రాజా వారి కోటలో రామకృష్ణ రాజకీయం.. !
రాష్ట్ర వ్యాప్తంగా పలు మునిసిపాలిటీలలో వైసీపీ కౌన్సిలర్లను కూటమి నాయకులు ఆకర్షించి.. తమవైపు తిప్పుకున్న చందంగానే తునిలోనూ యనమల చక్రం తిప్పారు.
By: Tupaki Desk | 17 Feb 2025 2:45 AM GMTవైసీపీ కీలక నాయకుడు, మాజీ ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా కోటకు బీటలు వారుతున్నాయి. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని తునిలో తనకు తిరుగులేదని.. మాజీ మంత్రి, టీడీపీ నేత.. యనమల సామ్రాజ్యాన్ని కూకటి వేళ్లతో సహా పెకలించి వేశానని గతంలో చెప్పుకొన్న రాజా.. ఇప్పుడు చేతులు ఎత్తేసే పరిస్థితి ఏర్పడింది. ఇక, ఏమీ లేదు.. అంతా అయిపోయిందని భావిస్తున్న తరుణంలో అనూహ్యంగా యనమల పుంజుకున్నారు. తన సత్తాను చాటు కుంటున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా పలు మునిసిపాలిటీలలో వైసీపీ కౌన్సిలర్లను కూటమి నాయకులు ఆకర్షించి.. తమవైపు తిప్పుకున్న చందంగానే తునిలోనూ యనమల చక్రం తిప్పారు. ప్రస్తుతం ఇక్కడ ఆయన కుమార్తె దివ్య ఎమ్మెల్యేగా ఉన్నారు. రాష్ట్రంలో 12 మునిసిపాలిటీలో దాదాపు అధికారాన్ని కైవసం చేసుకున్న టీడీపీ.. ఇక్కడకూడా త్వరలోనే అధికారం చేపట్టే పరిస్థితి వచ్చింది. యనమల వ్యూహంతో ఇప్పటి వరకు తుని మునిసిపాలిటీలో 10 మందికిపైగా వైసీపీ కౌన్సిలర్లు.. సైకిల్ ఎక్కారు.
మరో ఐదారుగురు ఈ రోజు లేదా రేపు.. పార్టీ మారే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. వీరికి విందు లు ఏర్పాటు చేస్తూ..యనమల చేస్తున్నరాజకీయాన్ని రాజా అడ్డుకోలేక పోతున్నారన్న వాదన వైసీపీలో నూ వినిపిస్తోంది. ముఖ్యంగా కాపు సామాజిక వర్గానికి చెందిన వారే.. ఆయనకు దూరమవుతున్నారట. మరోవైపు.. టీడీపీలోకి వస్తే.. కాంట్రాక్టులు దక్కుతాయన్న ఆశ వైసీపీ కౌన్సిలర్లను మరింత రంజుగా ఆకట్టుకుంటోంది. ఈ పరిణామాలతో తుని రాజకీయాలు రోజు కో మలుపు తిరుగుతున్నాయి.
ఇదిలావుంటే.. యనమల రామకృష్ణుడి సోదరుడు కృష్ణుడు వైసీపీలోనే ఉన్నారు. కానీ, ఆయన కూడా.. మౌనంగానే వ్యవహరిస్తున్నారు. త్వరలోనే పాతగూటికి చేరిపోయే అవకాశం ఉందని.. అందుకే ఆయన ఇంత జరుగుతున్నప్పటికీ పట్టించుకోవడం లేదని అంటున్నారు. ఇక, తునిలో రాజకీయాలు గతానికి భిన్నంగా మారడం.. తిరిగి యనమల పుంజుకుంటుండడంతో వైసీపీ ఉంటుందా? ఊడుతుందా? అనే సందేహాలు కూడా తెరమీదికి వస్తున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.