చేతి పార్టీలో చేరికల లొల్లి !
జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ చేరికతో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అలక వ్యవహారం ఢిల్లీకి చేరింది.
By: Tupaki Desk | 29 Jun 2024 12:30 PM GMTబీఆర్ఎస్ పార్టీని బలహీన పరచాలి అనే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ వేసిన చేరికల ఎత్తుగడ ఆ పార్టీలో వివాదాలకు దారితీస్తుంది. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ చేరికతో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అలక వ్యవహారం ఢిల్లీకి చేరింది. తాజాగా చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య ఢిల్లీలో సీఎం రేవంత్, రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ దీప్ దాస్ మున్షీ సమక్షంలో కాంగ్రెస్ లో చేరడం నియోజకవర్గంలో కాకరేపింది.
ఢిల్లీలో యాదయ్య చేరికను నిరసిస్తూ వికారాబాద్ జిల్లా నవాబు పేట్ మండల కేంద్రంలో 'గో బ్యాక్ ఎమ్మెల్యే కాలే యాదయ్య' పేరుతో కాంగ్రెస్ లో చేరడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నిరాహార దీక్షకు కూర్చున్నారు. యాదయ్య కాంగ్రెస్ పార్టీలో చేరడం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉందని, అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై కేసులు పెట్టించాడని ఆవేదన వ్యక్తంచేశారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఉంది అని అన్న ఎమ్మెల్యే యాదయ్యను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడం హాస్యాస్పదం అని వారు అంటున్నారు. ఇటీవలి ఎన్నికల్లో యాదయ్య కాంగ్రెస్ అభ్యర్థి పామెన భీం భరత్ పై కేవలం 268 ఓట్ల అత్యల్ప మెజారిటీతో గెలవడం గమనార్హం. రాష్ట్రంలో ఇదే అత్యల్ప మెజారిటీ. ఇక్కడ పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి కేఎస్ రత్నంకు 38455 ఓట్లు, నోటాకు 1423 ఓట్లు రావడం గమనార్హం.