యనమలకు పట్టు చిక్కలేదు.. రాజా పట్టు వీడలేదు.. తునిలో హైడ్రామా
ఏపీ మున్సిపాలిటీలలో పవర్ గేమ్ నడుస్తోంది. ఇటీవల జరిగిన మున్సిపల్ ఉప ఎన్నికల్లో మేయర్, డిప్యూటీ మేయర్, మున్సిపల్ ఛైర్మన్ పీఠాలపై వరుసగా టీడీపీ జెండా ఎగరేస్తోంది.
By: Tupaki Desk | 19 Feb 2025 11:36 AM GMTఏపీ మున్సిపాలిటీలలో పవర్ గేమ్ నడుస్తోంది. ఇటీవల జరిగిన మున్సిపల్ ఉప ఎన్నికల్లో మేయర్, డిప్యూటీ మేయర్, మున్సిపల్ ఛైర్మన్ పీఠాలపై వరుసగా టీడీపీ జెండా ఎగరేస్తోంది. స్థానిక సంస్థల్లో బలం లేకపోయినా రాష్ట్రంలో తిరుగులేని అధికారం దక్కించుకోవడంతో నగర, పట్టణ స్థానిక సంస్థల్లో టీడీపీలోకి వలసలు ఎక్కువయ్యాయి. ఇలా పార్టీ ఫిరాయించిన చోట వైసీపీకి షాక్ ఇస్తూ టీడీపీ పాగా వేస్తోంది. కానీ, ఒకే ఒక్కచోట టీడీపీకి పరిస్థితి అనుకూలించడం లేదని చెబుతున్నారు. ఇరుపార్టీల్లో యోధును యోధుల్లాంటి లీడర్లు ఉండటంతో ఆ ఒక్క మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక టామ్ అండ్ జెర్రీ పోరులా పీక్ లెవల్ లో సాగుతోంది.
రాష్ట్రంలో తిరుగులేని అధికారం చెలాయిస్తున్న టీడీపీకి కాకినాడ జిల్లా తునిలో మాత్రం ఎదురుదెబ్బలే తగులుతున్నాయి. వరుసగా నాలుగుసార్లు తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా పడటం ఇక్కడ టీడీపీ ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటుందనేదానికి ఉదాహరణగా చెబుతున్నారు పరిశీలకులు. టీడీపీ సీనియర్ నేత యనమల రంగంలోకి దిగినా మున్సిపాలిటీ మాత్రం పట్టు సాధించలేకపోతున్నారు. ఇటీవలే ఆరుగురు కౌన్సిలర్లకు గాలం వేసి వైసీపీకి షాక్ ఇచ్చినా, వైస్ చైర్మన్ ఎన్నికకు కావాల్సిన బలం సమకూర్చుకోవడంలో యనమల విఫలమవుతున్నారని అంటున్నారు. వైసీపీ నేత, మాజీ మంత్రి దాడిశెట్టి రాజాకు పార్టీ క్యాడరుపై పట్టు ఉండటంతో యనమల పాచికలు పారడం లేదని ప్రచారం జరుగుతోంది.
మాజీమంత్రి యనమల రామకృష్ణుడు కూతురు యనమల దివ్య ప్రస్తుతం తుని ఎమ్మెల్యేగా ఉన్నారు. పాతికేళ్ల పాటు ఎమ్మెల్యేగా పనిచేసి టీడీపీ ప్రభుత్వాల్లో తిరుగులేని నేతగా చెలమనీ అయిన యనమలకు తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక సవాల్ విసురుతోంది. పార్టీ అధికారంలో ఉన్నా, కూతురు ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నా మున్సిపల్ వైస్ ఛైర్మన్ పీఠాన్ని దక్కించుకునేందుకు మాత్రం యనమల కిందా మీదా పడుతున్నారని అంటున్నారు. నెల రోజుల్లో నాలుగు సార్లు ఎన్నిక వాయిదా పడిందంటేనే తునిలో టీడీపీ ఎంత క్లిష్ట పరిస్థితి ఎదుర్కొంటోందో అర్థమవుతోందని అంటున్నారు.
