పవన్ కల్యాణ్ కు జీవోలతో కౌంటర్ ఇచ్చిన వైసీపీ!
ఏపీలో వాలంటీర్ల వ్యవస్థపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గతంలో ఎన్నో వివాదాస్పద, సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 8 Nov 2024 4:58 AM GMTఏపీలో వాలంటీర్ల వ్యవస్థపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గతంలో ఎన్నో వివాదాస్పద, సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా మరోసారి ఆ వ్యవస్థపై తనకున్న క్లారిటీని ఇచ్చారు పవన్ కల్యాణ్! గ్రామ సచివాలయ వ్యవస్థను పంచాయతీలో విలీనం చేయాలని, వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయాలని చాలామంది తనను కోరారని ఆయన తెలిపారు.
అయితే... ప్రభుత్వ రికార్డుల్లో ఎక్కడా గ్రామ వాలంటీర్ల అంశమే లేదని.. అసలు ఉద్యోగాల్లోనే లేరంటే రద్దు అంశం ఎక్కడుందని అన్నారు. గత ప్రభుత్వ వాళ్లను మోసం చేసి పెట్టుకుందని పవన్ తెలిపారు. ఈ ప్రభుత్వం వారికి జీతాలు పెంచుదామని చూస్తున్నప్పటికీ వాళ్ల ప్రస్థావన ఏ జీవోల్లోనూ లేదని అన్నారు.
ఇదే సమయంలో... వైసీపీ ప్రభుత్వం వాలంటీర్లను చాలా అన్యాయంగా మోసం చేసిందని, ఈ మెసేజ్ ను కూడా జనాల్లోకి తీసుకెళ్లాలని అన్నారు! దీంతో... ఇక ఏపీలో వాలంటీర్ల వ్యవస్థ అనేది ముగిసిన అధ్యాయం అని, పవన్ స్పష్టం చేసినట్లేననే కామెంట్లు వినిపించాయి. ఈ సమయంలో వైసీపీ స్పందించింది. ఎక్స్ వేదికగా పలు జీవోలు చూపించింది!
అవును... ప్రభుత్వ రికార్డుల్లో ఎక్కడా గ్రామ వాలంటీర్ల అంశమే లేదని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాన్ చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్న వేళ... వైసీపీ స్పందించింది. ఇందులో భాగంగా... గత ప్రభుత్వ హయాంలో వాలంటీర్లకు సంబంధించి జనరల్ అడ్మినిస్ట్రేషన్, పంచాయతీ రాజ్ & రూరల్ డెవలప్మెంట్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లకు సంబంధించిన జీవోలను వెల్లడించింది.
ఈ సందర్భంగా... 13 ఏప్రిల్ 2020లో ఇచ్చిన జీవో ఎం.ఎస్.:33.. 22 జూన్ 2019 లో ఇచ్చిన జీవో ఎం.ఎస్.:104.. ఆ మరుసటి రోజు జూన్ 23 న ఇచ్చిన జీవో ఎం.ఎస్స్:201.. 9 సెప్టెంబర్ 2019 న ఇచ్చిన జీవో ఎం.ఎస్.: 254.. 25 అక్టోబర్ 2019లో ఇచ్చిన జీవో ఎం.ఎస్.:165.. 29 అక్టోబర్ 2019లో ఇచ్చిన జీవో ఎం.ఎస్.:279 లకు సంబంధించిన ఫోటోలను ఎక్స్ లో పోస్ట్ చేసింది.
ఈ సందర్భంగా... "మీరు డిప్యూటీ సీఎంగా ఎలా కొనసాగుతున్నారో మాకైతే అర్ధం కావడం లేదు పవన్ కల్యాణ్.. వాలంటీర్లకు సంబంధించి ఇన్ని జీవోలు ఇచ్చి నియామకాలు చేస్తే.. మీ అజ్ఞానపు మాటలతో మీ పరువు మీరే తీసుకుంటున్నారు" అని వాలంటీర్లపై తాజాగా పవన్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను జత చేసింది.