వంశీ పాపం ఊరకే పోదు : ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకటరావు సంచలన ప్రెస్ మీట్
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై ప్రభుత్వ విప్, ప్రస్తుత గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకటరావు సంచలన ఆరోపణలు చేశారు.
By: Tupaki Desk | 13 Feb 2025 10:32 AM GMTగన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై ప్రభుత్వ విప్, ప్రస్తుత గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకటరావు సంచలన ఆరోపణలు చేశారు. వంశీ అరెస్టు నేపథ్యంలో ప్రత్యేకంగా మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే యార్లగడ్డ వంశీ పాపం ఊరకే పోదంటూ వ్యాఖ్యానించారు. రౌడీలంటే ఇష్టంతోనే వంశీని మాజీ సీఎం జగన్ వైసీపీలోకి తీసుకున్నారని ఆరోపించారు.
పెనమలూరుకు చెందిన తనను గన్నవరం నుంచి పోటీ చేయమని 2019 ఎన్నికలకు ముందు వైసీపీ అధినేత జగన్ కోరినట్లు ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకటరావు తెలిపారు. వంశీని ఓడించాలని చెబుతూ తనను గన్నవరంలో పోటీ చేయమన్నారని, తీరా తాను జగన్ మాటలు నమ్మి గన్నవరంలో పోటీ చేస్తే.. చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా తీసేయాలని వంశీని పార్టీలో చేర్చుకున్నారని తెలిపారు. చంద్రబాబుకు హోదా తీసేయాలని చూసిన జగన్ కు ఇప్పుడు ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదన్నారు. దీనికి ప్రధాన కారణం వల్లభనేని వంశీ అన్న విషయాన్ని గుర్తు చేశారు.
నియోజకవర్గంలో వల్లభనేని వంశీ ఎన్నో పాపాలు చేశాడని ఎమ్మెల్యే యార్లగడ్డ తెలిపారు. తనపైన, వైసీపీ నేత డాక్టర్ దుట్టా రామచంద్రరావుపైనా వంశీ అనుచత వ్యాఖ్యలు చేసేవాడని చెప్పారు. వైసీపీకి చెందిన 4 వేల మంది కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టించాడని.. వీటింటినీ గాలికి వదిలేసి వంశీని పార్టీలోకి తీసుకుని పాపం మూటగట్టుకున్నారని విమర్శించారు. బ్రహ్మలింగయ్య చెరువులో మట్టి తవ్వకాలపై ఆరోపణలు చేసిన అప్పటి సీఎం జగన్.. ఏ విచారణ లేకండానే వంశీని వైసీపీలో చేర్చుకున్నారని, తన అక్రమాలు కప్పిపుచ్చుకునేందుకు వంశీ పార్టీ మారారని ఎమ్మెల్యే వివరించారు.
రౌడీలంటే ఇష్టంతోనే వంశీని వైసీపీలో చేర్చుకున్నారని యార్లగడ్డ చమత్కరించారు. అక్రమ లే అవుట్లు, కామన్ సైట్లను అన్యాక్రాంతం చేశారని, రోడ్లను కూడా రిజిస్ట్రేషన్ చేశారని వంశీపై యార్లగడ్డ ఆరోపణలు చేశారు. పోలవరం గట్ల మట్టి తవ్వడం వల్ల అంబాపురం గ్రామం బుడమేరు వరదల్లో మునిగిపోయిందని గుర్తు చేశారు. వంశీపై ఎన్నో కబ్జా ఆరోపణలు ఉన్నాయని, బాధితులు వరుసగా ఫిర్యాదులు చేస్తున్నారని చెప్పారు. రెవెన్యూ రికార్డులను ట్యాంపర్ చేశారని, ప్రభుత్వ ఆస్తులను ఆక్రమించారని ఎమ్మెల్యే తెలిపారు.
భాషపై అదుపు లేకుండా నోటికొచ్చినట్లు దుర్భాషలాడి గన్నవరం పరువు తీశారని మండిపడ్డారు. వంశీ హయాంలో వేల మందిపై కేసులు పెట్టారన్నారు. పాము తన పిల్లలను తినేసినట్లు వంశీని గెలిపించిన టీడీపీ కార్యకర్తలు, నాయకులను వేధించారని ఆరోపించారు. వంశీ హయాంలో గన్నవరం అన్నిరకాలుగా భ్రష్టుపట్టించారని ఆవేదన వ్యక్తం చేశారు. పదేళ్ల రౌడీయిజానికి నేటితో ముగింపు పలికామన్నారు.