Begin typing your search above and press return to search.

వెన్నెల రాత్రులను కురిపించిన నాట్య యామిని!

ఆమె ఢిల్లీలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం సాయంత్రం తుది శ్వాస విడిచారు.

By:  Tupaki Desk   |   4 Aug 2024 3:23 AM GMT
వెన్నెల రాత్రులను కురిపించిన నాట్య యామిని!
X

ఆమె మరణం తో ఒక శకం ముగిసింది. ఆ నాట్య రవళి ఇక నిశ్శబ్ద రాగమైంది. ఆమె లేని లోటు పూడ్చలేనిది. ఆమె తిరిగి రాని లోకాలకు పయనమయ్యే వేళ భారతీయ కళా వేదికకి మౌన రోదనే మిగిలింది. ఆమె యామినీ కృష్ణమూర్తి. ఆమె ఢిల్లీలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం సాయంత్రం తుది శ్వాస విడిచారు.

యామినీ క్రిష్ణమూర్తి చిత్తూరు జిల్లా మదనపల్లి బిడ్డ. ఆమె 1940 డిసెంబర్ 20న జన్మించారు. ఆమె తండ్రి క్రిష్ణమూర్తి సంస్కృత పండితుడు. తాత ఉర్దూ కవి. అలా ఇంట్లోనే కళలు సాహిత్యం ఉన్నాయి. అందుకే అయిదేళ్ళ ప్రాయంలోనే యామినీ కృష్ణమూర్తి చెన్నైలోని రుక్మిణీదేవి అరండేల్ కళాక్షేత్రంలో భరత నాట్యము నేర్చుకోవడము ప్రారంభించారు.

ఆమె భరతనాట్యంలో ఎంతో మంది దిగ్గజ గురువుల వద్ద శిక్షణ పొందారు. కాంచీపురం ఎల్లప్ప పిళ్ళై, చొక్కలింగం పిళ్లై, బాలసరస్వతి, తంజావూర్ కిట్టప్ప, దండాయుధపాణి, మైలాపూర్ గౌరి అమ్మ ఆమెకు భరత నాట్యాన్ని అద్భుతంగా నేర్పించారు.

కూచిపూడిని ఆమె వేదాంతం లక్ష్మీనారాయణ శాస్త్రి, చింతా కృష్ణమూర్తి, పసుమర్తి వేణుగోపాల కృష్ణశర్మ వంటి వారి వద్ద చేరి నేర్చుకున్నారు. ఇక ఒడిస్సీని పంకజ చరణ్‌దాస్, కేలూచరణ్ మహాపాత్రల వద్ద ఆమె అభ్యసించారు. అంతే కాదు ఎండి.రామనాథన్ దగ్గర కర్ణాటక సంగీతం, కల్పక్కం స్వామినాథన్ దగ్గర వీణ నేర్చుకున్న యామినీ కృష్ణమూర్తి బహుముఖ ప్రజ్ణా శాలిగా పిన్న వయసులోనే పేరు తెచ్చుకున్నారు.

ఆమె తన తొలి ప్రదర్శన పదిహేడేళ్ళ వయసులో అంటే 1957లో చెన్నైలో ఇచ్చారు. ఆమెకు ఇరవయ్యేళ్ళు వయసు వచ్చేసరికి ఆమె ప్రతిభ దేశీయంగా మారుమోగింది. దాంతో ఆమె ఢిల్లీకి తన నివాసాన్ని మార్చారు. ఆనాటి నుంచి ఆమె కొన్ని వేల ప్రదర్శనలు ఇస్తూ తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకున్నారు.

ప్రత్యేకించి కూచిపూడికి అంతర్జాతీయ స్థాయిలో పేరు రావడానికి ఆమె చేసిన కృషి అమోఘం అని చెప్పాలి. సాధారణంగా ఒక బాణీలో నృత్యం చేస్తున్నపుడు మరో నృత్య రీతులను తెలిసీ తెలియకుండానే చాలా మంది నాట్యకారులు అందులో మేళవిస్తారు. కానీ దానికి భిన్నంగా ఆమె ఏ నృత్య బాణీలో ప్రదర్శన ఇస్తే దానినే సంపూర్ణంగా చేస్తూ ఆహుతూలను ఆకట్టుకోవడంలో దిట్ట. సశాస్త్రీయంగా సాధికారికంగా ఆమె భరత నాట్యం, కూచిపూడి వంటి వాటి మీద పట్టు సాధించారు.

