జగన్ పై అసభ్యకరమైన మాటలు.. ఎయిర్ పోర్ట్ లో ఎన్నారై అరెస్ట్!
అక్కడితో ఆగని అతడు... జగన్ తన తండ్రిని చంపేసి సీఎం అవ్వాలని భావించాడని దారుణమైన ఆరోపణలు చేశారు
By: Tupaki Desk | 23 Dec 2023 7:49 AM GMTఇటీవల కాలంలో విదేశాల్లో ఉంటూ ఆన్ లైన్ వేదికగా ఏపీ సర్కార్ పైనా, ముఖ్యమంత్రి జగన్ పైనా, వారి కుటుంబ సభ్యులపైనా విపరీతమైన, అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తున్న ఎన్నారైల లిస్ట్ పెరిగిపోతుందనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో వైఎస్ జగన్ పై పూర్తి అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన ఎన్నారై యశస్వి.. అలియాస్ యాష్ పొద్దులూరి ని ఏపీ సీఐడీ అధికారులు ఎయిర్ పోర్ట్ లో అదుపులోకి తీసుకున్నారు.
అవును... ఏపీలో జగన్ పాలనపై తరచుగా విమర్శలు గుప్పిస్తూ.. ఏపీ ముఖ్యమంత్రి జగన్ ను ఉగ్రవాదితో పోలిస్తూ.. వారిలాగానే జగన్ ఆలోచనలు కూడా ఉంటాయని చెబుతూ.. ఉగ్రవాదులకు జగన్ కు పెద్దగా తేడా లేదని వ్యాఖ్యానించాడు యశస్వీ. ఆ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఇవి కాస్త ఇంగితం ఉన్న ఏ వ్యక్తీ సమర్ధించే విషయాలు కాదనే కామెంట్లు ఈ వీడియోల కింద కనిపించేవి!
అక్కడితో ఆగని అతడు... జగన్ తన తండ్రిని చంపేసి సీఎం అవ్వాలని భావించాడని దారుణమైన ఆరోపణలు చేశారు. దీంతో... శృతిమించిపోతూ, ఏమాత్రం ఆమోదయోగ్యం కాని ఈ వ్యాఖ్యలపై ఏపీసీఐడీ పోలీసులు కొన్నాళ్ల కిందట కేసులు నమోదు చేశారు. అమెరికా నుంచి వచ్చిన అనంతరం శంషాబాద్ ఎయిర్ పోర్టులో సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకుని మంగళగిరికి తరలించారు.
అనంతరం ఆయనకు 41ఏ కింద నోటీసులు ఇచ్చి విడిచి పెట్టారు. అతడిపై లుకౌట్ నోటీసులు ఉన్నట్లు కథనాలొస్తున్నాయి. ఈ సందర్భంగా అతడిని విడిచిపెట్టిన అధికారులు వచ్చే నెల 11 వ తేదీన విజయవాడలోని సీఐడీ కార్యాలయానికి వచ్చి.. విచారణకు సహకరించాలని కోరారు.
మరోపక్క యాష్ అరెస్ట్ అప్రజాస్వామికమని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు తెలిపారు. ఈ సందర్భంగా ఓటమి భయంతోనే అక్రమ అరెస్టులకు పాల్పడుతున్నారని చెప్పడం గమనార్హం! ఇదే సమయంలో స్పందించిన లోకేష్... ప్రశ్నించే గొంతులను నిర్భందాల ద్వారా అణచివేయాలని వైసీపీ ప్రభుత్వం అనుకుంటోందని.. అతన్ని ఉగ్రవాదిలా సీఐడీ అధికారులు ట్రీట్ చేస్తూ కొట్టారని తాను తెలుసుకున్నాని చెప్పుకొచ్చారు.