వైసీపీ ఎంపీలలో వారే అట్రాక్షన్...టార్గెట్ అక్కడే ?
వైసీపీ 2024లో రాజ్యసభకు జరిగిన ద్వైవార్షిక ఎన్నికల తరువాత రాజ్యసభలో అమాంతం బలం పెంచుకుంది.
By: Tupaki Desk | 28 Jan 2025 6:30 AM GMTవైసీపీ 2024లో రాజ్యసభకు జరిగిన ద్వైవార్షిక ఎన్నికల తరువాత రాజ్యసభలో అమాంతం బలం పెంచుకుంది. ఒక హిస్టరీ కూడా క్రియేట్ చేసింది. అదేంటి అంటే ఏపీ కోటాలో ఉన్న మొత్తానికి మొత్తం 11 రాజ్యసభ ఎంపీ సీట్లను వైసీపీ గెలుచుకుంది. అంతే కాదు విపక్షానికి నో చాన్స్ అన్నట్లుగా చెక్ పెట్టేసింది. ఇదంతా 2024 మార్చిలో వైసీపీకి ఉన్న అసెంబ్లీ బలం మీదనే జరిగింది.
అసెంబ్లీలో వైసీపీకి 151 సీట్లు పైగా మద్దతుగా మరో అరడజను మంది ఎమ్మెల్యేలతో ఎదురు లేకుండా పోయింది. దాంతో చాలా మందిని రాజ్యసభకు పంపించింది. ఇక షెడ్యూల్ ప్రకారం చూస్తే 2026 జూన్ 21న నాలుగు ఎంపీ సీట్లకు ఎన్నికలు ఉంటాయి.
వైసీపీ నుంచి పిల్లి సుభాష్ చంద్రబోస్, అయోధ్య రామిరెడ్డి, పరిమళ్ నత్వానీ ఈసారి రిటైర్ అవుతారు. అంటే ఈ ముగ్గురు ఈ రోజు రాజీనామా చేసినా వారి పదవీ కాలం ఏణ్ణర్థం కంటే తక్కువ ఉంది. ఇందులో అయోధ్య రామిరెడ్డి మీద పార్టీ మారుతారు అని ప్రచారం అయితే సాగుతోంది.
ఇక పరిమళ్ నత్వానీ అదానీకి సన్నిహితుడుగా పేరుంది. ఆయన వైసీపీకి పేరుకే కానీ బీజేపీకే అనుకూలం అంటారు. సో 2026లో రిటైర్ అయ్యే ఈ ముగ్గురి విషయంలో టార్గెట్ ఉన్నా పెద్దగా అయితే ఉండదని అంటున్నారు. ఎటూ కళ్ళు మూసుకుంటే ఇట్టే ఏణ్ణర్థం గడుస్తుంది ఈ పదవులు అన్నీ కూటమికి వెళ్తాయి.
ఇక 2028లో జూన్ 22 నాటికి నిరంజన్ రెడ్డి తన పదవిని పూర్తి చేసుకుంటారు. అదే సమయానికి విజయసాయిరెడ్డి కూడా పదవి పూర్తి చేసుకోవాలి. కానీ ఆయన ఇటీవల రాజీనామా చేసారు. ఇక నిరంజన్ రెడ్డి జగన్ కి అత్యంత సన్నిహితులు. ఆయన కేసులు చూస్తున్న వారుగా ఉన్నారు. దాంతో ఆయనని టార్గెట్ చేసినా జంప్ చేయడం కష్టమని అంటున్నారు.
ఇక 2030 ఏప్రిల్1 వరకూ పదవీ కాలం ఉన్న వారు ముగ్గురు ఉన్నారు. వీరు అత్యంత అట్రాక్షన్ గా ప్రత్యర్ధులకు ఉన్నారని అంటున్నారు. ఎందుకంటే మరో అయిదేళ్ళకు పైగా వీరికి పదవీ కాలం ఉంది. ఈ ముగ్గురూ వైసీపీకి చెందిన వైవీ సుబ్బారెడ్డి, మేడ రఘునాధరెడ్డి, గొల్ల బాబూరావు. వీరిలో ఎవరు పదవులు వదులుకున్నా కూటమికి అధి జాక్ పాటే అవుతుంది. ఎందుకంటే హ్యాపీగా అయిదేళ్లకు పైగా ఈ పదవిలోకి కొత్త వారు వస్తారు.
మరి ఈ ముగ్గురులో ఎవరు వైసీపీకి దూరం అవుతారు అని చూస్తే కనుక వైవీ సుబ్బారెడ్డి జగన్ కి సొంత బాబాయ్. కాబట్టి ఆయన మారకపోవచ్చు. మిగిలిన ఇద్దరి విషయంలో మాత్రం ఎవరికి తోచిన ప్రచారం వారు చేస్తున్నారు. ఏతా వాతా తేలేది ఏంటి అంటే వైసీపీకి ఇపుడు ఉన్న ఏడుగురులో కూడా ఆ నంబర్ సగానికి సగం అవుతుందా అని. అదే జరిగితే ఎంత కాలంలోగా జరుగుతుంది అన్నది మరో చర్చ. సో వెయిట్ అండ్ సీ.