వైసీపీ నేతల విదేశీ టూర్లు.. రీజనేంటి ..!
దీనికి కారణం.. స్థానికంగా కొంత రిలాక్సేషన్ దొరుకుతుందన్న భావన ఉండడమేనా? లేక రాజకీయ పరమైన అంశాలు ఉన్నాయా? అన్నది ఆసక్తిగా మారింది
By: Tupaki Desk | 27 Oct 2024 5:30 PM GMTవైసీపీలో సీనియర్ నాయకులుగా ఓ వెలుగు వెలిగిన వారు.. ఇప్పుడు ఏపీలో ఉండలేక పోతున్నారా? లేక మరే కారణమో తెలియదు కానీ.. వరుస పెట్టి విదేశాలకు వెళ్లేందుకు తయారయ్యారు. పైగా.. వీరంతా కూడా.. కేసుల్లో చిక్కుకున్నవారే కావడం గమనార్హం. దీంతో వీరి ప్రయాణాలకు సదరు కోర్టుల పర్మిషన్ కోరుతున్నారు. అవి పర్మిషన్ ఇస్తే.. విదేశాలకు వెళ్లేందుకు రెడీ అవుతున్నారు. దీనికి కారణం.. స్థానికంగా కొంత రిలాక్సేషన్ దొరుకుతుందన్న భావన ఉండడమేనా? లేక రాజకీయ పరమైన అంశాలు ఉన్నాయా? అన్నది ఆసక్తిగా మారింది.
బొత్స సత్యనారాయణ: ఈయన ఇప్పటికే అమెరికా పర్యటనకు వెళ్లారు. అక్కడ సొంత పనులు ఉన్నా యన్నది ఆయన చెప్పినకారణం. అక్కడి నుంచిమెక్సికో కూడా వెళ్లనున్నట్టు తెలిసింది. ఈ నేపథ్యం లోనే ఇటీవల విజయనగరం పర్యటనకు జగన్ వచ్చినా.. బొత్స మిస్సయ్యారు. బొత్స తన కుటుంబ సభ్యులతో కలిసి అమెరికాలో పర్యటిస్తుండడం గమనార్హం. అయితే.. ఇది పూర్తిగా వ్యక్తిగతమని వైసీపీ చెబుతోంది.
పిన్నెల్లి రామకృష్నారెడ్డి: పల్నాడు జిల్లా మాచర్ల మాజీ ఎమ్మెల్యే, ఎన్నికల సమయంలో పోలింగ్ బూత్‌లో విధ్వంసం సృష్టించారన్న ఆరోపణలతో జైల్లో కూడా ఉన్నారు. బెయిల్పై వచ్చిన ఆయన తాజాగా విదేశాలకు వెళ్లాల్సి ఉందంటూ.. హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈయన కూడా కుటుంబంతో కలిసి సింగపూర్‌లో పర్యటించాలని నిర్ణయించుకున్నారు. ఈయనకు కోర్టు అనుమతిస్తే.. వెంటనే సింగపూర్‌కు వెళ్లనున్నారు.
వైఎస్ అవినాష్ రెడ్డి: కడప ఎంపీగా ఉన్న అవినాష్ రెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. తనకు అనుమతి ఇస్తే.. జపాన్ వెళ్లివస్తానని చెప్పారు. వ్యాపారాలు వ్యవహారాలతో నిమిత్తం లేకుండా.. కుటుంబం కొంత రిలాక్సేషన్ కోసం విదేశాలకు వెళ్లిరావాలని నిర్ణయించుకున్నట్టు అవినాష్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనికి కూడా కోర్టు అనుమతి ఇవ్వాల్సి ఉంది.
విజయసాయిరెడ్డి: వైసీపీ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు. ప్రస్తుతం ఈయన కూడా.. హైదరాబాద్‌లోని నాంపల్లికోర్టును ఆశ్రయించారు. గత నెలలోనే ఆయన విదేశాలకు వెళ్లాలని దరఖాస్తు చేసుకున్నారు. అయితే.. కొన్ని వ్యక్తిగత కారణాలతో వెనక్కి తీసుకున్నారు. తాజాగా మరోసారి తన దరఖాస్తును మూవ్ చేశారు. ఈయన ఎక్కడికి వెళ్తున్నదీ చెప్పకపోవడం గమనార్హం. అయితే.. ఇలా కీలక నాయకులు.. విదేశీ పర్యటనలకు వెళ్తున్న నేపథ్యంలో తెరవెనుక ఏమైనా జరుగుతోందా? అనేది చర్చకు దారితీసింది.