Begin typing your search above and press return to search.

సొరంగంలో ఫ్యామిలీతో యాహ్యా సిన్వర్... సంచలన వీడియో!

ఈ వీడియోని తాజాగా ఐడీఎఫ్ విడుదల చేసింది. ఈ వీడియోలో... గాజాలోని సొరంగంలో హమాస్ అధినేత సిన్వర్ ఫ్యామిలీతో కలిసి పలు వస్తువులను తరలిస్తున్నట్లు కనిపిస్తుంది.

By:  Tupaki Desk   |   20 Oct 2024 3:56 AM GMT
సొరంగంలో ఫ్యామిలీతో యాహ్యా సిన్వర్... సంచలన వీడియో!
X

గత ఏడాది అక్టోబర్ 7న ఇజ్రాయెల్ పై దాడిన దాడుల్లో 1,200 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ దాడుల సూత్రదారి, వ్యూహకర్త అయిన హమాస్ అధినేత యాహ్యా సిన్వర్ మృతిచెందినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. ఈ విషయాన్ని హమాస్ కూడా ధృవీకరించింది. ఈ సమయంలో సిన్వార్ కు సంబంధించిన ఓ సంచలన వీడియో వెలుగులోకి వచ్చింది.

అవును... 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్ పై హమాస్ మిలిటెంట్ల దాడికి కొన్ని గంటల ముందుదిగా చెబుతున్న ఓ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. ఈ వీడియోని తాజాగా ఐడీఎఫ్ విడుదల చేసింది. ఈ వీడియోలో... గాజాలోని సొరంగంలో హమాస్ అధినేత సిన్వర్ ఫ్యామిలీతో కలిసి పలు వస్తువులను తరలిస్తున్నట్లు కనిపిస్తుంది.

ఇందులో భాగంగా... సిన్వర్, అతని భార్య పిల్లలు.. నీరు, దిండ్లు, పరుపులు, టీవీ సహా పలు వస్తువులను సొరంగంలోకి తరలిస్తున్నట్లుగా తాజాగా విడుదలైన వీడియోలో కనిపిస్తుంది. ఇప్పుడు ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఈ టన్నెల్లో టాయిలెట్లు, షవర్లు, కిచెన్, ఆహారం నగదు లభ్యమైనట్లు ఇజ్రాయెల్ ఆర్మీ తెలిపింది.

ఇక ఇటీవల సిన్వార్ చివరి క్షణాలు అంటూ ఐడీఎఫ్ ఓ వీడియోను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఆ వీడియోలో ధ్వంసమైన ఓ భవనంలో సోఫా చైర్ లో కూర్చున్న సిన్వర్... తనను షూట్ చేస్తున్న డ్రోన్ పైకి కర్రలాంటి వస్తువును విసురుతున్నట్లు ఉంది. అయితే.. సిన్వర్ తలలోకి బుల్లెట్ దిగడంతో మృతిచెందినట్లు పోస్టుమార్టం నివేదికలో వెల్లడైనట్లు చెబుతున్నారు.

కాగా... 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్ పై జరిగిన దాడిలో సుమారు 1,200 మంది మరణించిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో... 235 మందిని బందీలుగాను పట్టుకెళ్లిపోయారు. దీంతో... గాజాపై ఇజ్రాయెల్ దాడులు మొదలుపెట్టింది. ఈ దాడుల్లో ఇప్పటివరకూ సుమారు 45,000 మంది వరకూ మరణించారని.. లక్ష మందికి పైగా గాయపడ్డారని గాజా హెల్త్ డిపార్ట్మెంట్ తెలిపింది.