Begin typing your search above and press return to search.

రోడ్డు మీదకు రానున్న వైసీపీ !

వైసీపీ మెల్లగా గేరు మారుస్తోంది. స్పీడ్ పెంచుతోంది. ఏపీలో కూటమి ప్రభుత్వానికి ఆరు నెలల సమయం ఇచ్చిన తరువాత వైసీపీ ఇపుడు జనంలోకి రావాలని చూస్తోంది.

By:  Tupaki Desk   |   4 Dec 2024 3:34 AM GMT
రోడ్డు మీదకు రానున్న వైసీపీ !
X

వైసీపీ మెల్లగా గేరు మారుస్తోంది. స్పీడ్ పెంచుతోంది. ఏపీలో కూటమి ప్రభుత్వానికి ఆరు నెలల సమయం ఇచ్చిన తరువాత వైసీపీ ఇపుడు జనంలోకి రావాలని చూస్తోంది. హానీ మూన్ పీరియడ్ టీడీపీ కూటమి ప్రభుత్వానికి ముగిసింది అని కూడా భావిస్తోంది. ఇక రోడ్డెక్కాల్సిందే అని కూడా క్యాడర్ కి చెబుతోంది.

ఈ నేపథ్యంలో పార్టీని రొడ్డెక్కించేందుకు అవసరం అయిన ప్రణాళికలను రూపొందించడానికి రాష్ట్ర స్థాయిలో విస్తృత సమావేశాన్ని వైసీపీ ఏర్పాటు చేసి మరీ దిశా నిర్దేశం చేయనుంది. వైసీపీ జిల్లా అధ్యక్షులు, అలాగే రీజనల్ కో ఆర్డినేటర్లు, స్టేట్ లెవెల్ కార్యవర్గ సభ్యులతో కలసి కూటమి ప్రభుత్వం మీద ప్రజా పోరాటాలకు వైసీపీ యాక్షన్ ప్లాన్ ని రెడీ చేస్తోంది.

ఏపీలో ఆరు నెలల కాలంలో టీడీపీ కూటమి ప్రభుత్వ హయాంలో అనేక సమస్యలను వైసీపీ అధినాయకత్వం ఇప్పటికే గుర్తించింది. అవేంటి అంటే ఏకంగా 18 వేల కోట్ల రూపాయల భారీ వడ్డనతో ట్రూ అప్ చార్జీల పేరుతో విద్యుత్ చార్జీల బాదుడు ఒకటి. అది చాలా పెద్ద సమస్య అని పేదలు మధ్యతరగతి వర్గాలు మోయలేని భారమని వైసీపీ నేతలు అంటున్నారు.

ఇక ధాన్యం సేకరణ అన్నది కూటమి ప్రభుత్వంలో సరిగ్గా ఒక పాలసీ ప్రకారం జరగడం లేదన్నది వైసీపీ మరో ప్రధాన ఆరోపణ. ఈ విషయంలో మధ్య దళారులు రైతులను దారుణంగా దోచుకుంటున్నారు అన్నది కూడా వైసీపీ చేస్తున్న ఘాటు విమర్శ.

అదే విధంగా విద్యా సంవత్సరం ముగుస్తోంది కానీ ఫీజ్ రీ ఎంబర్స్ మెంట్ అయితే బకాయిలు చెల్లించలేదని దాని వల్ల విద్యార్ధి లోకం పూర్తి స్థాయిలో నష్టపోతోంది అని వైసీపీ కూటమిని టార్గెట్ చేస్తోంది. వీటితో పాటుగా అనేక ప్రజా వ్యతిరేక విధానాలౌ అదే విధంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేందుకు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను అమలు చేయకపోవడం, సమాజిక పెన్షన్లకు పెద్ద ఎత్తున కట్ చేయడం వంటి వాటి మీద కూడా రోడ్డెక్కి ఆందోళనలు చేయాలని నిర్ణయించింది.

ఈ ఆందోళనలు ఏ రూపంలో ఉండాలన్నది వైసీపీ అధినాయకత్వం నిర్ణయిస్తుంది. అంతే కాదు ఏపీలో ప్రజలతో మమేకం కావాల్సిన సందర్భం ఇదేనని కూడా భావిస్తోంది. ప్రజలు ఆశగా కూటమి సర్కార్ వైపు చూశారని కానీ వారికి నిరాశ మిగులుతోందని అంటున్నారు. దాంతో రానున్న రోజులలో అన్ని వర్గాల ప్రజలతో కలసి ప్రజా వ్యతిరేక విధానాలు అనుసరిస్తున్న కూటమి ప్రభుత్వం మీద పోరాటాలు భారీగా చేయాలని ఆ విధంగా పార్టీని జనంలో ఉండేలా చూసుకోవాలని భావిస్తోంది.

వైసీపీ అధినాయకుడు జగన్ జనవరి తరువాత జనంలోకి రానున్నారు. దాంతో ఆయన కంటే ముందే పార్టీని గేరప్ చేసి రోడ్డెక్కిస్తే జగన్ వచ్చే వేళకు మరింతగా పార్టీకి అది ప్లస్ అవుతుందని లెక్కలేస్తున్నారు. సో వైసీపీ రోడ్డెక్కనుంది అంటున్నారు. అతి త్వరలో పార్టీ శ్రేణులు జెండాలు పట్టి ఆందోళలకి సిద్ధపడుతున్నారన్న మాట.