వైసీపీలో సాగర ఘోష...క్యాడర్ లో నిరాశ
ఆ నేపధ్యంలో ఉత్తరాంధ్రా వైసీపీకి షాక్ ఇవ్వడం వింతా విడ్డూరం కానే కాదు అని అంటున్నారు.
By: Tupaki Desk | 26 Dec 2024 4:02 AM GMTవైసీపీకి బలం ఉన్న చోటనే 2024 ఎన్నికల్లో ఘోర ఓటమి పలకరించింది. ఏ రీజియన్ ఆదరించకపోయినా రాయలసీమ తమకు గ్యారంటీ అని ఆ విధంగా చూస్తే 50 సీట్లకు తక్కువ కాకుండా దక్కుతాయని చివరాఖరులో వేసుకున్న లెక్కలు సైతం తారు మారు చేస్తూ రాయలసీమ దెబ్బ కొట్టింది.
ఆ నేపధ్యంలో ఉత్తరాంధ్రా వైసీపీకి షాక్ ఇవ్వడం వింతా విడ్డూరం కానే కాదు అని అంటున్నారు. ఎందుకంటే మొదటి నుంచి ఉత్తరాంధ్ర టీడీపీకి కంచుకోట. 2014లో వైసీపీ మొత్తం మూడు జిల్లాలలో కలుపుకుని 34 అసెంబ్లీ సీట్లకు గానూ కేవలం తొమ్మిది అసెంబ్లీ సీట్లను మాత్రమే గెలిచింది. అదే 2019కి వచ్చేసరికి మాత్రం 34కి 28 సీట్లు సాధించి కొత్త రికార్డు క్రియేట్ చేసింది.
అయితే గిర్రున అయిదేళ్ళు తిరిగేసరికి వైసీపీ సీట్ల నంబర్ రెండుకు పడిపోయింది. ఇది వైసీపీ దారుణమైన గ్రాఫ్ ని తెలియచేస్తోంది. ఇక మరో విషయం చెప్పాలీ అంటే 2014 నుంచి చూస్తూంటే విశాఖ సిటీలో వైసీపీ ఎక్కడా బలంగా లేకపోవడం 2019లో సైతం విశాఖలో నాలుగు సీట్లూ టీడీపీ పరం అయ్యాయి. ఇపుడు ఏజెన్సీలోని పాడేరు, అరకు వంటి రెండు అసెంబ్లీ సీట్లు తప్ప విశాఖ నగరంతో పాటు రూరల్ జిల్లా కూడా టీడీపీ కూటమి పరం అయింది.
దాంతో వైసీపీకి దిక్కు తోచకుండా పోతోంది. విశాఖ సిటీలో వైసీపీ బలం నానాటికీ తీసికట్టుగా మారుతోంది. పార్టీ నుంచి ఒక్కొక్కరుగా నేతలు జారిపోతున్నారు. డిసెంబర్ 13న ఏపీ వ్యాప్తంగా రైతుల కోసం ధర్నాలు చేయాలని ఆ పార్టీ పిలుపు ఇచ్చింది. అయితే దానికి ఒక రోజు ముందే మాజీ మంత్రి భీమిలీ మాజీ ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్ పార్టీకి రాజీనామా చేశారు.
ఇక ఆయన రాజీనామా చేసి రోజులు గడవకముందే విశాఖ డెయిరీ చైర్మన్ ఆడారి ఆనంద్ కుమార్ తో పాటు ఎలమంచిలి చైర్ పర్సన్ పిల్లా రమాకుమారి సహా కీలక నేతలు అంతా వైసీపీకి గుడ్ బై కొట్టి బీజేపీ తీర్ధం పుచ్చుకున్నారు. దాంతో పార్టీలో ఏమి జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి ఉంది అని క్యాడర్ అంటోంది.
వైసీపీ ఆరు నెలల తరువాత తొలిసారిగా విశాఖ కలెక్టరేట్ వద్ద నిర్వహించిన నిరసన కార్యక్రమానికి అతి తక్కువ సంఖ్యలో నేతలు క్యాడర్ హాజరు కావడంతో విశాఖలో పార్టీ ఏమవుతుంది అన్న చర్చ మొదలైంది. విశాఖ ఎంపీగా అయిదేళ్ల పాటు పనిచేసిన ఎంవీవీ సత్యనారాయణ పార్టీకి సంబంధం లేదు అన్నట్లుగా ఉంటున్నారు. విశాఖ స్మార్ట్ సిటీ చైర్మన్ గా కీలక నామినేటెడ్ పోస్టుని అనుభవించిన మరో నేత కూడా గమ్మున ఉన్నారు. డీసీసీబీ చైర్మన్ పదవిని ఇచ్చి విశాఖ వైసీపీ అధ్యక్ష బాధ్యతలు నిన్నటి వరకూ ఇచ్చినా కోలా గురువులు ఇపుడు మౌనంగా ఉన్నారు.
ఇంకా అనేక మంది నేతలు అలాగే ఉన్నారు. వైసీపీలో నేతలు అయితే పెద్దగా కనిపించడం లేదు. జనాలలోకి వచ్చి ప్రజా సమస్యల మీద చర్చించే ప్రభావవంతమైన నేతలు అయితే లేరు అనే అంటున్నారు. మరో వైపు చూస్తే విశాఖ సిటీలో టీడీపీ బీజేపీ జనసేన మూడూ బలంగా ఉన్నాయి. ఈ నేపధ్యంలో పార్టీని పట్టుకుని దారికి తేలేకపోతే మాత్రం ఇబ్బందులు తప్పవని అంటున్నారు. విశాఖ వైసీపీ సాగర ఘోష అధినాయకత్వానికి ఇకనైనా వినిపిస్తుందా అన్నదే చర్చగా ఉంది.