Begin typing your search above and press return to search.

వైసీపీకి బిగ్ షాక్.. ఒంగోలు కార్పొరేషన్ ను ఊడ్చేసిన జనసేన?

మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అనుచరులుగా ముద్రపడిన వారంతా ఈ రోజు జనసేనలో చేరేందుకు నిర్ణయం తీసుకున్నారు.

By:  Tupaki Desk   |   25 Feb 2025 8:39 AM GMT
వైసీపీకి బిగ్ షాక్.. ఒంగోలు కార్పొరేషన్ ను ఊడ్చేసిన జనసేన?
X

ప్రతిపక్ష వైసీపీకి వరుస షాకులు తగులుతున్నాయి. అధికారం పోయిన నుంచి ఆ పార్టీ నుంచి వలసలు ఎక్కువవుతున్నాయి. తాజాగా ఒంగోలు కార్పొరేషన్ లో సుమారు 20 మంది కార్పొరేటర్లు వైసీపీ కండువాను మార్చేయాలని నిర్ణయించారు. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అనుచరులుగా ముద్రపడిన వారంతా ఈ రోజు జనసేనలో చేరేందుకు నిర్ణయం తీసుకున్నారు.

గత ఎన్నికల్లో వైసీపీ పరాజయం తర్వాత బాలినేని ఆ పార్టీకి రాజీనామా చేశారు. వైసీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీలో కొనసాగిన బాలినేని ఎన్నికల ముందు నుంచి పార్టీపై అసంతృప్తితో రగిలిపోయేవారు. అయితే బలవంతంగా ఎన్నికల్లో పోటీ చేసినా, ఓటమి తర్వాత వైసీపీలో ఇమడలేక రాజీనామా చేశారు. వెంటనే జనసేన తీర్థం పుచ్చుకుని ప్రకాశం జిల్లాలో జనసేన బలోపేతానికి కృషి చేస్తున్నారు. ఇక తన సొంత నియోజకవర్గం ఒంగోలుపై ఫోకస్ చేసిన బాలినేని.. వైసీపీని పూర్తిగా ఖాళీ చేయించే టార్గెట్ పెట్టుకున్నారని చెబుతున్నారు.

ఒంగోలు కార్పొరేషన్ లో వైసీపీ కార్పొరేటర్లుగా ఎన్నికైన సుమారు 20 మంది ఒకేసారి పార్టీ మారాలని నిర్ణయం తీసుకోవడం సంచలనంగా మారింది. గతంలో కొందరు బాలినేనితో కలిసి వైసీపీకి రాజీనామా చేశారు. తాజాగా రాజీనామా చేయనున్న 20 మందితో కలిపి కార్పొరేషన్ లో జనసేన మెజార్టీ సాధించనుందని అంటున్నారు. వాస్తవానికి ఈ 20 మంది గతంలోనే జనసేన తీర్థం పుచ్చుకోవాల్సివుండగా, జనసేనాని, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అందుబాటులో లేకపోవడం వల్ల కొంత ఆలస్యమైందని అంటున్నారు. ఈ రోజు మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో పవన్ సమక్షంలో కార్పొరేటర్లు జనసేనలో చేరనున్నట్లు చెబుతున్నారు.

ఎన్నికల తర్వాత చాలా మంది కార్పొరేటర్లు టీడీపీలో చేరారు. దీంతో ఒంగోలు కార్పొరేషన్ పై టీడీపీ జెండా ఎగరవేసిందని గుర్తు చేస్తున్నారు. తాజాగా 20 మంది కార్పొరేటర్లు జనసేనలో చేరితే కార్పొరేషన్ లో కూటమి ఆధిపత్యం పెరుగుతుందని చెబుతున్నారు. అయితే కార్పొరేటర్లు పార్టీని వీడుతారని తెలిసినా, వారిని నిలువరించేందుకు వైసీపీ ఎలాంటి ప్రయత్నాలు చేయకపోవడం గమనార్హం.