నటి రన్యారావుపై బీజేపీ ఎమ్మెల్యే అసభ్య వ్యాఖ్యలు
కన్నడ నటి రన్యారావు ఇటీవల బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో రూ. 12 కోట్ల విలువైన బంగారంతో పట్టుబడటం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
By: Tupaki Desk | 18 March 2025 5:00 AM ISTకన్నడ నటి రన్యారావు ఇటీవల బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో రూ. 12 కోట్ల విలువైన బంగారంతో పట్టుబడటం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మార్చి 3న జరిగిన ఈ ఘటనపై డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ వ్యవహారం రాజకీయంగానూ దుమారం రేపుతోంది. అధికార కాంగ్రెస్ మరియు ప్రతిపక్ష బీజేపీ పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.
ఈ నేపథ్యంలో, బీజాపూర్ బీజేపీ ఎమ్మెల్యే బసంగౌడ పాటిల్ యత్నాల్ ఈ అంశంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రన్యారావు తన శరీరంలోని ఏయే భాగాలలో బంగారం దాచిందో తనకు తెలుసంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా, ఈ స్మగ్లింగ్‌లో మంత్రుల ప్రమేయం ఉందని, ఆ వివరాలన్నీ తన వద్ద ఉన్నాయని ఆయన ఆరోపించారు. రానున్న శాసనసభ సమావేశాల్లో ఒక్కొక్కరి బండారం బయటపెడతానని ఆయన హెచ్చరించారు.
రన్యారావు తండ్రి రామచంద్రరావు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగిగా ఉండి కూడా స్మగ్లింగ్‌కు ఎలా సహకరించారని ఆయన ప్రశ్నించారు. విమానాశ్రయంలోని కస్టమ్స్ అధికారుల వైఫల్యం కూడా స్పష్టంగా కనిపిస్తోందని, వారిపై కూడా చర్యలు తీసుకోవాలని యత్నాల్ డిమాండ్ చేశారు. రన్యారావు తన శరీరం నిండా బంగారాన్ని కప్పుకున్నదని, అది ఎక్కడ దాచిందో కూడా తనకు తెలుసని ఆయన వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అసెంబ్లీలో ప్రతి అంశాన్ని వివరిస్తానని ఆయన స్పష్టం చేశారు.
కాగా, బీజేపీ ఎమ్మెల్యే బసంగౌడ పాటిల్ యత్నాల్‌కు వివాదాలు కొత్తేమీ కాదు. గతంలో ఆయన మాజీ ముఖ్యమంత్రి యడియూరప్పను తీవ్రంగా విమర్శించారు. యడియూరప్ప కుమారుడు , రాష్ట్ర బీజేపీ యూనిట్ చీఫ్ విజయేంద్రపై కూడా ఆయన పలుమార్లు విమర్శలు చేశారు. అంతేకాకుండా యడియూరప్ప ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయనను తొలగించాలని యత్నాల్ డిమాండ్ చేశారు. 2020లో మైనార్టీల వివాహ పథకాన్ని రద్దు చేయాలని ఆయన కోరారు. ఈ పథకం కావాలంటే మైనార్టీలు పాకిస్థాన్‌కు వెళ్లిపోవాలని ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.