Begin typing your search above and press return to search.

కనుమ రోజు చంద్రబాబుకి యమ టెన్షన్...!

అయితే అదే రోజున దేశ అత్యున్నత న్యాయస్థానం తెలుగుదేశం అధినేత చంద్రబాబు క్వాష్ పిటిషన్ మీద తీర్పు వెలువరించబోతోంది

By:  Tupaki Desk   |   15 Jan 2024 2:19 PM GMT
కనుమ రోజు  చంద్రబాబుకి  యమ టెన్షన్...!
X

తెలుగు వారికి పెద్ద పండుగగా సంక్రాంతి చెప్పుకుంటారు. భోగీ, సంక్రాంతి కనుమ ఈ మూడు రోజులూ తెలుగు వారు మరచిపోలేని పండుగలు. ముచ్చటైన పండుగలు. ఇందులో రెండు గడచాయి. కనుమ ఉంది. అయితే అదే రోజున దేశ అత్యున్నత న్యాయస్థానం తెలుగుదేశం అధినేత చంద్రబాబు క్వాష్ పిటిషన్ మీద తీర్పు వెలువరించబోతోంది

జస్టిస్ అనిరుద్ధబోస్, జస్టిస్ బేలా ఎం త్రివేదీలతో కూడిన ధర్మాసనం ఈ నెల 16న మధ్యాహ్నం తీర్పు వెలువరించబోతోంది. స్కిల్ స్కాం లో చంద్రబాబుని గత ఏడాది సెప్టెంబర్ 9న ఏపీ సీఐడీ అవినీతి నిరోధక చట్టం ప్రకారం

అరెస్టు చేసింది. అయితే చంద్రబాబుని అరెస్ట్ చేసే ముందు గవర్నర్ అనుమతి తీసుకోవాలన్నది అవినీతి నిరోధక చట్టంలో సెక్షన్ 17 ఏ లో చేర్చారు.

ఇది చంద్రబాబుకు వర్తిస్తుందా లేదా అన్నది సుప్రీంకోర్టు కనుమ రోజున తీర్పు చెప్పబోతోంది. చంద్రబాబుకు వర్తిస్తుందని, ఆయన్ని నిబంధలనకు విరుద్ధంగా అరెస్ట్ చేశారని ఆయన అరెస్ట్ చెల్లదని తెలుగుదేశం తరఫున న్యాయవాదులు సుప్రీం కోర్టులో వాదించారు. అయితే స్కిల్ స్కాం జరిగింది 2015 2016ల మధ్యలో కాబట్టి ఆ తరువాత వచ్చిన సెక్షన్ 17 ఏ బాబుకు వర్తించదు అని ప్రభుత్వం తరఫున న్యాయవాదులు వాదించారు.

ఈ రెండు వాదనలు విన్న సుప్రీంకోర్టు ఈ తీర్పుని రిజర్వ్ చేసింది. ఇది జరిగి దాదాపుగా రెండు నెలలు గడచింది. ఈ సెక్షన్ 17 ఏ మీదనే మిగిలిన కేసులు ఆధారపడి ఉన్నాయి. ఇక చంద్రబాబు మీద దాదాపుగా అరడజన్ కేసులను ఏపీ సీఐడీ పెట్టింది. అన్నిట్లో బాబులు బెయిల్ అయితే వచ్చింది కానీ ఈ కేసులు అలా నిలిచే ఉన్నాయి. అయితే సెక్షన్ 17 ఏ వర్తిస్తుంది అని కనుక కోర్టు తీర్పు ఇస్తే బాబు మీద పెట్టిన అన్ని కేసులూ పోతాయి.

దాంతో చంద్రబాబు ఫ్రీ బర్డ్ అవుతారు. అంతే కాదు ఆయన వైసీపీ మీద రాజకీయంగా కూడా గట్టిగా విమర్శలు చేయవచ్చు. తనను అకారణంగా అరెస్ట్ చేశారు అది పూర్తి కక్ష సాధింపు చర్య అని కూడా జనంలోకి వెళ్ళి చెప్పవచ్చు. అంతే కాదు తాను నిప్పుని అని చెప్పుకోవచ్చు. తన నాలుగున్నర దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ జీవితంలో కడిగిన ముత్యంగానే ఉన్నాను అని కూడా చెప్పవచ్చు.

అదే క్వాష్ పిటిషన్ ని కోర్టు కొట్టేస్తే బాబు యధాతధంగా ఈ కేసుల గురించి మాట్లాడకుండా ఎన్నికల ప్రచారం చేసుకోవాలి. ఆ కేసుల విచారణకు హాజరవాలి. ఆయన కూడా జగన్ మాదిరిగా బెయిల్ మీద ఉన్న వారిగానే ఉంటారు. ఇక ఈ కేసులలో పూర్తి బలం ఉందని అందుకే అరెస్ట్ చేశామని చెప్పేందుకు వైసీపీకి వేయి ఏనుగుల శక్తి వస్తుంది.

మొత్తానికి ఏపీ రాజకీయాలను అట్టు అటు నుంచి ఇటు తిరగవేసే విధంగా ఈ కోర్టు తీర్పు అయితే మార్చే అవకాశాలు నిండుగా మెండుగా ఉన్నాయి. దాంతో కనుమ పండుగ వేళ ఏమి జరగబోతోంది. బాబు కేసు విషయంలో ఆయనకు కొండంత వూరట దక్కుతుందా లేదా అనేది చూడాల్సి ఉంది. మొత్తానికి ఈ తీర్పునకు కౌంట్ డౌన్ అయితే మొదలైంది.