Begin typing your search above and press return to search.

అక్రమ నిర్మాణల్ని ఎమ్మెల్యేలు కూల్చేస్తే.. ప్రభుత్వ యంత్రాంగం ఎందుకు?

అత్యుత్సాహమో.. బరి తెగింపో.. టీడీపీ ఎమ్మెల్యే చేసిన ఒక పని ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశం అవుతుంది.

By:  Tupaki Desk   |   3 July 2024 4:49 AM GMT
అక్రమ నిర్మాణల్ని ఎమ్మెల్యేలు కూల్చేస్తే.. ప్రభుత్వ యంత్రాంగం ఎందుకు?
X

అత్యుత్సాహమో.. బరి తెగింపో.. టీడీపీ ఎమ్మెల్యే చేసిన ఒక పని ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశం అవుతుంది. ఈ వ్యవహారంపై వైసీపీ తీవ్ర స్థాయిలో మండిపడుతుంది. తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ తీరుపై తీవ్రస్థాయిలో మండి పడుతుంది. పోలీసులు అడ్డుకున్నా, అధికారులు వద్దని వారించినా కూడా ఎమ్మెల్యే మోడిగా ముందుకువెళ్లారని విమర్శిస్తున్నారు. ఇప్పుడు ఈ విషయంలో టీడీపీలో కూడా తీవ్ర చర్చనీయాంశం అవుతుంది.

అవును.. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ప్రదర్శించిన అత్యుత్సాహం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. జాతీయ రహదారిపై ట్రాఫిక్ పూర్తిగా స్తంభించింది. పోలీసులు నచ్చచెప్పినా.. అధికారులు అసలు విషయం వెల్లడించినా ఎమ్మెల్యే మొండిగా ముందుకు కదిలారు! ఆఖరికి డ్యామేజీ మరింత పెరుగుతుందని భావించారో ఏమో కానీ... ఎమ్మెల్యే వెనక్కి తగ్గి వెళ్లిపోయారు.

వివరాళ్లోకి వెళ్తే... ఎన్టీఆర్ జిల్లా ఏ.కోడూరు మండలం కంభంపాడులో వైసీపీకి చెందిన ఎంపీపీ కాలసాని నాగలక్ష్మి భర్త చెన్నారావు భవనం నిర్మిస్తున్నారు. దీంతో... ఈ వ్యవహారంపై పలువురు ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేశారంట. దీంతో ఆ భవనాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే కొలికపూడి... అది అక్రమం అని తనకు తానే భావించేసి... అధికారులు కూల్చకపోతే తానే కూల్చేస్తానంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.

ఈ నేపథ్యంలో టీడీపీ, జనసేన కార్యకర్తలను వెంటపెట్టుకుని బుల్డోజర్ తో ఆ భవనం వద్దకు చేరుకున్నారు. ఇదే సమయంలో... వైసీపీ ఎంపీపీ వర్గం కూడా అక్కడకు చేరుకుంది. ఈ సమయంలో ఈ ఆక్రమణ తొలగించే వరకూ అక్కడ నుంచి కదలనని ఎమ్మెల్యే తన వాహనం పైకెక్కి కూర్చున్నారు. ఈ సమయంలో అక్కడకు పోలీసులు, అధికారులు చేరుకున్నారు.

ఈ సమయంలో... ఆ కట్టడం కూల్చవద్దని.. తామే సర్వే చేసి, నిజంగా ఆక్రమణలు ఉంటే తొలగిస్తామని అధికారులు ఎమ్మెల్యేకు చెప్పారు. అయినప్పటికీ సదరు ఎమ్మెల్యే పట్టించుకోలేదు! ఈ నేపథ్యంలో ఆ బిల్డింగ్ కు ఒకపక్క కొంతభాగం కూల్చేశారు కూడా. ఆఖరికి అధికారులు గట్టిగా చెప్పారో ఏమో ఎమ్మెల్యే వెనక్కి తగ్గారు.

ఈ సమయంలో తాము ఎవరి స్థలమూ ఆక్రమించలేదని.. అక్రమంగా భవనం నిర్మించడం లేదని ఎంపీపీ నాగలక్ష్మి తేల్చి చెప్పారు. భవనం కూల్చివేతపై న్యాయపోరాటం చేస్తామని స్పష్టం చేశారు. అయితే... విషయం తెలుసుకోకుండా టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి చేసిన హడావిడి, అత్యుత్సాహం వల్ల సుమారు రెండు గంటల పాటు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి!

ఈ విషయంపై వైసీపీ స్పందించింది. దీన్ని టీడీపీ ఎమ్మెల్యే బరితెగింపుగా అభివర్ణించింది. అధికారులు చెప్పినా, పోలీసులు నచ్చచెప్పినా కూడా ఆయన అనుసరించిన వైఖరి మూర్ఖత్వం, బరి తెగింపూ కాక మరేమిటని ప్రశ్నించింది. మరోపక్క... ఈ ఎమ్మెల్యే తీరుపై టీడీపీలో కూడా విమర్శలు వినిపిస్తున్నాయని అంటున్నారు. ఇలాంటి అత్యుత్సాహాలు మొదటికే మోసం తెస్తాయనే విషయం మరిచిపోకూడదని చెబుతున్నారు.