Begin typing your search above and press return to search.

రాయలసీమలో వైసీపీకి ఆ రెండూ ఆయుధాలు ?

అలాంటి రాయలసీమలో 2024 ఎన్నికల్లో వైసీపీకి చావు దెబ్బ తగిలింది.

By:  Tupaki Desk   |   17 Nov 2024 2:45 AM GMT
రాయలసీమలో వైసీపీకి ఆ రెండూ ఆయుధాలు ?
X

రాయలసీమ వైసీపీకి కంచుకోట. అది ఆ పార్టీ పుట్టిన దగ్గర నుంచి ఆదరిస్తూ వస్తున్న ప్రాంతం. ఒక విధంగా చెప్పాలీ అంటే వైసీపీకి హార్డ్ కోర్ రీజియన్ గా ఉంది. అలాంటి రాయలసీమలో 2024 ఎన్నికల్లో వైసీపీకి చావు దెబ్బ తగిలింది. మొత్తం 52 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే అందులో 5 సీట్లు మాత్రమే దక్కిన నేపధ్యం ఉంది. దీంతో రాయలసీమలో టీడీపీ వైసీపీ కూసాలను కదిపేసినట్లు అయింది.

ఈ క్రమంలో అయిదు నెలల పాటు దిక్కుతోచని స్థితిలో ఉన్న వైసీపీకి ఇపుడు టీడీపీ కూటమి ప్రభుత్వం రెండు కొత్త ఆయుధాలను తయారు చేసి ఇచ్చిందా అన్న చర్చ అయితే సాగుతోంది. ఆ రెండు కొత్త ఆయుధాలు ఏంటి అంటే ఒకటి లోకాయుక్త. రెండు మానవ హక్కుల కమిషన్. ఈ రెండు ఆఫీసులను జగన్ ప్రభుత్వం కర్నూల్ లో ఏర్పాటు చేసింది. అదే విధంగా లా యూనివర్శిటీని కూడా తెచ్చింది

హై కోర్టుని కర్నూల్ కి తరలిస్తామని కూడా వైసీపీ అప్పట్లో చెప్పింది. అయితే మూడు రాజధానుల ముచ్చటలో వైసీపీకి నాడు అన్నీ చిక్కులే ఎదురయ్యాయి కాబట్టి అది కాస్తా ఆగింది. ఈ నేపథ్యంలో జగన్ ప్రభుత్వం ఇచ్చిన లోకాయుక్త. అలాగే మానవ హక్కుల కమిషన్ ని తరలించాలని కూటమి ప్రభుత్వం చూస్తే సహించేది లేదని వైసీపీ నేతలు అంటున్నారు.

ఈ మేరకు వారు తాజాగా ప్రెస్ మీట్ పెట్టి మరీ కూటమి ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు. శ్రీభాగ్ ఒప్పందాన్ని కూడా గుర్తు చేశారు. కర్నూల్ ని ఎపుడూ త్యాగాల ప్రాంతంగానే ఉంచాలని చూస్తున్నారా అని కూడా చంద్రబాబుని ప్రశ్నించారు.

రాయలసీమకు రాజధాని అయినా హై కోర్టు అయినా ఇవ్వాలని శ్రీభాగ్ ఒప్పందంలో చెప్పారని దానిని అమలు చేయకపోగా వచ్చిన వాటిని కూడా తీసుకుపోతూంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. కర్నూల్ మేయర్ బీవీ రామయ్య కర్నూల్ నంద్యాల జిల్లాల వైసీపీ అధ్యక్షులు ఎస్వీ మోహన్ రెడ్డి, కాటసాని రాం భూపాల్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఈ విషయంలో తాము ఎందాకైనా వెళ్తామని పోరాటాల ద్వారా కర్నూల్ నుంచి న్యాయ కార్యలయాలు తరలింపుని ఆపుతామని స్పష్టం చేశారు.

చంద్రబాబు ఎపుడు అధికారంలోకి వచ్చినా కర్నూల్ కి అన్యాయం జరుగుతోందని వారు ఆరోపించారు. ఈసారి అలా జరగనీయమని కూడా స్పష్టం చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఇటీవల హై కోర్టులో కర్నూల్ లోని న్యాయ కార్యాలయాల తరైంపు పిటిషన్ మీద విచారన జరిగినపుడు కూటమి ప్రభుత్వం తరఫున న్యాయవాదులు తొందరలోనే వాటిని అమరావతికి తరలిస్తామని చెప్పారు.

దీంతో వైసీపీ నేతలు తాజాగా మీడియా ముందుకు వచ్చి ప్రభుత్వం మీద విమర్శలు చేశారు. మొత్తం మీద చూస్తే కర్నూల్ కేంద్రంగా ఈ న్యాయ కార్యాలయాల తరలింపు అంశాన్ని వైసీపీ రాజకీయంగా ఆయుధంగా చేసుకునే చాన్స్ ఉందని అంటున్నారు. సున్నితమైన అంశాలు కావడంతో వీటి మీద వైసీపీ తన వ్యూహాలకు పదును పెడుతోందని అంటున్నారు.