మూడోప్రపంచ యుద్ధం ముంచుకొస్తుందా? సదరు వ్యక్తి అంచనా ఇదే
వచ్చేస్తుంది.. వచ్చేస్తుంది మూడో ప్రపంచ యుద్ధమంటూ ఉదరగొట్టిన సందర్భాలెన్నో. ఇప్పటివరకు జరిగిన రెండు ప్రపంచ యుద్ధాలు ఒక ఎత్తు
By: Tupaki Desk | 16 Jun 2024 8:54 AM GMTవచ్చేస్తుంది.. వచ్చేస్తుంది మూడో ప్రపంచ యుద్ధమంటూ ఉదరగొట్టిన సందర్భాలెన్నో. ఇప్పటివరకు జరిగిన రెండు ప్రపంచ యుద్ధాలు ఒక ఎత్తు. మూడో ప్రపంచ యుద్ధం జరగాలే కానీ మానవాళి వినాశనం ఖాయమన్నది తెలిసిందే. మూడో ప్రపంచ యుద్ధమన్నది జరిగితే అది కచ్ఛితంగా అణుయుద్ధం ఖాయం. అదే జరిగితే కోట్లాది మంది ఊసురు తీయటమేకాదు.. మానవ జాతి అంతానికి కేరాఫ్ అడ్రస్ అవుతుంది. అలాంటి యుద్ధం కలలోకి వచ్చిన అదిరిపడే పరిస్థితి.
అలాంటిది ఒక ప్రముఖ జ్యోతిష్యుడు మాత్రం మరో నలభై ఎనిమిది గంటల్లో మూడో ప్రపంచ యుద్ధం జరుగుతుందని అంచనా వేస్తున్నారు. ఇప్పుడు ఆయన మాటలు వైరల్ గా మారాయి. ప్రముఖ భారతీయ జ్యోతిష్య నిపుణుల్లో ఒకరిగా చెప్పే కుశాల్ కుమార్.. తాజా అంచనా ప్రకారం రెండు రోజుల వ్యవధిలో మూడో ప్రపంచ యుద్దం ప్రారంభం కావటం ఖాయమంటున్నారు.
అత్యంత బలమైన గ్రహాల సంఘర్షణ కారణంగా జూన్ 18న మూడో ప్రపంచ యుద్ధం ప్రారంభమవుతుందని.. ఇది ప్రపంచ వ్యాప్తంగా పెను విధ్వంసాన్నే క్రియేట్ చేస్తుందని కుండబద్ధలు కొట్టారు. తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలు ఇందుకు నిదర్శనంగా పేర్కొంటున్నారు. ఉత్తర - దక్షిణ కొరియా, చైనా - తైవాన్, ఉక్రెయిన్ - రష్యా, మిడిల్ ఈస్ట్ లో చోటు చేసుకుంటున్న ఉద్రిక్తతలు మరింత పెరుగుతాయని.. అవన్నీ కలిపి మూడో ప్రపంచ యుద్ధంగా మారతాయని చెబుతున్నారు.
కొంతకాలంగా చోటు చేసుకుంటున్న పరిణామాలన్నీ కూడా మూడో ప్రపంచ యుద్ధానికి సంకేతాలుగా ఆయన పేర్కొంటున్నారు. రానున్న 48 గంటలు చాలా క్లిష్టమైనవిగా పేర్కొంటున్న ఆయన.. ఆకాశం నుంచి ఉపగ్రహాలు కిందికి దూసుకు వస్తాయని.. అడవులు బూడిదగా మారతాయని.. అన్ని దేశాలు ఒక దానితో మరొకటి పోరాటానికి దగుతాయని.. ఇవన్నీ ప్రపంచాన్ని సర్వనాశనం చేస్తాయని పేర్కొంటున్నారు. భారత పాకిస్థాన్ సరిహద్దుల్లో భీకర స్థాయిలో ఉగ్రదాడులు జరుగుతాయని.. ఇందుకు జూన్ 9న రియాసీ జిల్లాలో యాత్రికుల బస్సుపై జరిగిన ఉగ్రదాడి ముందస్తు సూచనగా ఆయన పేర్కొంటున్నారు. ఈయన అంచనాలు విన్నోళ్లకు కొత్త భయం పట్టుకుంటోంది.