వైసీపీలో వైరాగ్యం...దండం పెట్టేస్తున్నారా ?
దాంతో మాజీ హోం మంత్రి వైసీపీ నుంచి రాజకీయాల నుంచి క్విట్ చెప్పినట్లు అయింది. అయితే ఆమె ఈ డెసిషన్ ఎంత కాలం అన్నది కూడా మరో వైపు చర్చ సాగుతోంది.
By: Tupaki Desk | 8 Nov 2024 5:30 PM GMTరాజకీయాల్లో ఉన్న వారు సాధారణంగా ఒక పట్టాన అందులో నుంచి బయట పడరు. వారి పరుగు ఎప్పటికీ ఆగదు అని అంటారు. రాజకీయం అన్నది ఒక తీరని దాహం లాంటిది. మరి అలాంటి రాజకీయాలను అంతటి మోజు ఉన్న పాలిటిక్స్ ని వదిలి పోవడం అంటే అది అత్యంత కఠినమైన నిర్ణయంగానే చూడాలి.
అలాంటి వారు ఏపీలో ఏదైనా పార్టీలో కనిపిస్తున్నారా అంటే ఒక్క వైసీపీలోనే అని చెప్పాల్సి ఉంటుంది. వైసీపీలో పుష్కర కాలం పాటు ప్రయాణించి పదవులు అందుకున్న వారు కూడా ఇపుడు రాజకీయాలకు ఒక పెద్ద దండం పెట్టేస్తున్నారు.
వీరు ఎందుకు ఇలా చేస్తున్నారు అన్నదే అర్ధం కావడం లేదు అంటున్నారు. అయితే తరచి చూస్తే కొన్ని కారణాలు కనిపిస్తున్నాయని కూడా చెబుతున్నారు. వైసీపీలో అధినాయకత్వం వైఖరి ఏ మాత్రం మారడం లేదని భావిస్తున్న వారే ఎక్కువ మంది ఉన్నారు. తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్ళు అన్నట్లుగా పార్టీ పెద్దలు వ్యవహరించడం అన్నది నచ్చడం లేదు అని అంటున్నారు.
పార్టీకి ఎన్నడూ లేని రాని ఘోర పరాజయం వచ్చినా కూడా అధినాయకత్వం వైఖరిలో మార్పు లేదని అంటున్నారు. ప్రజలు కూటమి హామీలను ఆకర్షితులై ఓట్లు వేశారు తప్పించి వైసీపీని ఓడించలేదు అన్న భావన మాత్రమే ఇప్పటికీ ఉంది. దానికి తోడు కూటమి ఫెయిల్యూర్స్ తో మరోసారి అధికారంలోకి వస్తామన్న ఒక గుడ్డి నమ్మకంతోనే ముందుకు పోతున్నారు అని అంటున్నారు.
అంతే తప్ప నిజాయితీగా ఏమి తప్పులు జరిగాయి అన్నది ఆత్మ విమర్శ చేసుకోవడం లేదని అంటున్నారు. దీంతో ఈ పరిణామాలతో విసిగిన వారు పార్టీ నుంచి జంప్ చేస్తున్నారు. అలా ఇతర పార్టీలలోకి వెళ్ళి అక్కడ రాజకీయాలు చేయడానికి ఇష్టపడని వారు రాజకీయాల నుంచి విరమించుకుంటున్నారు.
వైసీపీ ఓటమి పాలు కాగానే విజయవాడ నుంచి ఆ పార్టీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిన కేశినేని నాని గుడ్ బై టూ పాలిటిక్స్ అనేశారు. ఇక గుంటూరు జిల్లలో ఎమ్మెల్సీ మాజీ కేంద్ర మంత్రి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు కూడా తన పదవీ కాలం పూర్తి అయితే చాలు రాజకీయాలు వద్దు అనేస్తున్నారు.
శ్రీకకుళం జిల్లాలో మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు కూడా రాజకీయాల నుంచి తప్పుకున్నట్లే అంటున్నారు. అనేక జిల్లాలలో నేతలు కూడా అలాగే ఉంటున్నారు. ఇక గుంటూరు జిల్లాలో కీలక నేత, వైసీపీ ప్రభుత్వంలో తొలి మూడేళ్ళూ హోం మంత్రిగా పనిచేసిన మేకతోటి సుచరిత లేటెస్ట్ గా ఒక డెసిషన్ తీసుకున్నారని ప్రచారం సాగుతోంది.
ఆమె ఇటీవల జగన్ ని కలసి తాను పొలిటికల్ రిటైర్మెంట్ తీసుకుంటాను అని చెప్పినట్లుగా తెలుస్తోంది. తనకు ఈ రాజకీయాలు వద్దు ఆమె చెప్పేశారు అని అంటున్నారు. ఆమె 2009లో తొలిసారి గుంటూరు జిల్లా పత్తిపాడు నుంచి కాంగ్రెస్ తరఫున గెలిచారు. ఆ తరువాత వైసీపీలో చేరి 2012లో జరిగిన ఉప ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున రెండవసారి గెలిచారు. 2014లో అదే సీటు నుంచి పోటీ చేసి ఓడినా 2019లో మాత్రం గెలిచి చొపించారు. హోం మంత్రిగానూ పనిచేశారు.
అయితే 2024 ఎన్నికల్లో సుచరితను తాడికొండకు పంపించారు. అది ఆమెకు ఇష్టం లేదని ప్రచారం సాగింది. అప్పట్లోనే ఆమె పార్టీ మారుతారు అని కూడా పుకార్లు వచ్చాయి. అయితే ఆమె పోటీ చేయడం ఓటమి సంభవించడం జరిగిపోయాయి. ఇక ఆమె నాటి నుంచి వైసీపీకి దూరంగానే ఉంటూ వస్తున్నారు ఆమె టీడీపీలో చేరుతారని జనసేనలో చేరుతారని కూడా ఊహాగానాలు ఎన్నో వినిపించాయి.
వాటిని ఖండిస్తూ వచ్చిన సుచరిత ఎట్టకేలకు తన డెసిషన్ జగన్ కే చెప్పేశారు తాను రాజకీయాల నుంచి సెలవు పుచ్చుకుంటాను అని ఆమె పేర్కొన్నారని అంటున్నారు. అయితే జగన్ కొంత సమయం తీసుకుని ఆలోచించుకోవాలని సూచించినా ఆమె గుడ్ బై కే మొగ్గు చూపారని అంటున్నారు.
దాంతో మాజీ హోం మంత్రి వైసీపీ నుంచి రాజకీయాల నుంచి క్విట్ చెప్పినట్లు అయింది. అయితే ఆమె ఈ డెసిషన్ ఎంత కాలం అన్నది కూడా మరో వైపు చర్చ సాగుతోంది. ఆమె సరైన సమయంలో వేఅరే పార్టీ నుంచి రాజకీయ రంగ ప్రవేశం చేస్తారా అన్న ఊహాగానాలు కూడా ఉన్నాయి. ఏది ఏమైనా వైసీపీని వీడిపోతున్న తొలినాటి సహచరుల జాబితాలో సుచరిత కూడా చేరారు. ఒక విధంగా వైసీపీకి ఈ నేతల నిర్ణయాలు కొంత నిరాశగానే ఉంటాయని అంటున్నారు.