బాబుతో ములాఖత్.. యనమల హాట్ కామెంట్స్!
టీడీపీ అధినేత చంద్రబాబును అక్రమంగా కేసులో ఇరికించారని మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు హాట్ కామెంట్స్ చేశారు.
By: Tupaki Desk | 18 Sep 2023 2:02 PM GMTటీడీపీ అధినేత చంద్రబాబును అక్రమంగా కేసులో ఇరికించారని మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు హాట్ కామెంట్స్ చేశారు. రాజమండ్రి సెంట్రల్ జైలులో చంద్రబాబుతో ఆయన ములాఖత్ అయ్యారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన యనమల సంచలన వ్యాఖ్యలు చేశారు.
చంద్రబాబు ఏ తప్పూ చేయలేదన్నారు. తప్పులు చేసిన నాయకులే ఆయన్ను ఈ కేసులో ఇరికించారని యనమల ఆరోపించారు. తప్పుడు కేసులతో ఈ ప్రభుత్వం చంద్రబాబును వేధిస్తోందని మండిపడ్డారు. జైలులో ఆయన సంతోషంగా లేరన్నారు. పార్టీ కార్యకర్తల గురించి చంద్రబాబు అడిగారని తెలిపారు. వారిపై తప్పుడు కేసులు పెట్టడంపైనా ఆవేదన వ్యక్తం చేశారన్నారు.
చంద్రబాబు చేసిన కార్యక్రమాల వల్లే రాష్ట్రం అభివృద్ధి చెందిందని యనమల గుర్తు చేశారు. టీడీపీ హయాంలో జరిగిన అభివృద్ధిని వైసీపీ ప్రభుత్వం ధ్వంసం చేస్తోందని యనమల రామకృష్ణుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వం వల్ల ప్రజలంతా కష్టాలు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు ఎప్పుడూ భవిష్యత్తు గురించే ఆలోచిస్తారని వెల్లడించారు. ఆయన అరెస్ట్‌ను అనేకమంది జాతీయ నేతలు ఖండించారని... తనకు సంఘీభావం తెలిపిన జాతీయ నేతలకు కృతజ్ఞతలు చెప్పమని చంద్రబాబు కోరారన్నారు. కేసులను న్యాయపరంగానే ఎదుర్కొంటామని చెప్పారు.
చంద్రబాబు గదిలో ఏసీ లేదని.. ఏర్పాటు చేయాలని జైలు అధికారులకు విజ్ఞప్తి చేశామని తెలిపారు. ఆ గదిలో దోమలు కూడా ఉన్నాయన్నారు. అయినప్పటికీ.. చంద్రబాబుకు రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం తప్ప.. ఆయనకు కల్పించిన సౌకర్యాలు, ఇబ్బందులు గురించి ఆయన ఆలోచించడం లేదన్నారు. జైలులో చంద్రబాబు ఇబ్బందిని చూసి తామే ఆయన ఉన్న గదిలో ఏసీ, ఇతర సౌకర్యాలు అందుబాటులో ఉంచాలని అధికారులను కోరామని వెల్లడించారు.
మరి కొద్ది రోజుల్లో జరగనున్న అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతామని సమావేశాల్లో చర్చించాల్సిన అంశాలపై నిర్ణయం తీసుకుంటామని యనమల రామకృష్ణుడు వెల్లడించారు.
చంద్రబాబు ఆరోగ్యంపై మీడియా యనమలను ప్రశ్నించగా.. భవిష్యత్తు గురించి ఆలోచించే వ్యక్తి ఈనాడు మన ముందు లేరని జైలులో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్తును నాశనం చేస్తున్న వ్యక్తి అధికారంలో ఉన్నాడని మండిపడ్డారు. ఇలాంటి సమయంలో చంద్రబాబు జైలులో ఎలా ఆనందంగా ఉంటారని యనమల ప్రశ్నించారు. కాగా యనమలతోపాటు రాజమండ్రి సెంట్రల్ జైలులో నారా భువనేశ్వరి, నారా బ్రాహ్మణి కూడా చంద్రబాబును కలిశారు.