వైసీపీకి భారీ సవాళ్లు.. జగన్ ఏం చేస్తారో ..!
ప్రస్తుతం వైసీపీ ఉన్న పరిస్థితిని అంచనా వేస్తే.. అనేక సవాళ్లు ఎదురవుతున్నాయని అంటున్నారు.
By: Tupaki Desk | 10 March 2025 3:00 PM ISTప్రస్తుతం ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప.. అసెంబ్లీకి రానని మంకు పట్టు పట్టిన వైసీపీ అధినేత జగ న్.. ఇలానే వ్యవహరిస్తే.. రాబోయే రోజుల్లో ఆయనకు మరిన్ని సవాళ్లు ఎదురవడం ఖాయమని అంటున్నా రు పరిశీలకులు. ప్రస్తుతం పార్టీ పరిస్థితి ఏమాత్రం బాగోలేదని చెబుతున్నారు. ప్రస్తుతం వైసీపీ ఉన్న పరిస్థితిని అంచనా వేస్తే.. అనేక సవాళ్లు ఎదురవుతున్నాయని అంటున్నారు. 2014, 2019 ఎన్నికల్లో జగన్ ప్రతిభ వేరు. ఆయన వ్యవహారం వేరు. ప్రజల్లో ఉన్న సింపతీ వేరని లెక్కలు కడుతున్నారు.
కానీ, ఒక చాన్స్ ఇచ్చిన తర్వాత.. జగన్ గ్రాఫ్ పడిపోవడంతోపాటు.. పార్టీ కూడా కుదేలైంది. నాయకులు చిన్నాభిన్నం అయ్యారు. పార్టీ జెండా మోసేవారు గ్రామీణ స్థాయిలో ఎవరూ కనిపించడం లేదు. ఒకప్పుడు కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ప్రత్యర్థి పార్టీల కార్యక్రమాలు నిర్వహించేందుకు నేతలు భయపడిన పరిస్థితి ఉంది. ఇప్పుడు వైసీపీ పరిస్థితి కూడా ఇలానే ఉందని తెలుస్తోంది. తమపై కేసులు ఉండడం.. కూటమి సర్కారు దూకుడుగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో నాయకులు రావడం లేదు.
ఇక, సవాళ్ల విషయానికి వస్తే.. వచ్చే ఎన్నికల నాటికి.. వైసీపీ పుంజుకోవాలంటే.. జీరో స్థాయి నుంచి రాజకీయాలు ప్రారంభించాల్సిన అవసరం ఉందని పరిశీలకులు చెబుతున్నారు. 2014లో ఎలా అయితే.. జీరో లెవిల్ నుంచి జగన్ రాజకీయాలు చేపట్టారో.. ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉంటుందని అంచనా వేస్తు న్నారు. ఇది ప్రధానంగా వైసీపీకి పెను సవాలుగా మారే అవకాశం ఉంది. పనిచేసిన కార్యకర్తలను పట్టించుకుంటారన్న భరోసా ఇప్పటికీ ఆ పార్టీ కార్యకర్తల్లో కనిపించడం లేదు.
అదేసమయంలో నాయకులు కూడా పార్టీ విషయంలో తటస్థ ధోరణినే అవలంబిస్తున్నారు. దీంతో జగన్ జీరో నుంచి పార్టీని డెవలప్ చేయాల్సి ఉంటుంది. ఇదిలావుంటే.. మరోవైపు కూటమి బలం వీగిపోయేలా కనిపించడం లేదు. పైగా.. నానాటికీ మరింత బలోపేతం అవుతున్న సంకేతాలు వస్తున్నాయి. ఇదే విషయాన్ని టీడీపీ, జనసేన నాయకులు కూడా చెబుతున్నారు. కాబట్టి ఈ ప్రభావం నుంచి కూడా వైసీపీని బయటకు తీసుకురావాల్సిన అవసరం ఉంటుందన్న సంకేతాలు వస్తున్నాయి. మొత్తానికి చాలానే సవాళ్లు వైసీపీకి ఎదురుకానున్నాయన్న అంచనా ఉంది.