన సంగతి తెలిసిందే. మృతిచెందేటప్పటికి ఈమె వయసు 117 సంవత్సరాలు. ఈమె ఆ వయసులో తుది శ్వాస విడిచినట్లు ఇటీవల ఆమె కుటుంబ సభ్యులు ప్రకటించారు. దీంతో మరో మహిళ ఆ స్థానాన్ని అక్రమించారు.
అవును... 1907 మార్చి 4న అమెరికాలో జన్మించి.. చిన్నతనంలోనే ఆమె కుటుంబం స్పెయిన్ కు వెళ్లి అక్కడే స్థిరపడటంతో స్పెయిన్ మహిళగానే గుర్తింపు పొందిన మరియా బ్రన్యాస్ ఇటీవల మృతిచెందిన సంగతి తెలిసిందే. ఆమె తన జీవిత కాలంలో రెండు ప్రపంచ యుద్ధాలను చూడటమే కాకుండా.. కోవిడ్ మహమ్మారిని సైతం ఎదుర్కొని నిలబడ్డారు.
ఈ నేపథ్యంలో జపాన్ కు చెందిన తొమికో ఇటుకా ప్రపంచంలొనే అత్యంత వృద్ధురాలిగా నిలిచారు. ఆమె వయసు ప్రస్తుతం 116 సంవత్సరాలు. ఈ నేపథ్యంలో ఆమె గిన్నిస్ రికార్డ్ సొంతం చేసుకున్నట్లు అమెరికాకు చెందిన జెరోంటాలజీ రీసెర్చ్ గ్రూప్ ప్రకటించింది. ఆమె రైట్ బ్రదర్స్ ఐరోపా, అమెరికాల్లో తొలిసారి విమానాలను ప్రారంభించిన 1908లో జన్మించారు.
జపాన్ లోని అషియా నగరం నివాసి అయిన టొమికో ఇటుకా... తన 70వ ఏట జపాన్ లోని 3,067 మీటర్ల ఎత్తైన ఒంటాకే పర్వతాన్ని రెండుసార్లు అధిరోహించారు. అది కూడా బూట్లు లేకుండా స్నికర్స్ ధరించి ఎక్కి గైడ్ నే ఆశ్చర్యపరిచారు. ఇదే క్రమంలో... 100 ఏళ్ల వయసులో ఆషియా మందిరంలోని అతి పొడవైన రాతి మెట్లు ఎక్కారు.