మైకులు మూగబోయాయి.. వైసీపీలో ఏం జరుగుతోంది ..!
దీంతో పార్టీ తరఫున వారి వాయిస్ ప్రజలకు చేరేది. మంచా-చెడా.. ఏదో ఒకటి మాట్లాడేవారు. కానీ, తాజాగా తిరుపతి ఘటనకు ముందు తర్వాత కూడా మైకులు మూగబోయాయి.
By: Tupaki Desk | 10 Jan 2025 1:30 PM GMTవైసీపీలో నాయకులు మౌనం వీడడం లేదు. గతంలో మాదిరిగా ఇప్పుడు ఎవరూ పెద్దగా స్పందించడం లేదు. గతంలో ఎక్కడ ఎలాంటి ఘటన జరిగినా.. వెంటనే స్పందించేవారు. సమస్య పై చర్చించే వారు. మాట్లాడేవారు. మైకులు మోగేవి. మీడియా ముందుకు అప్పటి సీఎం జగన్ రాకపోయినా.. నాయకులు మాత్రం వచ్చేవారు. దీంతో పార్టీ తరఫున వారి వాయిస్ ప్రజలకు చేరేది. మంచా-చెడా.. ఏదో ఒకటి మాట్లాడేవారు. కానీ, తాజాగా తిరుపతి ఘటనకు ముందు తర్వాత కూడా మైకులు మూగబోయాయి.
ఎవరూ వైసీపీ నాయకులు ముందుకు వచ్చేందుకు ప్రయత్నించలేదు. కేవలం మాజీ మంత్రి రోజా, గుడివాడ అమర్నాథ్ మాత్రమే మీడియా ముందుకు వచ్చారు. పవన్‌ను, అనితను, సీఎం చంద్రబాబును, టీటీడీ చైర్మన్‌ను టార్గెట్ చేసుకుని వ్యాఖ్యలు చేశారు. అయితే.. వారు చేసిన కామెంట్లు పెద్దగా ఫలించలేదు. కేవలం మీడియా ముందుకు వచ్చి ఏదో చెప్పాలని చెప్పినట్టే అనిపించాయి. విమర్శలు చేయాలన్న ఉద్దేశంతోనే మీడియా ముందుకు వచ్చారన్న భావన కూడా వ్యక్తమైంది.
ఇక, మిగిలిన నాయకుల విషయానికి వస్తే.. పేర్ని నాని.. అంబటి రాంబాబు.. వంటివారు ఇటీవల కాలంలో దూకుడుగా ఉన్నారు. కానీ, ఇప్పుడు వారు కూడా పూర్తిగా సైలెంట్ అయ్యారు. ఇద్దరూ కూడా వ్యక్తిగతంగా అన్యమనస్కంగానే ఉన్నట్టు స్పష్టమైంది. తనపైనా తన భార్యపైనా కేసులు నమోదు కావడంతో పేర్ని సైలెంట్ అయ్యారు. ఇక, సత్తెనపల్లిలో ఇంచార్జ్‌గా తనను తప్పించడంపై అంబటి అలకబూనారు. దీంతో వైసీపీ తరఫున బలమైన వాయిస్ వినిపించేవారు కరువయ్యారు.
ఇక, ఇదే సమయంలో గతంలో టీటీడీ చైర్మన్‌గా పనిచేసిన వైవీ సుబ్బారెడ్డి మూడు వైకుంఠ ఏకాదశులు చూశారు. ఆయన ఈ సమయంలో మీడియా ముందుకు వచ్చి ఉంటే బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తమైంది. కానీ, ఆయన కూడా మీడియా ముందుకు రాలేదు. సో.. మొత్తంగా వైసీపీ లో అంతర్గతంగా అధినేతపై ఉన్న కోపం.. లేదా ఆవేదన వంటివి నాయకుల నుంచి ఇంకా పోలేదన్న భావన అయితే.. స్పష్టంగా కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు. కేవలం జగన్ మాత్రమే ఈ విషయంలోనూ ఫోకస్ అయ్యారు.