''వైసీపీ ప్రభుత్వం వచ్చాకే.. నిమజ్జనం చేస్తాం''
వినాయక చవితి సందర్భంగా బొజ్జగణపయ్యను ఊరూవాడా .. పిల్లా పాపా అందరూ పూజిస్తారు. పెద్ద ఎత్తున పందిళ్లువేసి మరీ సంబరాలు చేస్తారు.
By: Tupaki Desk | 17 Sep 2024 4:56 AM GMTవినాయక చవితి సందర్భంగా బొజ్జగణపయ్యను ఊరూవాడా .. పిల్లా పాపా అందరూ పూజిస్తారు. పెద్ద ఎత్తున పందిళ్లువేసి మరీ సంబరాలు చేస్తారు. 9 రోజలు, 5 రోజులు(ఎవరి స్థాయిని బట్టి వారు) పూజించి చివరి రోజు గణపయ్యలను ఊరేగింపుగా తీసుకు వెళ్లి.. సమీపంలోని నదులు, కాలువల్లో నిమజ్జనం చేయడం ఆనవాయితీగా వస్తోంది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా గణనాథుల నిమజ్జనాలు కొనసాగుతున్నాయి. అయితే.. ఏపీలో ఒక కీలక ప్రాంతంలో సంచలనం చోటు చేసుకుంది. దీంతో వైసీపీ నాయకులు ఈ గణనాధుడిని తమ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతే నిమజ్జనం చేస్తామని శపథం చేశారు.
రాజకీయ వివాదాలకు నెలవైన పల్నాడు జిల్లాలోని అచ్చంపేట మండల పరిధిలో ఉన్న గ్రంథసిరి గ్రామంలో వైసీపీ కార్యకర్తలు, నాయకులు చందాలు పోగేసుకుని.. భారీ గణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి.. గత వారం రోజులుగా పెద్ద ఎత్తున పూజలు చేయించారు. భజనలు, సంకీర్తనలు కూడా పెట్టుకున్నారు. ఇక, 9 రోజులు నిర్విఘ్నంగా గణపతిని పూజించిన వైసీపీ నాయకులు.. సోమవారం మధ్యాహ్నం నుంచి నిమజ్జనం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అచ్చంపేట వీధుల గుండా.. పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటూ.. సమీపంలోని కృష్ణానదిలో నిమజ్జనం చేయాలని ప్లాన్ చేసుకున్నారు.
ఈ క్రమంలో గణనాధుని పందిరి నుంచి పెద్ద ఎత్తున జాతరగా ఊరేగింపు ప్రారంభించారు. గణనాధుని విగ్రహాన్ని పెద్ద ట్రాక్టరుపై పెట్టి ఊరేగింపు ప్రారంభించారు. అయితే.. కొంత దూరం వచ్చిన తర్వాత.. టీడీపీ ప్రాబల్యం ఉన్న ప్రాంతం మీదుగా ఊరేగింపు సాగాల్సిఉంది. అయితే.. ఈ ఊరేగింపును తమ ప్రాంతం మీదుగా తీసుకువెళ్లడానికి వీల్లేదని టీడీపీ కార్యకర్తలు, క్షేత్రస్థాయి నాయకులు అడ్డు తగిలారు. ఊరేగింపునకు పోలీసుల అనుమతి లేదని వారు వాదనకు దిగారు. అంతేకాదు.. వెనుదిరిగి.. 20 కిలోమీటర్ల మేర తిప్పుకొని కృష్ణానదికి వెళ్లాలని పేర్కొన్నారు.
దీంతో వైసీపీ నాయకులు , టీడీపీ నాయకులకు మధ్య తీవ్ర వాగ్యుద్ధం నడిచింది. దీంతో జోక్యం చేసుకున్న పోలీసులు ఇరు వర్గాలను శాంతింప చేసేందుకు ప్రయత్నించారు. ఇక, అప్పటికే వైసీపీ నాయకులపై కేసులు ఉండడంతో వారిని అరెస్టు చేస్తామని పోలీసులు హెచ్చరించారు. దీంతో వినాయక విగ్రహాన్ని వైసీపీ నాయకులు తిరిగి మండపంలోకి తెచ్చి పెట్టేశారు. తమ వైసీపీ ప్రభుత్వం వచ్చినపుడే వినాయక నిమజ్జనం చేస్తామని వైసీపీ నేతలు శపథం చేశారు. అప్పటి వరకు నిత్యం ఆయనను పూజిస్తామన్నారు. ఈ ఘటన స్థానికంగానే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. మరి దీనిపై సర్కారు ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.