Begin typing your search above and press return to search.

అన్నింటికీ మాటలే కాదు... పెదనాన్నతో వినేశ్ ఎమోషనల్ వైరల్!

ఈ సందర్భంగా ఆమెకు ఢిల్లీ విమానాశ్రయంలో భారీ ఎత్తున తరలివచ్చిన అభిమానుల నుంచి ఘన స్వాగతం లభించింది

By:  Tupaki Desk   |   18 Aug 2024 12:27 PM GMT
అన్నింటికీ మాటలే కాదు... పెదనాన్నతో వినేశ్ ఎమోషనల్ వైరల్!
X

భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగాట్ పారిస్ నుంచి భారత్ కు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆమెకు ఢిల్లీ విమానాశ్రయంలో భారీ ఎత్తున తరలివచ్చిన అభిమానుల నుంచి ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా రెజ్లర్లు బజరంగ్ పూనియా, సాక్షి మాలిక్ తదితరులు ఇందులో పాల్గొన్నారు. అయితే అంతక ముందు ఆమె చేసిన ట్వీట్ పై వచ్చిన విమర్శలకు తాజాగా ఆమె చేతల్లో చెప్పినట్లున్న సమాధానం వైరల్ గా మారింది.

అవును... భారత్ కు వచ్చే ముందు వినేశ్ పెట్టిన సుధీర్ఘమైన పోస్టులో మహవీర్ ప్రస్తావన లేకపోవడంతో పలువురు విమర్శలు చేశారు. ఇందులో భాగంగా.. “వినేశ్.. నువ్వు రాసిన పోస్ట్ చాలా బాగుంది.. అందులో నువ్వు మీ పెదనాన్న మహవీర్ ఫోగాట్ ను మరిచిపోయినట్లున్నావు.. నీ రెజ్లింగ్ కెరీర్ కు పునాది వేసిన వ్యక్తి ఆయన.. దేవుడు నీకు స్వచ్ఛమైన తెలివిని ఇవ్వాలని కోరుకుంటున్నా" అని పోస్ట్ పెట్టాడు ఆమె సోదరి భర్త, రెజ్లర్ పవన్ సరోహా.

అయితే... ఈ ట్వీట్ కు ఆమె మాటలతో సమాధానం చెప్పలేదు. అవన్నీ నిజం కాదని నిరూపిస్తూ అన్నట్లుగా తాజాగా ఆమె తన పెదనాన్న మహవీర్ ను కలిసిన వీడియోలు తెరపైకి వచ్చాయి. తన స్వగ్రామం హరియాణాలోని బలాలికి అర్ధరాత్రి చేరుకున్న వినేశ్ కు అపూర్వ స్వాగతం లభించింది. ఈ సందర్భంగా ఆమెను ఆప్యాయంగా కౌగిలించుకున్నారు మహవీర్. ఈ సందర్భంగా ఆయన భావోద్వేగానికి గురయ్యారు.

ఈ సమయంలో వినేశ్ కూడా కంటతడి పెట్టుకొంది. ఈ సందర్భంగా ఓ ఆసక్తికరమైన చర్చ తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా... పారిస్ ఒలింపిక్స్ లో 50 కేజీల విభాగంలో ఫైనల్ కు దూసుకెళ్లిన వినేశ్ పై అనర్హత వేటు పడింది. దీంతో.. ఆమె అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఆమె రెజ్లింగ్ కు వీడ్కోలు పలికింది. ఈ సమయంలో... ఆమె రిటైర్మెంట్ నిర్ణయంపై వెనక్కి వచ్చేలా ఒప్పిస్తానని ఆమె పెదనాన్న మహవీర్ ఫోగాట్ చెప్పారు.

దీంతో.. తాజాగా మహవీర్ ఆమెను రెజ్లింగ్ కు ప్రకటించిన రిటైర్మెంట్ వెనక్కి తీసుకునేలా ఒప్పించే అవకాశం ఉందని, వచ్చే ఒలింపిక్స్ లో ఆమెను చూస్తామనే నమ్మకం ఉందని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

వినేశ్ కు 700 కిలోల లడ్డు గిఫ్ట్!:

తమ గ్రామ బిడ్డ పారిస్ ఒలింపిక్స్ కు వెళ్లి వచ్చినందుకు బలాలిలోని పౌరులంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీ నుంచి గ్రామానికి చేరుకున్న సమయంలో ఆమె రాక కోసం ఎదురుచూసిన స్థానికులు ఓ బహుమతి ఇచ్చారు. ఇందులో భాగంగా.. ఆ గ్రామానికి చెందిన వాచ్ మన్ రూ.100 బహుమతిగా ఇచ్చారు. ఈ క్రమంలో గ్రామం అంతా కలిసి ఆమెకు రూ.21 వేలు బహుమతిగా అందించడం గమనార్హం.

ఇది పెద్ద మొత్తమా చిన్న మొత్తమా అన్నది విషయం కాదు.. ఆ గ్రామ ప్రజలు ఆమెపై ఇలా తమ ప్రేమను చూపించారు. ఇదే క్రమంలో.. 750 కేజీల లడ్డూలను తయారు చేసి అందించారు.