Begin typing your search above and press return to search.

సోదరుల 'షో'తో రేవంత్ కు కొత్త తలనొప్పి

కేసీఆర్ కుటుంబ పాలన మీద ఘాటు విమర్శలు చేసే వారు రేవంత్ రెడ్డి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి కావటానికి ఈ తరహా ఆరోపణలు

By:  Tupaki Desk   |   9 Aug 2024 4:53 AM GMT
సోదరుల షోతో రేవంత్ కు కొత్త తలనొప్పి
X

కేసీఆర్ కుటుంబ పాలన మీద ఘాటు విమర్శలు చేసే వారు రేవంత్ రెడ్డి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి కావటానికి ఈ తరహా ఆరోపణలు.. విమర్శలు కూడా కారణంగా చెప్పాలి. అంతేకాదు.. తాను సీఎం అయ్యాక తన పేరు ప్రఖ్యాతులకు దెబ్బ తగలకుండా ఉండటానికి తన సోదరులతో భేటీ పెట్టుకొని.. పాలనలో వారెక్కడా జోక్యం చేసుకోకుండా ఉండటంతో పాటు.. విమర్శలకు అవకాశం ఇవ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పినట్లుగా రేవంత్ చెప్పారు. తన సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో మొదట్నించి తన సోదరులు తన వెంట ఉన్నప్పటికీ వారెప్పుడూ తెర వెనుకే ఉండే వారే తప్పించి.. బయటకు రాలేదన్న మాటను రేవంత్ చెప్పటం తెలిసిందే.

అయితే.. ఇప్పుడు అందుకు భిన్నమైన సీన్ తెర మీదకు వచ్చింది. ఎప్పుడూ రేవంత్ వెనుక ఉంటూ.. సోదరుడికి అవసరమైన సహాయ సహకారాలు అందించే ఆయన ఇద్దరు సోదరులు.. రేవంత్ ముఖ్యమంత్రి అయ్యాక వారి తీరులో తేడాలు వచ్చినట్లుగా చెబుతున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు పలువురు.. రేవంత్ సోదరులు దందా చేస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా సీఎం రేవంత్ సోదరుల్లో ఒకరైన తిరుపతి రెడ్డి పుట్టిన రోజు గురువారం జరిగింది. ఈ సందర్భంగా ఆయనతో కూడిన భారీ ఫ్లెక్సీలను నగరంలోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేయటం హాట్ టాపిక్ గా మారింది.

ఏ హోదాలో తిరుపతిరెడ్డిని ఈ తరహాలో ప్రమోట్ చేస్తున్నారు? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. కుటుంబ పాలన కబంధ హస్తాల్లో తెలంగాణ చిక్కుకుందంటూ గళం విప్పిన రేవంత్.. తాను సీఎం అయ్యాక ప్రజాపాలన మొదలైనట్లుగా చెప్పుకున్నారు. అదే నిజమైతే.. ఇప్పుడు సోదరుల సంగతేంటి? అన్న ప్రశ్నను బీఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. తిరుపతి రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా ఒక ప్రముఖ దినపత్రికలో ఫుల్ పేజీ యాడ్ ఇవ్వటం అందులో.. ‘‘మాట తప్పని మహనీయుడు, శత్రువులెరుగని నాయకుడు.. అలుపెరుగని ప్రజా సేవకుడు ఎనుముల తిరుపతిరెడ్డి అన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు అంటూ ఫుల్ పేజీ యాడ్ ఇచ్చేశారు.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. జూబ్లీహిల్స్.. బంజారాహిల్స్.. సోమాజిగూడ.. అమీర్ పేట.. ఎస్ఆర్ నగర్ ... మాదాపూర్ తో సహా నగరంలోని పలు ప్రాంతాల్లో పోస్టర్లు.. ఫ్లెక్సీలు ఏర్పాటు చేయటం కలకలాన్ని రేపుతోంది. చాలా పోస్టర్లు.. ఫ్లెక్సీల్లో సీఎం రేవంత్ ఫోటో లేకుండా ఉండటం హాట్ టాపిక్ గా మారింది. ఈ తరహా తీరుపై నెటిజన్లు మండిపడుతున్నారు. సోషల్ మీడియాలోనూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాను సీఎం కాక ముందు కుటుంబ పాలన అంటూ కేసీఆర్ కుటుంబంపై దుమ్మెత్తి పోసిన రేవంత్.. ఇప్పుడు తన సోదరుల్ని కట్టడి చేయకపోతే.. సోదరుల స్ట్రోక్ ఖాయమన్న మాట వినిపిస్తోంది. మరేం చేస్తారో చూడాలి.