పరనింద కాదు.. ఆత్మవిమర్శే అవసరం!
నాయకులు వెళ్లిపోతున్నారు. కొందరు రాజీనామాలు చేసి రాజకీయ సన్యాసం తీసుకుంటున్నారు.
By: Tupaki Desk | 30 Aug 2024 12:30 AM GMTనాయకులు వెళ్లిపోతున్నారు. కొందరు రాజీనామాలు చేసి రాజకీయ సన్యాసం తీసుకుంటున్నారు. ఇది సహజంగానే ఏ పార్టీలో అయినా.. ఏ పార్టీ అధినేతకు అయినా.. ఆవేదన కలిగించేదే.. ఆక్రందన కలిగించేదే. ఈ క్రమంలో తన తప్పులు వదిలేసి.. పొరుగు పార్టీలపైనా.. జంపిగుల పైనా విమర్శలు చేయడం కూడా.. కామనే. ఇదే.. ఇప్పుడు వైసీపీ కూడా చేస్తోంది. పార్టీ నుంచి కొందరు నాయకులు సైలెంట్‌గా తప్పుకొన్నారు. మరికొందరు జంప్ చేశారు. ఇలాంటి సమయంలో విమర్శలు చేయడం ప్రారంభించింది.
పార్టీలో వివాదాలకు కేంద్రంగా ఉన్న ఒకరిద్దరు నాయకులు బయటకు వచ్చి.. వెళ్లినవారినీ.. వెళ్లిపోతు న్న వారినీ కూడా.. శపించేశారు. గతాన్ని తవ్వి తీశారు. 23 మందిని లాక్కుని.. 23 మందికే పరిమితం అయ్యారంటూ.. 2019 సీన్‌ను టీడీపీకి గుర్తు చేశారు. చంద్రబాబుపై అక్కసు వెళ్లగక్కారు. ఓకే.. ఇదంతా వైసీపీ ఆవేదనను కళ్లకు కడుతోంది. కానీ, ఇదిసాధారణంగా జరిగే ప్రక్రియ. కానీ, దీనికి ఆవల అంటూ.. కొంత రాజకీయం ఉంటుంది. అదే ఆత్మ విమర్శ!
ఆ ఆత్మ విమర్శపై వైసీపీ దృష్టి పెడితే.. తప్పులు ఎక్కడ జరుగుతున్నాయో తెలుసుకుని.. వాటికి చెక్ పెట్టి పార్టీని, నాయకులను కూడా కాపాడుకునేందుకు అవకాశం ఉంటుంది. కానీ, అసలైన దండలో దారం వంటి ఈ విషయాన్ని వైసీపీ వదిలేసింది. ఎన్నికల సమయంలో అనేక మందికి టికెట్ లు ఇవ్వలేదు. ఇది ఒక్క వైసీపీలోనే జరగలేదు. టీడీపీ కూడా.. కీలక నాయకులను పక్కన పెట్టింది. అయితే.. ఆ పార్టీ విజయం దక్కించుకోవడంతో వీరి బెడద రాలేదు.
కానీ, వైసీపీ ఓడిపోయింది. ఈ ఓటమికి నాయకులు కారణం కాదన్నదే.. ఇప్పుడు అసలు సమస్య. అంతా జగనే చేశారంటూ.. అత్యంత మిత్ర నాయకులు కూడా జగన్‌పై కారాలు మిరియాలు నూరారు. అప్పట్లోనే కళ్లు తెరిచి.. తప్పునకు బాధ్యత వహించి.. ఉంటే నాయకులను సర్దుబాటు చేసుకుని ఉంటే.. తప్పు ఒప్పుకొని ఉంటే.. పరిస్థితి వేరేగా ఉండేది. కీలక నిర్ణయాల్లో కొందరినైనా భాగస్వాములను చేసుకుని ఉంటే మరింత బాగుండేది. ఈ ఆత్మ విమర్శ వదిలేసి.. కర్ర విడిచి సాము చేసిన చందంగా.. పొరుగు పార్టీలపై పడి ఏడ్వడం వల్ల కన్నీరు తప్ప.. సానుభూతి అయితే రాదనేది వాస్తవం.