నరసారావుపేటకు కాసు...డాక్టర్ గారికి రెస్ట్ ?
ఇదిలా ఉండగా గుంటూరు జిల్లా అంటే ఠక్కున గుర్తుకు వచ్చే ఒక కీలక అసెంబ్లీ నియోజకవర్గం నరసారావుపేట. ఇది ఒకనాడు కాంగ్రెస్ కి కంచుకోట. కాసు బ్రహ్మానందరెడ్డి కుటుంబానికి ఈ నియోజకవర్గం అడ్డా.
By: Tupaki Desk | 15 Jan 2025 7:30 PM GMTవైసీపీ ఉమ్మడి గుంటూరు జిల్లాలోని పలు అసెంబ్లీ నియోజకవర్గాలలో కీలక మార్పులను చేపట్టనుంది. బలమైన చురుకైన నాయకులను బరిలోకి దింపాలని చూస్తోంది. 2024 ఎన్నికల్లో ఓటమిని ఒక చేదు అనుభవంగా చూస్తోంది. దాని నుంచి బయటపడేందుకు మార్గాలను వెతుకుతోంది.
ఇదిలా ఉండగా గుంటూరు జిల్లా అంటే ఠక్కున గుర్తుకు వచ్చే ఒక కీలక అసెంబ్లీ నియోజకవర్గం నరసారావుపేట. ఇది ఒకనాడు కాంగ్రెస్ కి కంచుకోట. కాసు బ్రహ్మానందరెడ్డి కుటుంబానికి ఈ నియోజకవర్గం అడ్డా. ఉమ్మడి ఏపీలో అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన కాసు బ్రహ్మానందరెడ్డి ఇక్కడ నుంచే ఎమ్మెల్యే అయ్యారు. ఆ తరువాత కాసు వెంకట కృష్ణా రెడ్డి మూడు సార్లు గెలిచారు.
ఇక తెలుగుదేశం పార్టీ వచ్చాక ఈ నియోజకవర్గం నుంచి అత్యధిక సార్లు గెలిచి చరిత్ర సృష్టించారు దివంగత నేత కోడెల శివప్రసాదరావు. ఆయన 1983 నుంచి 1999 వరకూ ఏకపక్షాన విజయం సాధిస్తూ నరసరావుపేటను టీడీపీకి కంచుకోట చేశారు.
ఇక 2004,2009 లలో కాంగ్రెస్ గెలిస్తే 2014, 2019లలో డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి వైసీపీ తరఫున విజయం సాధించారు. 2024లో చదలవాడ అరవింద బాబు గెలిచారు. అలా దాదాపుగా పాతికేళ్ళ తరువాత టీడీపీకి ఈ నియోజకవర్గంలో విజయం దక్కింది.
ఇదిలా ఉంటే ఈ నియోజకవర్గంలో కమ్మ, రెడ్డి డామినేటింగ్ రోల్ ప్లే చేస్తారు. బీసీలు ముస్లిములు, ఆర్యవైశ్యుల జనాభా కూడా ఎక్కువే. రాజకీయాన్ని వీరంతా మారుస్తూ ఉంటారు. వైసీపీ పుట్టాక వరసగా రెండు సార్లు గెలిచిన ఈ నియోజకవర్గం 2024 ఎన్నికల్లో చేజారడంతో ఆ పార్టీ హై కమాండ్ ప్రత్యేక దృష్టి పెడుతోంది. ఈ నియోజకవర్గంలో భారీ మార్పులు చేయాలని చూస్తోంది.
ఈ నియోజకవర్గం మీద ఎంతో మోజు ఉన్న గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డిని ఇక్కడ ఇంచార్జిని చేయాలని చూస్తోంది అని ప్రచారం సాగుతొంది. కాసు కుటుంబానికి ఈ నియోజకవర్గంలో గట్టి రాజకీయ బంధం ఉంది. దాంతో దూకుడు రాజకీయం చేసే కాసు మహేష్ రెడ్డికి ఈ నియోజకవర్గం పగ్గాలు అప్పగిస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచన పార్టీ చేస్తోంది అని అంటున్నారు
ఇక్కడ టీడీపీ కూడా బలంగా ఉండడంతో ఆ పార్టీని ఢీ కొట్టాలి అంటే కాసు మహేష్ రెడ్డిని దించడమే సరైన డెసిషన్ అని భావిస్తున్నారట. కాసు బ్రహ్మానంద రెడ్డి సీఎం గా చేశారు. ఆయన రాజకీయ వారసుడిగా కాసు వెంకట క్రిష్ణా రెడ్డి మంత్రిగా చేశారు. ఇపుడు మూడవ తరంలో కాసు మహేష్ రెడ్డి రాజకీయం చేస్తున్నారు. దాంతో ఆయనకు ఈ సీటు అప్పగిస్తే నరసారావు పేటలో అసలే బలంగా ఉన్న వైసీపీని గెలిపించుకుని వస్తారని అంటున్నారు.
అయితే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి సంగతేంటి అంటే ఆయనకు రెస్టేనా అన్న మాట వినిపిస్తోంది. మొత్తానికి కాసుని నరసారావుపేటకు తెచ్చేందుకు రంగం సిద్ధం అయిపోయిందని ప్రకటన వెలువడడమే తరువాయి అని అంటున్నారు చూడాలి మరి ఏమి జరుగుతుందో.