Begin typing your search above and press return to search.

మృతదేహం ముందే ఆస్తిపంపకాలు...సూర్యాపేట జిల్లా లో దారుణం!

మానవసంబంధాలు రోజు రోజుకీ మరీ కమర్షియల్ గా మారిపోతున్నాయి. సినిమాల్లో చూపిస్తే... ఇంతదారుణంగా ఉంటారా

By:  Tupaki Desk   |   14 Sep 2023 2:30 PM GMT
మృతదేహం ముందే ఆస్తిపంపకాలు...సూర్యాపేట జిల్లా లో దారుణం!
X

మానవసంబంధాలు రోజు రోజుకీ మరీ కమర్షియల్ గా మారిపోతున్నాయి. సినిమాల్లో చూపిస్తే... ఇంతదారుణంగా ఉంటారా..? అని అనుకునేవారికి సమాజంలో ప్రత్యక్షంగా ఇలాంటి సంఘటనలు ఎదురవుతూనే ఉన్నాయి. ఇందులో భాగంగా మరణించిన వ్యక్తి ఆస్తిపంకాలు పూర్తయ్యే వరకూ దహనసంస్కారాలు ఆపడంతో... రెండు రోజులుగా మృతదేహం ఇంటివద్దే ఉంది!

అవును... అనారోగ్యంతో మృతి చెందిన ఓ వ్యక్తి మృతదేహాన్ని ఇంటి ముందే రెండ్రోజులుగా ఉంచిన దాయాదులు ఆస్తుల పంపకంపై దృష్టిపెట్టారు. ఆస్తుల పంపకాలు పూర్తయ్యి, రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ కూడా పూర్తి అయిన తర్వాతే దహన సంస్కారాలు చేయాలంటూ భీష్మించుకున్నారు. ఈ దారుణ సంఘటన సూర్యాపేట జిల్లాలో చోటుచేసుకుంది. దీంతో... "ఆ నలుగురు" సినిమాని గుర్తుచేసుకుంటున్నారు స్థానికులు!

వివరాళ్లోకి వెళ్తే... సూర్యాపేట జిల్లా మోతె మండలంలోని సిరికొండ గ్రామంలో తాజాగా ఒక దారుణమైన సంఘటన వెలుగుచూసింది. స్థానికంగా సిరికొండకు చెందిన వ్యక్తి (63) అనారోగ్యంతో మృతిచెందారు. అయితే కొన్నేళ్లుగా భార్యాభర్తల మధ్య గొడవల కారణంగా ఇద్దరూ విడివిడిగా ఎవరి సోదరుల వద్ద వారు ఉంటున్నారు. వీరికి సంతానం లేదు.

అయితే మృతుడి భార్యకు గ్రామంలో పుట్టింటి నుంచి వచ్చిన సుమారు నాలుగెకరాల వ్యవసాయ భూమి ఈమె పేరిటే ఉంది. అయితే భార్యభర్తల మధ్య గొడవల నేపథ్యంలో ఆమె పేరిట ఉన్న భూమిలో ఎకరం భూమిని ఆమె భర్త పేర రిజిస్ట్రేషన్‌ చేసేందుకు ఇటీవల పెద్దలు నిర్ణయించారు. ఈ సమయంలో ఆయన రిజిస్ట్రేషన్ కు రావాల్సి ఉండగా... ఆరోజే మరణించాడు.

ఈ నేపథ్యంలో మృతుడి సోదరులు రంగప్రవేశం చేశారు. క్యాన్సర్ వ్యాదిబారిన పడిన అన్న వైద్య ఖర్చుల నిమిత్తం సుమారు రూ.30 లక్షలదాకా ఖర్చు చేశామని, అందువల్ల.. వదిన పేరు మీద ఉన్న భూమిలో ఎకరన్నర భూమి తమ పేరిట రిజిస్ట్రేషన్‌ చేయాలని పట్టుబట్టారు. అనంతరం ధరణిలో స్లాట్‌ బుక్‌ చేసి భూమి రిజిస్ట్రేషన్‌ చేసేదాకా దహన సంస్కారాలు చేసేది లేదంటూ అడ్డుకున్నారు.

ఇదే సమయంలో ఆ లెక్కన చూసుకుంటే మృతుడి భార్య ఆస్తిని తమ పేరుమీద రిజిస్ట్రేషన్ చేయాలని, ఇంతకాలం నుంచి ఆమెను పోషిస్తున్నది తామే అని ఆమె వదిన, వరదలు, పిల్లలూ పట్టుబట్టారు. ఈ నేపథ్యంలో ఎమ్మార్వో ఆఫీసులో ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది.

ఈ సమయంలో తన భర్తను ఇంతకాలం చుసిన ఆయన సోదరుల పేరిట మృతుడి భార్య ఎకరన్నర... తనను ఇంతకాలం సాకిన ఆమె వదిన, మరదలు చెరో అరెకరం భూమిని పట్టా చేయించుకునేందుకు స్లాట్‌ బుక్‌ చేసుకున్నారు. దీంతో బుధవారం సాయంత్రం ఇరువర్గాల బంధువులూ అంత్యక్రియలు నిర్వహించారు.

ఇదంతా ఒకెత్తు అయితే... ఆస్తుల రిజిస్ట్రేషన్‌ కోసం అయినవారంతా కలిసి మృతదేహాన్ని ఇంటి ముందు వదిలి వెళ్లడంతో .. వృద్ధురాలైన తల్లి తన కుమారుడి శవానికి ఒంటరిగా కాపలా కాయడం మరొకెత్తు. ఈ సంఘటన చూసినవారి గుండె వరువెక్కగా... విషయం తెలుసుకున్న వారి మనసును ఈ సంఘటన కలిచివేస్తోంది!