దేశ విదేశాలలో ఎందరో ప్రముఖుల వద్ద యామినీ కృష్ణమూర్తి తన ప్రదర్శనలు నిర్వహించి పేరు తెచ్చుకున్నారు. వారు ప్రశంసలు అందుకున్నరు. క్షీరసాగర మథనం అనే నృత్యనాటికను అప్పటి భారత రాష్ట్రపతి సర్వేపల్లి రాధాక్రిష్ణన్ ముందు ప్రదర్శించి ఆయన నుంచి ఆమె భామావేణీ బిరుదును అందుకోవడం ఒక మధుర జ్ఞాపకం గా చెప్పుకోవాలి.

భారతీయ నృత్యాన్ని ఆమె ఖండాంతరాలకు తీసుకుని వెళ్ళి ఆ ఖ్యాతీని నలు చెరగులా విస్తరింప చేసిన క్రమంలో వచ్చిన బిరుదులు గౌరవాలూ ఎన్నో ఉన్నాయి. అందులో కేవలం 28 ఏళ్ల వయసులో ఆమెకు పద్మశ్రీ బిరుదు లభించింది. ఆ తరువాత 2001లో పద్మభూషణ్ బిరుదు, 2016లో పద్మ విభూషణ్ బిరుదు ఆమెను వరించాయి. ఒక విధంగా చెప్పాలంటే ఆమె భారతరత్నకు నూరు శాతం అర్హురాలు.

ఢిల్లీలోనే ఆమె జీవితమంతా గడుపుతూ తన పేరిట ఒక నృత్య కళాశాలను స్థాపించి ఎందరో శిష్య ప్రశిష్యులను తయారు చేసి దేశానికి అందించారు. ఆమె జీవితకాలం తపస్సుగా నాట్య కళను ఎంచుకున్నారు. ఈ క్రమంలో ఆమె అవివాహితగా మిగిలిపోయారు. ఆమె జీవితాన్ని అలా ధన్యం చేసుకున్నారు.

భారతీయ నృత్య కళకు ఆమె చేసిన సేవ అపారమైనదిగా చెప్పాలి. నృత్యకళ పట్ల జనసామాన్యంలో అవగాహన కలిగించడానికి అభిరుచి పెంచడానికి సుమారు మూడేండ్ల పాటు పరిశోధన చేసి యామినీ క్రిష్ణమూర్తి రూపొందించిన నృత్యమూర్తి అన్న సీరియల్‌ను పదమూడు భాగాలుగా దూరదర్శన్ ప్రసారం చేసింది. ఇది ఆమెకు నృత్య కళ పట్ల తపనకు అద్దం పడుతుంది.

అదే విధంగా 2017లో విశాఖపట్నంలో విశాఖ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ అకాడమీ వారు యామినీ క్రిష్ణమూర్తికి స్వర్ణకమలం బహూకరించి నాట్య విద్యాభారతి అనే బిరుదుతో ఇచ్చి సత్కరించారు. అంతే కాదు న్యూఢిల్లీలోని ఇందిరా ప్రియదర్శిని ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ మ్యూజిక్ అండ్ డాన్స్ అనే సంస్థకు ఈమె డైరెక్టరుగా చిరకాలం సేవలను అందించారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి ఆమె అస్థాన నర్తకిగా ఎంతో కాలం పనిచేశారు.

ఆమె మరణంతో ఒక అద్భుతమైన కళా మూర్తి భువి నుంచి దివికి ఏగినట్లు అయింది. ఆ తరం మళ్ళీ రాదు, ఆ తపన మళ్ళీ కనిపించదు. ఆమె పేరులో యామిని ఉంది. కానీ ఆమె వెన్నెలలను రాత్రిలోనూ కురిపించారు. తన కళా కాంతులలో యామిని భామినిని పులకరింపచేశారు.