గత స్థానిక సంస్థల ఎన్నికల్లో తుని మున్సిపాలిటీలో టీడీపీకి ఒక్క సీటు రాలేదు. మొత్తం కౌన్సిలర్లను ఏకగ్రీవం చేసుకున్న వైసీపీ చైర్మన్ గిరీని సొంతం చేసుకుంది. అయితే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మున్సిపల్ వైస్ చైర్మన్ పదవి ఖాళీ అయింది. మున్సిపాలిటీలో మొత్తం 30 మంది కౌన్సిలర్లు ఉంటే అందులో ఒకరు చనిపోగా, మరొకరు రాజీనామా చేశారు. 28 మందిలో పది మంది ఈ మధ్యే టీడీపీ జెండా కప్పుకున్నారు. వైస్ ఛైర్మన్ ప్రస్తుతం న్యూట్రల్‌గా ఉంటున్నారు. మిగిలిన 17మంది వైసీపీకి మద్దతుదారులుగా మాజీ మంత్రి దాడిశెట్టి రాజా నాయకత్వాన్ని బలపరుస్తున్నారు. దీంతో వైస్ చైర్మన్ పీఠం గెలుచుకోవడం టీడీపీకి తలనొప్పిగా మారింది. ఒక్కరూ లేని చోట పది మంది మద్దతు కూడగట్టినా ఇంకా నలుగురి మద్దతు అవసరమవడమే టీడీపీకి సీనియర్ నేత యనమలకు సవాల్ విసురుతున్నట్లైంది. మరో నలుగురు సభ్యులు మద్దతు పలికితే ఎక్స్ అఫిషియో కింద ఎమ్మెల్యే ఓటుతో కలిపి వైస్ చైర్మన్ పీఠాన్ని దక్కించుకోవచ్చని టీడీపీ ప్లాన్ చేస్తోంది.
అయితే వైసీపీ నేత, మాజీ మంత్రి దాడిశెట్టి రాజా ఈ విషయంలో పట్టువీడటం లేదు. తన వర్గం కౌన్సిలర్లను కాపాడుకుంటూ, యనమల రాజకీయాన్ని చాలెంజ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే 15 రోజుల నుంచి మూడుసార్లు వైస్ ఛైర్మన్ ఎన్నిక వాయిదా వేయాల్సివచ్చింది. దీంతో తుని పట్టణంలో హైటెన్షన్ కొనసాగుతోంది. అయితే తమతో టచ్ లోకి వచ్చిన నలుగురు కౌన్సిలర్లను వైసీపీ నేతలు కిడ్నాప్ చేసి సెల్‌ఫోన్లు స్విచ్ ఆఫ్ చేయించారని టీడీపీ ఆరోపిస్తోంది. తమ సభ్యులను ప్రలోభపెట్టి వైస్ ఛైర్మన్ పదవిని దక్కించుకోవాలని టీడీపీ కుట్ర చేస్తోందని ఫ్యాన్ పార్టీ లీడర్లు మండిపడుతున్నారు. వైస్ చైర్మన్ ఎన్నిక ద్వారా తన బలాన్ని చూపించుకునేందుకు ఇటు యనమల, అటు దాడిశెట్టి రాజా ఎత్తుకుపై ఎత్తు వేస్తుండటం ఆసక్తికరంగా మారింది. ఎన్నిక జరిగే రోజు ఛలో తుని అంటూ పిలుపునిస్తున్న వైసీపీ పొలిటికల్ హీట్ క్రియేట్ చేస్తోంది. అయితే అధికారంలో ఉండి కూడా వైసీపీపై అప్పర్ హ్యాండ్ సాధించడంలో యనమల వెనుకబడిపోతున్నారని, వైసీపీ నేత దాడిశెట్టి రాజా వ్యూహానికి తగ్గట్లుగా యనమల కౌంటర్ యాక్షన్ ప్లాన్ ఉండటం లేదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే నాలుగోసారి కూడా తుని వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా పడిందని అంటున్నారు. ఇలా అయితే ప్రస్తుత పాలకవర్గం ఉండగా, రెండో మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక జరిగే పరిస్థితి కనిపించడం లేదని అంటున్నారు.