వైసీపీ ఈసారి పొత్తులతోనే ?
వైసీపీ ఒంటరిగా పోటీ చేస్తే ఇబ్బందులు తప్పవన్న చర్చ ఉంది. కూటమికి వ్యతిరేకంగా విపక్షంలో ఉన్న వైసీపీ కూడా కూటమిని ఒక దానిని ఏర్పాటు చేయాల్సిన అవసరం అయితే కచ్చితంగా ఉందని కూడా అంటున్నారు.
By: Tupaki Desk | 15 Dec 2024 2:30 PM GMTఏపీలో సింగిల్ పార్టీ ఏదైనా ఉంది అంటే అది వైసీపీయే. ఆ మాటకు వస్తే దేశంలో కూడా సింగిల్ గా పోటీ చేసిన పార్టీ ఇటీవల కాలంలో కనిపించదు. పార్టీలు ఎవరు పెట్టినా అప్పటి రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటారు.
పొత్తులు పెట్టుకుని బలోపేతం కావాలని చూస్తారు. అదేంటో తెలియదు కానీ వైసీపీకి పొత్తులు అంటే గిట్టదన్న ప్రచారం సాగింది. రాజకీయాల్లో పొత్తులు కూడా ఎత్తులని అవి వ్యూహంలో భాగమని కూడా విశ్లేషకుల నుంచి రాజకీయ పండితుల దాకా అంతా చెబుతారు.
కానీ వైసీపీ తన వ్యూహాలకు పదును పెట్టే క్రమంలో అసలైన వ్యూహాన్ని మాత్రం ఎక్కడో వదిలేసింది. సింహం సింగిల్ గానే వస్తుంది అంటూ పవర్ ఫుల్ డైలాగులను కూడా వాడుతూ వచ్చింది. వైసీపీ 2011లో ఏర్పాటు అయింది. అప్పట్లో వైఎస్సార్ మరణం అనంతరం వచ్చిన భారీ సానుభూతి వైసీపీకి అలా కలసి వచ్చింది. 2012లో జరిగిన ఉప ఎన్నికల్లో అయితే జగన్ జైలుకు వెళ్ళిన సానుభూతి బాగా వర్కౌట్ అయింది. 2014 ఎన్నికల్లో ఊస్తే వైసీపీ జోరుతో అధికారంలోకి వస్తుందన్న అంచనాలు ఉన్నాయి.
విభజన ఏపీలో టీడీపీ వైసీపీ తప్ప మరో పార్టీ అయితే లేదు. కాంగ్రెస్ పూర్తిగా కుదేలు అయింది. అలా అన్ని విధాలుగా కలసి వచ్చి వైసీపీ అధికారానికి బాగా దగ్గరగా వచ్చింది. 2019లో అయితే జగన్ ని ఎలాగైనా సీఎం గా చేసుకుని వైఎస్సార్ పాలననను తిరిగి తెచ్చుకోవాలన్న కసి జనాలలో వైసీపీ క్యాడర్ లో కూడా పెద్ద ఎత్తున కనిపించింది.
ఇలా అన్ని ఎన్నీకలలో వైసీపీ సోలోగా బరిలోకి దిగినా ఆయా రాజకీయ పరిస్థితులే వైసీపీని ముందంజలో నిలబెట్టాయి తప్ప మరోటి కాదు. ఇవన్నీ పక్కన పెడితే 2024 ఎన్నికల్లో వైసీపీ సోలోగా పోటీ చేసి ఓటమి పాలు అయింది. 2029 నాటికి వైసీపీ పోటీ చేయడం అంటే ఆ పార్టీ అధికారంలో ఉన్నపుడు చేసిన పెర్ఫార్మెన్స్ తో పాటు అన్నీ మళ్లీ చూస్తారు.
ఇక వైసీపీకి ఎలాంటి ఎమోషన్స్ కూడా వర్కౌట్ అయ్యే చాన్స్ లేని వేళ కచ్చితంగా పొత్తుల వైపు చూడాల్సిన అవసరం ఉంది అని అంటున్నారు. ఈ నేపధ్యంలో వైసీపీలోనూ పొత్తులతో వెళ్తే బెటర్ అన్న చర్చ అయితే ఉందని కూడా అంటూ వస్తున్నారు. టీడీపీ కూటమిలో బీజేపీ జనసేన ఉన్నాయి. దాంతో బలంగా ఆ వైపు ఉంది. వైసీపీ ఒంటరిగా పోటీ చేస్తే ఇబ్బందులు తప్పవన్న చర్చ ఉంది. కూటమికి వ్యతిరేకంగా విపక్షంలో ఉన్న వైసీపీ కూడా కూటమిని ఒక దానిని ఏర్పాటు చేయాల్సిన అవసరం అయితే కచ్చితంగా ఉందని కూడా అంటున్నారు.
ఇలా చర్చలు కానీ ఆలోచనలౌ కానీ వైసీపీలో ఉన్నాయని వార్తలు వస్తున్న వేళ విశాఖలో ఆ పార్టీ కీలక నేత ఎంపీ విజయసాయిరెడ్డి పొత్తులో విషయంలో సంచలన ప్రకటన చేశారు. తమ పార్టీ పొత్తుల గురించి జగన్ డిసైడ్ చేస్తారు అని విజయసాయిరెడ్డి చెప్పడం చూస్తే కనుక పొత్తుల ఎత్తులు ఏవో వైసీపీ హై కమాండ్ కి ఉన్నట్లుగా కనిపిస్తోంది అని అంటున్నారు.
లేకపోతే పొత్తుల విషయంలో పూర్తిగా కొట్టి పారేసేవారు అని కూడా అంటున్నారు. అయితే పార్టీ పెట్టిన సుదీర్ఘ కాలం తరువాత వైసీపీ ఒక వేళ పొత్తులను పెట్టుకోవాల్సి వస్తే ఎవరితో పెట్టుకుంటుంది ఏమిటి అన్నది కూడా చర్చకు వస్తున్న విషయం. ఏపీలో చూస్తే కాంగ్రెస్ వామపక్షాలు విపక్షంలో ఉన్నాయి. వైసీపీ అయితే ఎవరితో పొత్తుకు సిద్ధపడుతుందన్నది కూడా ప్రశ్నగా ఉంది. ఏది ఏమైనా ఎన్నికల ముందే పొత్తుల విషయం చర్చకు వస్తుంది కాబట్టి అప్పటిదాకా ఈ అంశంలో ఎవరి ఆలోచనలు వారు చేసుకోవాల్సి ఉంటుంది అని అంటున్నారు.