సిద్దూకు సన్ స్ట్రోక్.. వైరల్ వీడియోలో ఏముంది?
తన తండ్రి కమ్ కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు ఫోన్ చేసిన ఆయన కొడుకు యతీంద్ర సంభాషణలకు సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు వైరల్ గా మారింది
By: Tupaki Desk | 17 Nov 2023 5:27 AM GMTతన తండ్రి కమ్ కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు ఫోన్ చేసిన ఆయన కొడుకు యతీంద్ర సంభాషణలకు సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ వీడియోలో.. ''నాన్నా.. ఎవరా వివేకానంద. మహదేవప్పకు ఇవ్వు. మహదేవప్పా.. నేను చెప్పినవి కాకుండా ఏవేవో ఇస్తున్నావు. నేను ఇచ్చిన నాలుగైదు మాత్రమే చేయమని నాన్నకు చెప్పు' అంటూ సాగిన సంభాషణ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్దరామయ్య కుమారుడు యతీంద్ర మాటల వీడియో ఇప్పుడు సంచలనంగా మారటమే కాదు.. సిద్దూ సర్కారుకు కొత్త సంకటంలో పడేసింది.
మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప.. కుమారస్వామి ప్రబుత్వాల్లో విమర్శలు సంధించిన సిద్దూ.. తాజా వీడియోపై ఏం సమాధానం ఇస్తారని ప్రశ్నిస్తున్నారు. సీఎం కొడుకు ఆదేశాల రూపంలో ఇచ్చిన మాటలు ఇప్పుడు కలకలాన్ని రేపటంతో పాటు.. ఈ వీడియోకు బదులు ఇవ్వాలని ప్రశ్నిస్తున్నారు. ఈ వీడియో వెనకున్న అసలు వాస్తవం ఎలా ఉన్నా.. దీని కారణంగా రేగుతున్న దుమారం మాత్రం తీవ్రంగా మారింది. విపక్షాలకు ఇదో అస్త్రంగా మారింది. జనతాదళ్ నేత కమ్ మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి తరచూ ఆరోపిస్తున్న ''వైఎస్టీ'' వసూళ్ల మాటకు ఈ వీడియో చక్కటి ఉదాహరణగా మారిందన్నమాట వినిపిస్తోంది.
వైఎస్టీ అంటే.. యతీంత్ర సిద్దరామయ్య పన్నుగా కుమారస్వామి మండిపడుతున్నారు. తాను చేసిన ఆరోపణలకు ప్రతిరూపమే తాజాగా బయటకు వచ్చిన వీడియోగా కుమారస్వామి అభివర్ణిస్తున్నారు. తాను చేసిన ఆరోపణలకు బలం చేకూరేలా ఉన్న ఈ వీడియోకు ఏమని బదులిస్తారని ప్రశ్నిస్తున్నారు. అయితే.. ఈ వీడియో ఉద్దేశం వేరని సిద్దరామయ్య వివరిస్తున్నారు. కుమారస్వామి తనపై చేస్తున్న తీవ్ర ఆరోపణలపై సిద్దరామయ్య స్పందించారు.
వివేకానంద అంటే మరెవరో కాదని వరుణ క్షేత్రం బీఈవోగా పేర్కొన్న సిద్దరామయ్య.. అక్కడి ఐదు స్కూళ్లను రిపేర్లు చేయాలని.. అవసరమైతే అందుకు సీఎస్సార్ నిధుల కోసమే జరిగిన చర్చకు సంబంధించిన వీడియో క్లిప్ తప్పించి..ఎలాంటి ఉద్యోగ బదిలీలకు సంబంధించిన అంశం కాదని చెబుతున్నారు. దీనికి తోడు ముఖ్యమంత్రి సిద్దూ కుమారుడైన యతీంద్ర ఆశ్రయ సమితి అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. వైరల్ గా మారిన వీడియోలో డబ్బు ప్రస్తావన కానీ.. బదిలీల ప్రస్తావన కానీ ఎక్కడైనా ఉందా? అని ప్రశ్నిస్తున్నారు. అయితే.. యతీంద్ర వీడియో కొత్త సందేహాలకు తెర తీసిందని మాత్రం చెప్పక తప్పదు.