Begin typing your search above and press return to search.

2060 నాటికి భారత జనాభాపై ఐరాసా షాకింగ్ నివేదిక!

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే

By:  Tupaki Desk   |   12 July 2024 5:30 PM GMT
2060 నాటికి భారత జనాభాపై ఐరాసా షాకింగ్ నివేదిక!
X

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. భారత్ తర్వాత స్థానంలో చైనా కొనసాగుతోంది. అయితే ఈ శతాబ్ధం మొత్తం ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ కొనసాగుతుందని చెబుతూ.. ఫ్యూచర్ లో భారత జానాభాలో కలిగే హెచ్చు తగ్గులపై ఐక్యరాజ్యసమితి ఓ నివేదిక విడుదల చేసింది.

అవును... ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురుస్కరించుకుని ఐక్యరాజ్యసమితి "వరల్డ్ పాపులేషన్ ప్రాస్పెక్ట్స్ - 2024" పేరిట ఓ నివేదికను విడుదల చేసింది. ఇందులో... 2060 నాటికి భారతదేశ జనాభా 170 కోట్ల వద్ద గరిష్టానికి చేరుతుందని అంచనా వేసింది. అయితే ఆ తర్వాత నుంచి 12శాతం తగ్గుదల రేటుతో క్రమంగా దిగొస్తుందని తెలిపింది.

ఇదే సమయంలో వచ్చే 50-60 ఏళ్లలో ప్రపంచ జనాభా 1,030 కోట్లవద్ద గరిష్టానికి చేరుతుందని అంచనా వేసిన ఐక్యరాజ్యసమితి.. అక్కడ నుంచి దిగొస్తూ ఈ శతాబ్దం చివరకు 1,020 కోట్లకు తగ్గుతుందని తెలిపింది. ఈ క్రమంలోనే... అత్యధిక జనాభా కలిగిన దేశంగా గత ఏడాది చైనాను దాడేసిన భారత్... 2100 సంవత్సరం వరకూ అదే స్థానంలో ఉంటుందని పేర్కొంది.

అయితే ఈ ఏడాదిలో భారతదేశ జనాభా 145 కోట్లని అంచనా వేసిన ఐక్యరాజ్యసమితి.. మరో ముప్పై ఏళ్లు అంటే 2054 నాటికి 169 కోట్లకు చేరుతుందని తెలిపింది. అనంతరం క్రమక్రమంగా తగ్గుతూ 150 కోట్లకు చేరుతుందని తెలిపింది. ఇక చైనా విషయానికొస్తే జనాభా తగ్గుదల విషయంలో షాకింగ్ విషయాలు వెల్లడించింది ఐరాస.

ఇందులో భాగంగా... ప్రస్తుతం చైనా జనాభా 141 కోట్లు ఉండగా.. 2054 నాటికి అది 121 కోట్లకు చేరుతుందని.. 2100 నాటికి సుమారు 50% తగ్గిపోయి 63.3 కోట్లకు చేరుతుందని అంచనా వేసింది. రాబోయే ముప్పై ఏళ్లలోనే ఆ దేశ జనాభాలో భారీ తగ్గుల నమోదవుతుందని తెలిపింది. సంతాన సాఫల్యతా రేటు పడిపోతుండటమే దీనికి కారణమని వివరించింది.