Begin typing your search above and press return to search.

టీడీపీలో కలకలం రేపిన యనమల...తోకలు తగిలించి మరీ !

తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు టీడీపీ మీద బీసీ బాణం సంధించారు.

By:  Tupaki Desk   |   8 Dec 2024 2:30 PM GMT
టీడీపీలో కలకలం రేపిన యనమల...తోకలు తగిలించి మరీ !
X

తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు టీడీపీ మీద బీసీ బాణం సంధించారు. పైగా కులాల పేర్లు పెట్టి మరీ బీసీలకు అన్యాయం జరుగుతోంది అని ఆయన గట్టిగా గుచ్చేశారు. ఇది ఇపుడు టీడీపీతో పాటుగా బలమైన సామాజిక వర్గాలలోనూ చర్చ సాగుతోంది.

ప్రత్యేకించి కమ్మ కులం వారి వెనక చౌదరి అంటూ ట్యాగ్ తగిలించి మరీ ఆయన చంద్రబాబుకు రాసిన లేఖ వెనక ఆంతర్యం ఏమిటి అన్నది హాట్ హాట్ డిస్కషన్ గా మారింది. నిజానికి చూస్తే యనమలను అంతా పెద్ద మనిషిగా భావిస్తారు. ఆయన టీడీపీ పుట్టినప్పటి నుంచి అందులో ఉన్నారు. ఎన్నో సార్లు పదవులు అందుకున్నారు. ఈసారి కూడా ఆయనకు ఏమీ అన్యాయం జరగలేదు అన్నది అంతా అంటున్న మాట.

ఆయన కుమార్తెకు టికెట్ ఇచ్చి ఎమ్మెల్యేను చేశారు, ప్రభుత్వ విప్ పదవి దక్కింది. యనమలకు ఎమ్మెల్సీ పదవి ఉంది. ఆయన అల్లుడికి ఎంపీ సీటు ఇచ్చారు, వియ్యంకుడికి పదవి ఉంది. ఇలా అన్ని రకాలుగా టీడీపీలో పూర్తిగానే యనమలకు న్యాయం జరిగింది అని అంటున్నారు. అటువంటిది యనమల కాకినాడ పోర్టు విషయంలో బీసీలకే తీవ్ర అన్యాయం జరిగిందని. వారి భూములు తీసుకుని దశాబ్దాలుగా న్యాయం చేయడం లేదని కూటమి ప్రభుత్వానికి లేఖను సంధించడంతో అంతరార్ధం ఏమిటి అని అడుగుతున్నారు.

అంతే కాదు యనమల రాసిన లేఖలో కేవీ రావుని చౌదరి అని అలాగే మురళీ చౌదరి అని ప్రత్యేకంగా ట్యాగ్ పెట్టి మరీ రాయడం పట్ల అయితే అంతా చర్చిస్తున్నారు. ఆయనకు కమ్మ కులం మీద ద్వేషమా అని కూడా ఆ సామాజిక వర్గీయుల నుంచి వస్తున్న ప్రశ్న. కేవీ రావు కానీ మురళీ కానీ ఎపుడూ తమ పేరు చివరి కులం ట్యాగ్ పెట్టుకోలేదని మరి యనమల లేఖలో అలా రాయడం వెనక ఉద్దేశ్యం ఏమిటి అన్నది కూడా చర్చిస్తున్నారు.

దివీస్ ల్యాబ్ మురళీకి చౌదరి లేదని కేవీ రావు చౌదరి అని లేదు కానీ ఎందుకు లేఖ రాశారని కమ్మ పెద్దల నుంచి వస్తోంది. బీసీ రైతుల గురించి మాట్లాడితే అది వేరే విషయం అని కానీ ఇలా చేయడమేంటి అంటున్నారు.

కావాలని ఒక కులాన్ని అవహేళన చేసినట్లుగా ఉందని అంటున్నారు.

ప్రజాస్వామ్యం అని ఈ రోజు అంటున్న యనమల అపుడు ఎన్టీఆర్ ని స్పీకర్ గా ఉంటూ మాట్లాడకుండా బయటకు పంపించిన వ్యక్తి ఈయన అని అంటున్నారు. బీసీల పక్కన ఎపుడూ మాట్లాడని యనమల ఈ రోజు మాట్లాడమేంటని ఆయన అన్నారు. కాకినాడ ఎస్సీ జెడ్ చంద్రబాబు ఆరు నెలల పాలనలోనే వచ్చిందా అని అంటున్నారు. నాడు వైఎస్సార్ మీఎద బీసీలకు అన్యాయం అంటూ ఎందుకు పోరాటం చేయలేదని నిలదీస్తున్నారు.

బీసీలలో యనమల బిగ్ షాట్ కాదా అని ప్రశ్నిస్తున్నారు. యనమల రాజకీయాల్లోకి వచ్చినపుడు ఈ రోజుకు ఉన్న ఆస్తులు ఎన్ని అని రాజకీయ విశ్లేషకులు సుంకర వెంకటేశ్వరరావు ఒక యూట్యూబ్ చానల్ డిబేట్ లో గట్టిగానే కౌంటర్లు ఇచ్చారు.

యనమల పార్టీ వల్ల లాభపడ్డారని పార్టీకి ఆయన చేసిందేంటి అని ఆయన ప్రశ్నించారు. యనమల అసంతృప్తి తోనే ఈ విధంగా చేస్తున్నారు అని అనుకుంటున్నారని ఆయన చెబుతున్నారు. బీసీల గురించి ఇన్నాళ్ళూ మాట్లాడని యనమల ఇపుడు ఎందుకు మాట్లాడుతున్నారో చెప్పాలని అన్నారు.

యనమలలో అసంతృప్తి ఉందని ప్రజలు అనుకుంటున్నారని ఆయన అంటున్నారు. అన్ని పార్టీలూ కమ్మ వారినే టార్గెట్ చేస్తున్నారని ఆయన అన్నారు. ఏమి తప్పు చేశారు కమ్మ వారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. యనమల రామక్రిష్ణుడు బీసీల కోసం పోరాడితే చేసుకోవచ్చు కానీ కమ్మ వారిని ట్యాగ్ చేసి అవహేళన చేస్తామంటే చూస్తూ ఊరుకునేది లేదని సుంకర వెంకటేశ్వరరావు స్పష్టం చేశారు.