'ప్రధాన ప్రతిపక్షం' ఇస్తేనే ప్రజల్లోకి వస్తారా?
వైసీపీ నాయకులు ఎక్కడా కనిపించడం లేదు. వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలకు వీసమెత్తు సాయం కూడా అందించడం లేదు.
By: Tupaki Desk | 5 Sep 2024 2:45 AM GMTవైసీపీ నాయకులు ఎక్కడా కనిపించడం లేదు. వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలకు వీసమెత్తు సాయం కూడా అందించడం లేదు. మరి వారు ఏమనుకుంటున్నారు? గెలిచిన 11 మందిలో జగన్ మాత్రం.. విజయవాడలో ఒకసారి పర్యటించారు. ఏదో నాలుగు మాటలు మాట్లాడి వెళ్లిపోయారు. ఇక, ఆ తర్వాత.. వైసీపీ నాయకులు ఎవరూ కూడా కనిపించలేదు.మరి ఈ పరిణామాన్ని ఎలా చూడాలి? అనేది ప్రశ్న. ప్రజలు తమకు ప్రధాన ప్రతిపక్షం హోదా కూడా ఇవ్వలేదన్న దుగ్ధతోనే ఇలా చేస్తున్నారా? అనేది సందేహం.
ఎన్నికల్లో వైసీపీకి 11 ఎమ్మెల్యే స్థానాలు మాత్రమే దక్కాయి. దీంతో ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కలేదు. దీని కోసం న్యాయ పోరాటం చేస్తున్నారు. అయితే.. తరచుగా ఈ విషయంపై స్పందిస్తున్న మాజీ సీఎం జగన్.. తమకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఉంటేనే ప్రజల తరఫున పనిచేయగలమని.. వారి తరఫున ప్రశ్నించగలమని అంటున్నారు. ప్రతిపక్ష హోదా లేకపోతే.. తమ మాట ఎవరూ వినిపించుకోరని.. మాట్లాడే అవకాశం కూడా ఇవ్వరని చెబుతున్నారు.
అయితే.. అది అసెంబ్లీ వరకు పరిమితం. కానీ, వరదల సమయంలో, వర్షాల సమయంలో ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు.. వారిని ఆదుకునేందుకు.. వారిలో భరోసా నింపేందుకు కూడా.. ప్రధాన ప్రతిపక్షం హోదా కావాలా? అనేది ఇప్పుడు ప్రశ్న. ఎందుకంటే.. వైసీపీలో గెలిచిన నాయకులు ఓడిన నాయకులు కూడా ఎవరూ ముందుకు రావడంలేదు. జగన్ వచ్చిన ఒకే ఒక్కసారి మాత్రమే బయటకు వచ్చారు. ఆయన వెంట ముందుకు నడిచారు. తర్వాత.. అందరూ గప్ చుప్ అయిపోయారు.