Begin typing your search above and press return to search.

ఈసారి ఆ పతకం ఒక్కరికే.. అతడు మనోడే.. ఎంతటి సాహసమంటే?

ప్రాణాలను లెక్క చేయకుండా ప్రతిఘటించిన యాదయ్యకు పురస్కారం కోసం రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులు కేంద్ర హోంశాఖకు సిఫార్సు చేశారు.

By:  Tupaki Desk   |   15 Aug 2024 3:50 AM GMT
ఈసారి ఆ పతకం ఒక్కరికే.. అతడు మనోడే.. ఎంతటి సాహసమంటే?
X

పంద్రాగస్టును పురస్కరించుకొని విధి నిర్వహణలో ప్రాణాలకు తెగించిన తెలంగాణకు చెందిన పోలీస్ హెడ్ కానిస్టేబుల్ యాదయ్యకు రాష్ట్రపతి శౌర్య పతకాన్ని ప్రకటించారు. ఈ పతకం ప్రత్యేకత ఏమంటే.. ఈసారి ఈ పతకం దేశంలో యాదయ్య ఒక్కరికి మాత్రమే ప్రకటించారు. ఇంతకూ అంతటి ధైర్యసాహసాల్ని ప్రదర్శించిన సందర్భం ఏమిటి? ఆ సందర్భంగా అతను ఎదుర్కొన్న సవాళ్లు ఏంటి? అన్న విషయంలోకి వెళితే.. రెండేళ్ల క్రితం గొలుసు దొంగను పట్టుకునే క్రమంలో ఏడుసార్లు కత్తిపోట్లకు గురైనా వెరవకుండా ప్రతిఘటించి పట్టుకోవటమే అతని సాహసంగా చెప్పాలి.

రాష్ట్రపతి శౌర్యపతకం ఒక హెడ్ కానిస్టేబుల్ స్థాయి పోలీసుకు లభించటం చాలా అరుదుగా చెబుతారు. ఎందుకంటే.. ఈ పతకం ఉగ్రవాద.. తీవ్రవాద కార్యకలాపాల నియంత్రణ వంటి ఆపరేషన్లలో పాల్గొనే సీఏపీఎఫ్ బలగాలు.. వివిధ విభాగాల పోలీసులకు దక్కుతుంది. అయితే.. ఉన్నతాధికారుల రిపోర్టులు యాదయ్యకు ఈ పతకం దక్కేలా చేసింది. 2022 జులై 25న సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని మాదాపూర్ ప్రాంతంలో కాత్యాయని అనే 72 ఏళ్ల మహిళ ఇంటి సమీపంలో నడుస్తుంటే.. బైక్ మీద వచ్చిన ఇద్దరు దొంగలు ఆమె గొలుసును లాక్కెళ్లే ప్రయత్నం చేశారు. ఆమె గొలుసును ఒడుపుగా పట్టుకోవటంతో కొంతమేర తెంచుకెళ్లారు.

ఈ ఘటనపై మాదాపూర్ పోలీసులకు కంప్లైంట్ రావటంతో మాదాపూర్ సీసీఎస్ హెడ్ కానిస్టేబుల్ యాదయ్యతో పాటు కానిస్టేబుళ్లు రవి.. దేబేశ్ టీంగా ఏర్పడి సీసీ కెమేరాలు జల్లెడ వేశారు. తర్వాతి రోజు మియాపూర్ లోని బొల్లారం ఎక్స్ పోర్డు వద్ద గొలుసు దొంగలు ఉన్నట్లుగా గుర్తించి.. అక్కడకువెళ్లారు. రెండు టూవీలర్ల మీద వెళ్లారు. ఒక టూవీలర్ వెనుక వైపు యాదయ్య కూర్చున్నాడు. మొత్తానికి వారిని గుర్తించి వెంబడించారు. వారిని అదుపులోకి తీసుకొనేందుకు ప్రయత్నించారు.

ఈ సందర్భంగా నిందితుల్లోని 19 ఏళ్ల రాహుల్ బైక్ నడుపుతుంటే.. వెనుక కూర్చున్న ఇషాన్.. పోలీసులు తమను అడ్డగించారన్న విషయం తెలిసినంతనే కత్తి తీశాడు. అతడ్ని పట్టుకునే ప్రయత్నం చేసిన యాదయ్యను ఏడుసార్లు కత్తితోపొడిచాడు. పొట్ట.. ఛాతి.. వీపు.. ఎడమ చెయ్యి ప్రాంతాల్లో కత్తిపోట్లు తగిలినా.. రక్తం కారుతున్నా.. తీవ్రమైన నొప్పితో ఇబ్బంది పడుతున్నా.. ఇషాన్ ను వదలకుండా పట్టుకున్నాడు. ఈలోపు ఇద్దరు పోలీసులు రాహుల్ ను పట్టుకున్నారు. పట్టపగలు.. నడిరోడ్డు మీద పోలీసులు.. దొంగలకు మధ్య జరిగిన ఈ ఘర్షణ కలకలం రేపింది.

ఈ విషయం గురించి సమాచారం అందుకున్న పోలీసులు వెళ్లటం.. యాదయ్యను ఆసుపత్రికి తరలించారు.తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చేరిన యాదయ్య 17రోజులుఅక్కడే ఉన్నాడు. ఆ తర్వాత మూడుసార్లు అతడికి సర్జరీలుజరిగాయి. విచారణలో భాగంగా వీరి నుంచి పిస్టల్స్.. బంగారు గొలుసులు స్వాధీనం చేసుకున్నారు. గొలుసు దొంగతనాలతో పాటు.. ఆయుధాల విక్రయ దందా చేస్తారని తేలింది.

ప్రాణాలను లెక్క చేయకుండా ప్రతిఘటించిన యాదయ్యకు పురస్కారం కోసం రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులు కేంద్ర హోంశాఖకు సిఫార్సు చేశారు. దీంతో ఆయనకు అరుదైన రాష్ట్రపతి శౌర్య పతకం లభించింది. యాదయ్యతో పాటు తెలంగాణ రాష్ట్ర పోలీసు శాఖకు చెందిన మరో 28 మంది అధికారులకు పలు పురస్కారాలు లభించాయి.ఏపీలోనూ పలువురు పోలీసు అధికారులు పతక పురస్కారానికి ఎంపికయ్యారు.