Begin typing your search above and press return to search.

యనమల ఫ్యామిలీకి నాలుగు టికెట్లు...బాబూ విన్నావా...!?

ఇక పార్టీ కోసం కుటుంబాలు కొన్ని కష్టపడినా కొందరికీ ఫ్యామిలీ ప్యాకేజ్ ఇవ్వడం పట్ల పార్టీలో సీనియర్లు ఫైర్ అవుతున్నారు.

By:  Tupaki Desk   |   23 March 2024 1:52 PM GMT
యనమల ఫ్యామిలీకి నాలుగు టికెట్లు...బాబూ విన్నావా...!?
X

టీడీపీలో ఆరుగాలం పనిచేసిన వారికి ఒక వైపు మొండి చేయి చూపిస్తున్నారు. మరో వైపు చూస్తే డబ్బున్న వారికే టికెట్లు ఇస్తున్నారు తప్ప కష్టపడి పనిచేసిన వారికి టికెట్లు లేవు అని తమ్ముళ్ళు గగ్గోలు పెడుతున్నారు. ఇక పార్టీ కోసం కుటుంబాలు కొన్ని కష్టపడినా కొందరికీ ఫ్యామిలీ ప్యాకేజ్ ఇవ్వడం పట్ల పార్టీలో సీనియర్లు ఫైర్ అవుతున్నారు.

ముఖ్యంగా మాజీ మంత్రి యనమల రామక్రిష్ణుడు హవా పార్టీలో సాగుతోందని అంటున్నారు. పార్టీ పుట్టినప్పటి నుంచి ఉన్న వారిని పక్కన పెడుతున్నారని మండిపడుతున్నారు. యనమల ఫ్యామిలీ విషయానికి వస్తే ఆయనకు ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చారని, కుమార్తె దివ్యకు తుని టికెట్ ఇచ్చారని, అల్లుడు మహేష్ యాదవ్ కి ఏలూరు టికెట్ ఇచ్చారని, వియ్యంకుడు సుధాకర్ కి కడప జిల్లా మైదుకూరు టికెట్ ఇచ్చారని గుర్తు చేస్తున్నారు.

ఇదే తీరున ఒకే ఫ్యామిలీకి ఇన్ని టికెట్లు ఇస్తూ మరో వైపు ఫ్యామిలీలో ఒక్కరికే టికెట్ అని చెప్పడమేంటని అంటున్నారు. టీడీపీ పుట్టినప్పటి నుంచి ఉన్న అయ్యన్నపాత్రుడు తనకు తన కుమారుడికి రెండు టికెట్లు అడిగితే మాత్రం ఒక్కటే టికెట్ అని చెప్పారని అంటున్నారు. అదే సూత్రం యనమల విషయంలో ఎందుకు వర్తించలేదు అని అడుగుతున్నారు.

మరో వైపు చూస్తే అసలు టీడీపీకి ఏ మాత్రం సంబంధం లేని వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి సైకిలెక్కగానే ఆయనకు ఆయన సతీమణికి రెండు టికెట్లు ఇచ్చారని అంటున్నారు. కేవలం డబ్బు ఉందని టికెట్లు ఇస్తున్నారని అదే సమయంలో కష్టపడిన వారికి గుర్తింపు లేదా అని ప్రశ్నిస్తున్నారు.

తమ వద్ద డబ్బులు లేవనే టికెట్లు ఇవ్వడం లేదని బాధ క్యాడర్ లో కొంతమందిలో కనిపిస్తోంది. బాబు కళ్లలో పడాలీ అంటే డబ్బు ఉండాలా అని నిలదీస్తున్నారు. టీడీపీ పూర్తిగా డబ్బు మయం అయిందని కూడా ఆరోపిస్తున్న వారు ఉన్నారు.

పార్టీ కోసం పనిచేసిన వారిని పక్కన పెట్టడం నిజంగా బాధాకరం అని అంటున్నారు. టీడీపీలో గతంలో ఈ రకమైన వైఖరి ఉండేది కాదని అంటున్నారు. టీడీపీలో మొదటి నుంచి ఉంటున్న వారికి కాదని పారాచూట్ బ్యాచ్ కి టికెట్లు ఇవ్వడం అంటే పార్టీ ఎక్కడికి పోతోంది అని కూడా నిలదీస్తున్నారు.

ఇక పార్టీలో ఒక్క సీటు కూడా దక్కని వారు చాలా మంది ఉన్నారు. వారంతా తాము ఏమి పాపం చేశామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డబ్బుతోనే కొలుస్తారా అని ఫైర్ అవుతున్నారు. ఇదిలా ఉంటే ఏలూరు ఎంపీ టికెట్ ని కడప జిల్లాకు చెందిన మహేష్ యాదవ్ కి ఇవ్వడం పట్ల అదే పార్టీలో నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. కడప నుంచి వచ్చి ఇక్కడ సీటు తీసుకుని తెలుస్తామంటే కుదరదని అంటున్నారు.

ఏలూరు టీడీపీ ఇంచార్జి అయితే గోపాల్ యాదవ్ సోషల్ మీడియా ముఖంగా జగన్ కి క్షమాపణలు చెప్పారు. తాను గతంలో పార్టీ పరంగానే విమర్శించాను తప్ప వ్యక్తిగతంగా కాదు అని ఆయన అన్నారు. బీసీలకు న్యాయం చేయడంతో వైసీపీయే బాగా ఉందని అన్నారు పాతిక ఎంపీ సీట్లలో అయిదు రిజర్వుడు సీట్లు పోతే మిగిలిన వాటిలో ప్రకటిచిన 19కి 11 సీట్లు బీసీలకు ఇచ్చి జగన్ డేరింగ్ స్టెప్ తీసుకున్నారు అని ఆయన కితాబు ఇచ్చారు

ఇక ఆదివారం గోపాల్ యాదవ్ ఆత్మీయ సమావేశం నిర్వహిస్తున్నారు. ఆయన తన పార్టీ వారితో మాట్లాడి వైసీపీలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరో వైపు చూస్తే ఏలూరు ఎంపీ టికెట్ ని ఆశించిన గారపాటి సీతారామంజనేయ చౌదరి కూడా ఏలూరు సీటుని టీడీపీ తీసుకోవడం పట్ల మండిపడుతున్నారు.

ఆయన బీజేపీ కోటాలో ఏలూరు నుంచి పోటీకి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఆయన ఇండిపెండెంట్ గా పోటీకి రెడీ అవుతున్నారని అంటున్నారు. అదే జరిగితే మాత్రం టీడీపీకి ఏలూరులో తీవ్ర నష్టం జరుగుతుందని అంటున్నారు.