గుండెలు మెలిపెట్టే ప్రయత్నం... 13 ఏళ్లుగా భార్యను వెతుకుతున్నాడు!
తాజాగా ఓ వ్యక్తి తన భార్య ప్రేమ ఎంత శక్తివంతమైందో చెప్పకనే చెబుతూనే.. ఆ ప్రేమలో మునిగిన తన ప్రేమ మరెంత పట్టుదలైందో చాటి చెప్పుతున్నారు.
By: Tupaki Desk | 23 Aug 2024 7:30 PM GMTప్రేమ ఎంత శక్తివంతమైంది అంటే చెప్పడం ఎవరి వల్లా కాదనే చెప్పాలి! ప్రేమ ఎంత శక్తివంతమైందనేది అనుభవించేవారికి మాత్రమే తెలుస్తుంది. జీవితానికీ, మరణానికి సంబంధించిన పరిమితులను సైతం మించి ఇది ఉంటుంది! ఎదుటి వ్యక్తి జ్ఞాపకాల ద్వారా.. లేదా, వారు వదిలివెళ్లిన ప్రభావం ద్వారా ఇది బలంగా తన ఉనికిని చాటుకుంటుంది.
అవును... ప్రేమ చాలా శక్తివంతమైంది. అయితే దాని శక్తి తీవ్ర అనేది ప్రేమించే వ్యక్తి, ప్రేమించబడుతున్న వ్యక్తి మధ్య ఉన్న అవగాహన, ఆత్మీయత, అనురాగంపై ఆధారపడి ఉంటుంది. ఒకరి గురించి ఆలోచిస్తున్నప్పుడు ఓదార్పు కలిగితే అది ప్రేమ శక్తి, మనసు విశ్వం అంచులు దాటి వెళ్తే అది ప్రేమ శక్తి. ఎలా చూసుకున్నా అర్ధవంతమైన ప్రేమ జీవితంలో ఆనందాన్ని తెస్తుందని అంటారు.
తాజాగా ఓ వ్యక్తి తన భార్య ప్రేమ ఎంత శక్తివంతమైందో చెప్పకనే చెబుతూనే.. ఆ ప్రేమలో మునిగిన తన ప్రేమ మరెంత పట్టుదలైందో చాటి చెప్పుతున్నారు. సునామీలో మిస్సైన తన భార్య అస్తికల కోసం ఇప్పటికీ అలుపెరగకుండా అన్వేషిస్తున్నాడు. ప్రేమ అంటే అన్వేషణ.. ప్రేమికుడు నిత్యాన్వేషకుడి అని నిరూపిస్తున్నాడు.
వివరాళ్లోకి వెళ్తే... 2011లో వచ్చిన సునామీ వల్ల వేలాది మంది ప్రాణాలు కోల్పోవడం, మరికొంతమంది నిరాశ్రయులవ్వడం, ఇంకొంతమంది తమ సొంతవారిని కోల్పోవడం తెలిసిందే. ఈ సమయంలో.. ఆనాటి సునామీలో తప్పిపోయిన తన భార్య యుకో మృతదేహాన్ని కనుగొనాలని, ఆమె అస్తికలను సంపాదించి అంత్యక్రియలు సక్రమంగా చేయాలని యసువో తకమట్సు అనే వ్యక్తి అవిరామంగా ప్రయత్నిస్తున్నాడు.
సుమారు 13 సంవత్సరాలుగా తకమట్సు తన భార్య అవశేషాలను కనుగొనడానికి ప్రయత్నిస్తున్నాడు. ఎప్పటికైనా ఆమె అంత్యక్రియలను సక్రమంగా నిర్వహించగలనని, అంతిక వీడ్కోలు పలకగలనని విశ్వసిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే సుమారు 13 ఏళ్లుగా తన భార్య మృతదేహం ఆచూకీ కోసం అహర్నిశలు శ్రమిస్తున్నాడు. తనకు మరో ఆప్షన్ లేదని నొక్కి చెబుతున్నాడు. ఇది మాత్రమే తాను ఆమెకు ఇవ్వగలనని అంటున్నాడు.
దీనికోసం మసయోషి తకాహషి అనే వాలంటీర్ సహాయం తీసుకుంటున్నాడు. అతనితో డైవ్ చేయడం నేరుకున్నాడు. నీటి అడుగున సునామీ శిధిలాలను శుభ్రపరచడంలో ఎక్స్ పీరియన్స్ ఉన్న కారణంగా తకమట్సు.. తకహషిని ఎంచుకున్నాడు. ఈ నేపథ్యంలో వీరిద్దరూ కలిసి యుకో అవశేషాల కోసం అలుపెరగకుండా వెతుకుతూనే ఉన్నారు.
ఈ సందర్భంగా మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పందించిన తకమట్సు... ఇది చాలా కష్టమని తనకు తెలుసని.. అయినప్పటికీ చేయగలుతున్నానని.. తాను ఆమె కోసం చేయగలిగింది అదొక్కటే అని.. ఆమె కోసం వెతకడం తప్ప తనకు వేరే మార్గం లేదని చెబుతున్నాడు. ఇదే సమయంలో... తాను సముద్రంలో ఉన్నప్పుడు ఆమెకు దగ్గరగా ఉన్నట్లు భావిస్తున్నట్లు చెప్పుకొచ్చాడు! ప్రేమికులకు చావుంటుంది కానీ... ప్రేమకు కాదు కదా!!