ఉత్తరాంధ్రాకు వైసీపీ ఫైర్ బ్రాండ్
వైసీపీ ఉత్తరాంధ్రాలో ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే పార్టీ వివిధ జిల్లాలలో అసెంబ్లీలకు ఇంచార్జిలను నియమించింది.
By: Tupaki Desk | 10 Feb 2025 3:42 AM GMTవైసీపీ ఉత్తరాంధ్రాలో ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే పార్టీ వివిధ జిల్లాలలో అసెంబ్లీలకు ఇంచార్జిలను నియమించింది. అలాగే రీజనల్ కో ఆర్డినేటర్లను కూడా నియమించింది. కొన్నాళ్ళ క్రితం ఉత్తరాంధ్రాకు వైసీపీ రీజనల్ కో ఆర్డినేటర్ గా విజయసాయిరెడ్డిని నియమించారు. అయితే ఆయన పదవిని స్వీకరించకముందే రాజీనామా చేశారు, రాజకీయ సన్యాసం స్వీకరించారు.
దాంతో ఇపుడు ఉత్తరాంధ్రా రీజనల్ కో ఆర్డినేటర్ పోస్టు ఖాళీగా ఉంది. ఈ పోస్టుని ఎవరితో భర్తీ చేయాలన్న దాని మీద వైసీపీలో చర్చ సాగుతోంది. సీనియర్ నేత మాజీ మంత్రి బొత్స సత్యనారాయణకు ఈ పదవి ఇస్తారని అనుకున్నా ఆయన ఇప్పటికే శాసనమండలిలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. అలాగే గోదావరి జిల్లాల వైసీపీ రీజనల్ కో ఆర్డినేటర్ గా ఉన్నారు.
అందువల్ల ఆయనకు ఈ అదనపు బాధ్యతలను అప్పగించడం కంటే వేరే వారికే ఇవ్వాలని వైసీపీ హై కమాండ్ డిసైడ్ అయింది అని అంటున్నారు. ఈ క్రమంలో వైసీపీ ఫైర్ బ్రాండ్ గా మాజీ మంత్రిగా ఉన్న మచిలీపట్నం నాయకుడు పేర్ని నానికి ఈ పదవికి ఇస్తారని పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. పేర్ని నాని ఇటీవల కాలంలో సైలెంట్ అయ్యారు. ఆయన కుటుంబం మీద కేసులు పెట్టారు. వాటితో ఆయన సతమతమవుతున్నారు.
అయితే ఆయన మళ్ళీ లైన్ లోకి వస్తారని అంటున్నారు. ఈ మేరకు ఆయనతో పార్టీ పెద్దలు మాట్లాడినట్లుగా చెబుతున్నారు. పేర్ని నానిని కో ఆర్డినేటర్ గా చేస్తే ఉత్తరాంధ్రాలో పార్టీకి కొంత ఊపు వస్తుందని భావిస్తున్నారు. ఆయన సామాజిక వర్గం కూడా కలసి వస్తుందని అంటున్నారు. అంతే కాకుండా బొత్స సత్యనారాయణకు కూడా ఈ నియామకం ఆమోదయోగ్యంగా ఉంటుందని అంటున్నారు. ఇప్పటిదాకా చూస్తే వైసీపీ ఉత్తరాంధ్రా జిల్లాల బాధ్యతలను వరసగా రెడ్లకే ఇస్తూ పోయింది.
మొదట 2016 నుంచి 2022 వరకూ విజయసాయిరెడ్డి రీజనల్ కో ఆర్డినేటర్ గా చేశారు. ఆయన తరువాత 2024 వరకూ వైవీ సుబ్బారెడ్డి చేసారు. ఇపుడు మళ్ళీ విజయసాయిరెడ్డికే ఇచ్చారు కానీ ఆయన రాజకీయాలకు గుడ్ బై చెప్పారు. అయితే ప్రతీసారి వేరే సామాజిక వర్గానికి ఇవ్వడంతో స్థానికంగా ఉన్న వారికి ఇస్తే బాగుంటుందని ఒక చర్చ సాగింది. అంతే కాదు తమ సామాజిక వర్గానికి చెందిన వారికి ఇచ్చినా కొంతలో కొంత పార్టీ పుంజుకుంటుంది అని వారు అంటున్నారు. ఇపుడు పేర్ని నాని నియామకం ఆ విధంగానే జరిగిందా అన్న చర్చ సాగుతోంది.
వైసీపీ అధినాయకత్వం ఉత్తరాంధ్ర జిల్లాల పార్టీ నేతలతో ఒక కీలక సమావేశాన్ని ఈ నెల 12న నిర్వహిస్తుందని ఈ సమావేశంలోనే పేర్ని నాని నియామకం ప్రకటన ఉంటుందని అంటున్నారు. చూడాలి మరి ఈ ప్రచారంలో ఎంతవరకూ నిజముందో.