Begin typing your search above and press return to search.

జగన్ లో అభద్రతా భావం ?

ప్రస్తుతం చూస్తే వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ లో ఒకనాటి ఆత్మవిశ్వాసం ఇపుడు అలాగే ఉందా అన్న చర్చ అయితే సాగుతోంది.

By:  Tupaki Desk   |   25 Feb 2025 4:30 PM GMT
జగన్ లో అభద్రతా భావం ?
X

నాయకుడికి అతి విశ్వాసం ఉండరాదు. అలాగే ఆత్మ విశ్వాసం కోల్పోరాదు అయితే విజయం సాధించిన వారు అతి విశ్వాసానికి పోతూంటారు. పరాజయానికి లోను అయిన వారు అభద్రతాభావానికి కూడా గురి అవుతారు. ప్రస్తుతం చూస్తే వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ లో ఒకనాటి ఆత్మవిశ్వాసం ఇపుడు అలాగే ఉందా అన్న చర్చ అయితే సాగుతోంది.

జగన్ ఒంటరిగా రాజకీయాలు అనే పద్మవ్యూహంలోకి చొరబడి అభిమన్యుడు కాదు అర్జునుడు అనిపించుకుని గెలుచుకున్నారు. అయిదేళ్ల పాటు సీఎం అయ్యారు. ఆ సమయంలో ఆయనలో ఆత్మ విశ్వాసం వేయింతలుగా పెరిగింది. అది కాస్తా ఒక్కోసారి అతి విశ్వాసంగా కూడా పరిణమించింది అన్న చర్చ ఉంది.

అలా జగన్ 2024 సార్వత్రిక ఎన్నికల ముందు ఏకంగా వందమంది సిట్టింగులను మార్చేయడం వెనక అతి విశ్వాసమే చూపించారు. అయితే ఈ డెసిషన్ బూమరాంగ్ అయింది. జగన్ ఆ విధంగా ఘోర పరాజయం పాలు అయ్యారు. ఆయన పార్టీ ఆ తర్వాత నుంచి జంపింగులతో సతమతమవుతోంది.

దీంతో జగన్ లో ఇపుడు అభద్రతాభావం కనిపిస్తోందా అన్నది చర్చగా ఉంది. ఎందుకంటే తన సొంత పార్టీ ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను ఆయన అనుమానిస్తున్నారా అన్నది కూడా చర్చగా ఉంది. ఒక ఎమ్మెల్యే కండువా మరచిపోతే ఆయన పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నారు అన్న భావన వైసీపీ అధినాయకత్వంలో ఎందుకు కలుగుతోంది అన్నది ఇపుడు ఒక చర్చగా ఉంది.

ఇక పదే అదే జగన్ తాము ముప్పయ్యేళ్ళ పాటు సీఎం గా ఉంటాను అని చెప్పడం కూడా దేనికి సంకేతం అని అంటున్న వారూ ఉన్నారు. ఆయన మూడు దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉంటాను అంటే వైసీపీ నేతలు ఆ పార్టీకి కట్టుబడి ఉంటారని భావిస్తున్నారా అన్న ప్రశ్నలు వస్తున్నాయి. ఒక పార్టీలో నేతలు జంపింగ్ మామూలే అని ఎంత అనుకున్నా ఒక్కోసారి అధినాయకత్వం తీరు నచ్చక కూడా పార్టీలు మారుతూంటారు.

ఇలా రెండు వైపుల నుంచి కూడా జరుగుతూ ఉంటాయి. నాయకులు వెళ్ళినపుడు తప్పులు ఏమైనా తమ వైపు నుంచి జరిగాయేమో అని ఏ రాజకీయ నాయకత్వం అయినా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే పార్టీ మారుతున్న వారికి సమస్య వైసీపీతో కాదని అధినాయకత్వం తీరుతో అని కూడా విశ్లేషణలు ఉన్నాయి.

ఈ రోజుకీ వైసీపీకి ఆదరణ ఉంది. 40 శాతం ఓటు షేర్ ఉంది. ఆ పార్టీకి కట్టుబడిన వర్గాలు చాలా ఉన్నాయి. అయితే ప్రతిపక్ష స్థానంలోకి వచ్చాక గత తొమ్మిది నెలలలో వైసీపీ అధినాయకత్వం వ్యవహరిస్తున్న తీరుతోనే ఇబ్బంది వస్తోంది అని అంటున్న వారే ఎక్కువగా ఉన్నారు. ముఖ్యంగా చూస్తే అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించడం అన్నది వైసీపీ తీసుకున్న తప్పుడు నిర్ణయం అని చాలా మంది అంటున్నారు.

ప్రజాస్వామ్యంలో ప్రజలే ఎపుడూ దేవుళ్ళు. వారు ఓడించారు అంటే వారితోనే మళ్ళీ గెలుపు పిలుపు అందుకోవాలి. అలా వైసీపీ చేయాలీ అంటే జనం మెచ్చేలా నిర్ణయాలు ఉండాలి అసెంబ్లీలో విపక్షంగా తమ పోరాటాన్ని చూపించాలి. అలాగే నిత్యం జనంలో ఉంటూ ప్రజా సమస్యల పట్ల పోరాడాలి. పార్టీని కూడా ఎప్పటికపుడు పునర్నిర్మించుకుంటూ సాగాలి. తప్పుడు నిర్ణయాలు ఉంటే కనుక సరిచేసుకోవాలి.

ఇలా చేస్తే కనుక ముప్పయ్యేళ్ళ పాటు అధికారంలో ఉంటామని పదే పదే చెప్పాల్సిన అవసరమే లేదు అని అంటున్నారు. ఇక వైసీపీ అధినాయకత్వం ఈ జంపింగుల విషయంలో కొంత ఆందోళన పడుతోంది అంటే కారణాలు ఉన్నాయని అనే వారూ ఉన్నారు. నలుగురు రాజ్యసభ ఎంపీలు పార్టీని వీడారు. ఎమ్మెల్సీలు కూడా పార్టీ మారుతారని చర్చ సాగుతోంది.

పది మంది ఎమ్మెల్యేల విషయంలో ప్రచారం అయితే లేదు కానీ రాజకీయాల్లో ఏమి జరుగుతుంది అన్నది ఎవరూ చెప్పలేరు. ఆ విధంగా చూస్తే కనుక అధినాయకత్వంలో కొంత కలవరపాటు అయితే ఉంది. వచ్చేది మన ప్రభుత్వమే మనమే మళ్ళీ అందరికీ పదవులు ఇస్తామని వైసీపీ పెద్దలు చెప్పడం బాగానే ఉంది కానీ వర్తమానంలో కూడా పార్టీని నాయకులను దగ్గర చేసుకుంటూ జనంలో పార్టీని ఉంచేలా కార్యక్రమాలు చేయడం ద్వారానే క్యాడర్ లో లీడర్ లో నమ్మకాన్ని పెంచగలమని అంటున్నారు.