సునీతా విలియమ్స్ ఆరోగ్యంపై ఆందోళన... ఏమిటీ 'స్పేస్ ఎనీమియా'..?
వచే ఏడాది ఫిబ్రవరిలో భూమికి తిరిగి తీసుకొచ్చేందుకు నాసా ప్రయత్నాలు మొదలుపెట్టింది.
By: Tupaki Desk | 26 Aug 2024 2:30 PM GMTభారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్, మరో వ్యోమగామి బుచ్ విల్ మోర్ లు ఇద్దరూ జూన్ 5న ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కు వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే.. వీరిని తీసుకెళ్లిన స్టార్ లైనర్ ప్రొపల్షన్ వ్యవస్థలో సమస్యలు తలెత్తడంతో వారి తిరుగు ప్రయాణం వాయిదా పడుతూ వచ్చింది. వచే ఏడాది ఫిబ్రవరిలో భూమికి తిరిగి తీసుకొచ్చేందుకు నాసా ప్రయత్నాలు మొదలుపెట్టింది.
ఈ విషయాలను తాజాగా వెల్లడించింది. ఈ నేపథ్యంలో అన్నేసి నెలల పాటు అంతరిక్ష కేంద్రంలో ఉంటే వ్యోమగాములకు ఎలాంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది అనే అంశం తెరపైకి వచ్చింది. ఈ సమయంలో ఎక్కువకాలం స్పేస్ సెంటర్ లో ఉండటం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని.. ఈ నేపథ్యంలో సునీతా విలియమ్స్ "స్పేస్ ఎనీమియా" బారిన పడే ముప్పు ఉందని అంటున్నారు నిపుణులు.
ఏమిటీ స్పేస్ ఎనీమియా?:
అంతరిక్షంలో ఉన్న సమయంలో మైక్రో గ్రేవిటీకి ఎక్కువ కాలం గురైనప్పుడు ఎర్రరక్తకణాలు క్షీణిస్తుంటాయి. ఈ స్థితినే స్పేస్ ఎనీమియా అంటారు. ఈ సమయంలో భూమిపై ఉన్నప్పటి వీటీ ఉత్పత్తి తో పోలిస్తే అవి క్షీణించే రేటు స్పేస్ లో వేగంగా ఉంటుంది. ఈ అధ్యయనానికి సంబంధించిన వివరాలు తాజాగా "నేచర్ మెడిసిన్"లో ప్రచురితమయ్యాయి.
ఉదాహరణకు.. భూమిపై ఉన్న మనిషి శరీరంలో ఒక సెకనుకు రెండు మిలియన్ల రక్త కణాల ఉత్పత్తి, క్షీణత జరిగితే.. ఆరు నెలల అంతరిక్ష మిషన్ లో భాగంగా సదరు వ్యోమగాముల్లో ఆ క్షీణత సంఖ్య సెకనుకు 3 మిలియన్ల వరకూ ఉంటుందని అంటున్నారు. వ్యోమగామి స్పేస్ లోకి ప్రవేసించిన వెంటనే ఈ ప్రభావానికి గురవ్వడం మొదలవుతుందని చెబుతున్నారు.
ఈ విధంగా ఎర్రరక్తకణాలను నాశనం చేయడం ద్వారా మైక్రోగ్రావిటీ పరిస్థితుల్లో శరీరం ఆక్సిజన్ అవసరాలను తగ్గించుకుంటుంది. శరీరంలో సమతుల్యతను కాపాడే క్రమంలో ఈ కణాల సంఖ్య తగ్గిపోతూ ఉంటుంది. దీంతో... శారీరక, మానసిక పనితీరు దెబ్బతినడం వంటి లక్షణాలు కనిపించొచ్చని చెబుతున్నారు. గుండె పనితీరు దెబ్బతినే అవకాశమూ ఉందని అంటున్నారు.
అయితే... వ్యోమగాములు భూమిపైకి తిరిగి వచ్చిన తర్వాత కూడా ఈ పరిస్థితి కొనసాగుతూనే ఉంటుందట. ఆ సమయంలో... ఈ క్షీణతను ఎదుర్కొనేందుకు అధికంగా పోషకాహారం తీసుకోవాల్సి రావొచ్చని, ఈ పరిస్థితి వారి ఆరోగ్యంపై శాస్వత ప్రభావం చూపొచ్చని చెబుతున్నారు. దీంతో... సునీతా విలియమ్స్ ఆరోగ్యంపై పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.