3 వారాల్లో 3వ ప్రపంచ యుద్ధం.. భారతీయ జ్యోతిషుడి సంచలనం
ఇవి తీవ్ర రూపం దాల్చి ప్రపంచ యుద్ధానికి దారి తీస్తే.. అందులోనూ అణ్వస్త్ర దేశాల మధ్య యుద్ధాలు జరిగితే..? అది మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తే
By: Tupaki Desk | 24 May 2024 9:48 AM GMTఓవైపు రెండున్నరేళ్లుగా రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నడుస్తోంది. మరోవైపు ఏడు నెలలుగా ఇజ్రాయెల్-హమాస్ మధ్య బీభత్సమైన సమరం సాగుతోంది.. ఇంకోవైపు తైవాన్ ను చైనా తరచూ భయపెడుతోంది.. ఇదేకాక.. ఆ మధ్య ఇరాన్ కు చెందిన ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్ (ఐఆర్జీసీ)ను ఇజ్రాయెల్ హతమార్చడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఇంతలో ఇరాన్ అధ్యక్షుడు రైసీ అనూహ్యంగా దుర్మరణం పాలయ్యారు. దీనివెనుక ఇజ్రాయెల్ ఉందనే ఆరోపణలూ వస్తున్నాయి. ఇలా యూరప్, పశ్చిమాసియా, ఆసియాల్లో ఉద్రిక్తతలు చెలరేగుతున్నాయి. ఇవి తీవ్ర రూపం దాల్చి ప్రపంచ యుద్ధానికి దారి తీస్తే.. అందులోనూ అణ్వస్త్ర దేశాల మధ్య యుద్ధాలు జరిగితే..? అది మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తే..?
అదే జరిగితే.. సర్వ నాశనమే..?
మొదటి ప్రపంచ యుద్ధ సమయానికి అణు బాంబులు లేవు.. విమానాలూ పెద్దగా వినియోగంలోకి రాలేదు.. కానీ, రెండో ప్రపంచ యుద్ధం ఎంతటి వినాశనానికి దారితీసిందో అందరూ చూశారు. జపాన్ లోని హిరోషిమా, నాగసాకిపై అమెరికా వేసిన అణుబాంబులు ప్రళయం రేపాయి. ఈ టెక్నాలజీ యుగంలో గనుక మళ్లీ ప్రపంచ యుద్ధం వస్తే.. జరిగే నష్టాన్ని ఊహించుకోవడం కష్టం.
· జూన్ 18న..
వివిధ దేశాల మధ్య, ముఖ్యంగా ఉక్రెయిన్-రష్యా మధ్య ఉద్రిక్తతలతో మూడో ప్రపంచ యుద్ధం సంభవిస్తుందనే ఊహాగానాలు పెద్దఎత్తున వచ్చాయి. కానీ, అవి భయాందోళనలుగానే మిగిలిపోయాయి. నోస్ట్రడామస్, బాబా వంగాతో సహా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన చాలామంది జ్యోతిష్కులు దీని గురించి అంచనాలు వేసినా.. అదేమీ జరగలేదు. అయితే, ఇలాంటి అంచనాల వార్తలు సోషల్ మీడియాలో వైరలవుతూ.. చాలామంది దృష్టిని ఆకర్షిస్తాయి. ఇప్పుడు అలానే భారతీయ జ్యోతిషుడు చెప్పిన అంచనాలు సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతున్నాయి. హరియాణాలోని పంచకులకు చెందిన ప్రముఖ జ్యోతిషుడు కుశాల్ కుమార్ లింక్డ్ ఇన్ లో పోస్ట్ చేసిన దాని ప్రకారం.. మూడో ప్రపంచ యుద్దం మరో మూడు వారాల దూరమే ఉంది. గ్రహాల గమనం, స్థితి ఆధారంగా జరగబోయే ఘటనలపై ఈ వేద జ్యోతిషుడు జోస్యం చెబుతుంటాడు. మరి ఇది ఎంతవరకు వాస్తవ రూపం దాలుస్తున్నదో చూడాలి.
అసలు అవకాశం ఉన్నదా..?
జ్యోతిష్యులు, ఇతర వ్యక్తులు చెప్పినవన్నీ నిజం కావాలని ఏమీ లేదు. అసలు జరగను కూడా జరగని ఉదంతాలు ఉన్నాయి. అందులోనూ ఈ కాలంలో ప్రపంచ యుద్ధాలు సంభవించడం కష్టమే అనుకోవాలి. ఎందుకంటే జరగబోయే నష్టాలు తెలుసు కాబట్టి.. ఏ దేశమూ దీనిని కోరుకోదు. అందుకనే రెండున్నరేళ్లుగా ఉక్రెయిన్ యుద్ధం జరుగుతున్నా అమెరికా బయటి నుంచి మద్దతు ఇస్తున్నదే కానీ.. నేరుగా రంగంలోకి దిగలేదు. గాజా స్ట్రిప్ పై దాడిచేస్తున్న ఇజ్రాయెల్ ను వారిస్తున్నదే కానీ.. ఎగదోయడం లేదు. ఈ ఉదాహరణ నేపథ్యంలో చూసినా మూడో ప్రపంచ యుద్ధం అసంభవమే.