యనమలకు చివరి బడ్జెట్ సెషన్ ?
యువ లాయర్ గా ఉంటూ అన్న గారి పిలుపు మేరకు రాజకీయాల్లోకి వచ్చిన వారు యనమల రామక్రిష్ణుడు.
By: Tupaki Desk | 18 Feb 2025 4:06 AM GMTయువ లాయర్ గా ఉంటూ అన్న గారి పిలుపు మేరకు రాజకీయాల్లోకి వచ్చిన వారు యనమల రామక్రిష్ణుడు. అప్పట్లో ఆయన తూర్పుగోదావరి జిల్లా తుని ఎమ్మెల్యేగా గెలిచి రికార్డు క్రియేట్ చేశారు. అలా ఎన్టీఆర్ తొలి మంత్రివర్గంలో న్యాయ, పురపాలక శాఖ బాధ్యతలు నిర్వహించారు. అంతే కాదు 1985-89 మధ్య మంత్రిగా, 1989-94లో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్‌గా, 1995-99లో శాసనసభ స్పీకర్‌గా కొనసాగారు.
ఇక 1999నుంచి 2004 మధ్యలో ఆయన ఆర్ధిక మంత్రిగా ఉన్నారు. అలాగే 2014 నుంచి 2019 మధ్యలో మరోసారి ఆర్ధిక మంత్రిగా చేశారు. 2004-08 మధ్య కాలంలో తిరిగి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ బాధ్యతలు నిర్వహించారు. ఆయన ఆర్ధిక మంత్రిగానే కాకుండా శాసనసభ వ్యవహారాల శాఖను వాణిజ్య పన్నుల శాఖను నిర్వహించారు.
ఇక చూస్తే యనమల 1983 నుంచి 2009 మధ్యలో ఏకంగా 26 ఏళ్ళ పాటు ఎమ్మెల్యేగా గెలిచారు. 2013 నుంచి ఎమ్మెల్సీగా కంటిన్యూగా కొనసాగుతున్నారు. ఈ ఏడాది మార్చి 30తో ఆయన పదవీకాలం పూర్తి అవుతుంది. అంటే యనమల రాజకీయ జీవితంలో కేవలం 2009 నుంచి 2013 మధ్యలో నాలుగేళ్ళ కాలం తప్ప మొత్తం 42 ఏళ్ల రాజకీయం లో 38 ఏళ్ళ పాటు చట్ట సభలలోనే సాగింది. ఆయన ప్రతిపక్షంలో ఉన్నా పదవులు వరించాయి. శాసన మండలిలో ప్రతిపక్ష నేతగా కూడా కేబినెట్ హోదాను ఆయన అందుకున్నారు.
ఈ నేపథ్యంలో మరో నెల రోజులలో ఎమ్మెల్సీగా పదవీ విరమణ చేయనున్న యనమలకు మళ్ళీ ఆ ఎమ్మెల్సీ పదవి మూడవసారి దక్కుతుందా అన్నది ఒక చర్చ. అయితే యనమలకు రాజ్యసభకు వెళ్ళాలని కోరిక ఉంది. 2026లో ఏపీలో నాలుగు ఎంపీ సీట్లు ఖాళీ అవుతాయి. అందులో ఒకటి ఇవ్వాలనుకున్నా ఆయన మరో పదిహేను నెలల పాటు వేచి చూడాల్సి ఉంది.
అయితే తెలుగుదేశం పార్టీ ఇటీవల కాలంలో తీసుకుంటున్న నిర్ణయాలను చూస్తే కనుక సీనియర్లకు నో చాన్స్ అన్నట్లుగానే ఉంది. దానికి తోడు ఈ మధ్యన కాకినాడ పోర్ట్ విషయంలో యనమల సీఎం కి రాసిన ఒక బహిరంగ లేఖలో కుల ప్రస్తావన చేయడం అధికార తెలుగుదేశం పార్టీని ఇబ్బంది పెట్టిందని అంటున్నారు.
ఈ నేపథ్యంలోనే ఆయన తుని మునిసిపాలిటీ ఎన్నికల్లో టీడీపీకి మెజారిటీ తెచ్చి అధికార పీఠం దక్కేలా పావులు కదుపుతూ కొత్త రాజకీయానికి తెర తీశారు. ఒక వేళ ఇందులో విజయవంతం అయి మున్సిపాలిటీ దక్కినా 2026 మార్చితో ఆ పదవీకాలం పూర్తి అవుతుంది. ఈ విధంగా తన క్రెడిట్ ని చెప్పుకుని పార్టీ హైకమాండ్ చల్లని చూపుతో ఆయన మళ్ళీ చట్ట సభలలో అడుగు పెట్టడానికి చూస్తున్నారా అన్న చర్చ సాగుతోంది.
అయితే యనమల రామక్రిష్ణుడు విషయంలో అయితే ఆయన మాగ్జిమం పదవులు అన్నీ తీసుకున్నారు అన్న మాట అయితే ఉంది. ఆయనకు పార్టీ ఏ విధమైన అన్యాయం చేయలేదని కూడా అంటున్నారు. ఆయన ఇపుడు ఏడున్నర పదుల వయసులో ఉన్నారు. ఆయన వారసురాలికి తుని టికెట్ ఇచ్చారు. ఎమ్మెల్యే అయింది. అల్లుడు, వియ్యంకుడు పదవుల్లో ఉన్నారు. సో యనమలకు ఎమ్మెల్సీ పదవి పూర్తి అయితే రాజకీయంగా విశ్రాంతి జీవితం గడపడమే అని కూడా అంటున్నారు. అలా ఆలోచిస్తే ఈ నెల 24 నుంచి మొదలయ్యే బడ్జెట్ సెషన్ ఈ మాజీ ఆర్ధిక మంత్రికి చివరిది కావచ్చు అన్నది చర్చగా ఉంది.