నీరసపడిన వైసీపీ మీడియా.. సంస్కరణలకు డిమాండ్ ..!
నిజానికి వైసీపీకి టీవీ, పత్రిక ఉన్నాయి. సర్క్యులేషన్‌లో పత్రిక రెండో స్థానంలో ఉండగా.. టీఆర్ పీ రేటింగ్‌లో టీవీ చానెల్ కూడా.. పుంజుకుంది.
By: Tupaki Desk | 21 Dec 2024 3:00 AM GMTరాజకీయ పార్టీలకు వాయిస్అంటే ఒకప్పుడు బలమైన నాయకులు ఉండేవారు. వారు చెబితే.. అది ప్రజల్లో కి బలంగా వెళ్లేది. కానీ, ఇప్పుడు రాజకీయ నేతలకు, పార్టీలకు కూడా.. మీడియానే బలంగా మారింది. నాయ కులు చేసే వ్యాఖ్యలు ఎలా ఉన్నా.. మీడియాలో ఆ వాదనకు సమర్ధన రావాల్సి ఉంది. అదేసమయంలో మరికొన్ని కీలక విషయాల్లోనూ మీడియా దూకుడుగా వ్యవహరించాల్సి ఉంది. ఇదే ఈ ఏడాది ఎన్నికలకు ముందు.. ఓ వర్గం మీడియా పాటించింది.
ఎన్నికలకు కేవలం 15 రోజుల ముందు వరకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనే విషయంపై ప్రతిపక్షాలు దృష్టి పెట్టలేదు. కానీ, ఓ పత్రిక ఈ విషయాన్ని వెలుగులోకి తీసుకురావడంతో అప్పటినుంచి మొదలు పెట్టిన ఈ విషయంపై ప్రచారం.. ప్రజల్లోకి బలంగా వెళ్లింది. ఈ తరహా మీడియా దన్ను.. వైసీపీకి లేకుండా పోయింది. పేరుకు సొంత మీడియా ఉన్నప్పటికీ.. ఎఫెక్టివ్‌గా అయితే.. పనిచేయడం లేదని వైసీపీనాయకులు ఆరోపిస్తున్నారు. తమ మీడియాలో తమ వార్తలే కవర్ కావడం లేదని చెబుతున్నారు.
నిజానికి వైసీపీకి టీవీ, పత్రిక ఉన్నాయి. సర్క్యులేషన్‌లో పత్రిక రెండో స్థానంలో ఉండగా.. టీఆర్ పీ రేటింగ్‌లో టీవీ చానెల్ కూడా.. పుంజుకుంది. కానీ, పార్టీకి ప్రయోజనకరంగా ఉండాల్సిన ఈ రెండు కూడా.. విఫలమవుతున్నాయన్న చర్చ సాగుతోంది. సొంత పార్టీ నాయకులకు వ్యూహాలు అందించడంలోనే కాదు.. వారి వ్యూహాలను ప్రచారం చేయడంలోనూ ఈ మీడియా వెనుకబడిపోయిందని పార్టీ నాయకులు అంటున్నారు. ఇటీవల జరిగిన అనేక అంశాలను ప్రచారం చేయడంలో వైసీపీ ప్రధాన మీడియా వేస్ట్ అయిందన్న భావన సర్వత్రా వ్యక్తమవుతోంది.
+ ఎన్నికలకుముందు విశాఖ తీరానికి వచ్చిన విదేశీ నౌకలో 25 వేల కోట్ల డ్రగ్స్ వచ్చాయని ఎన్నికలకు ముందు ప్రతిపక్షాలు ప్రచారం చేశాయి. అయితే.. ఇటీవల దీనిలో అలాంటి దేమీ లేదని.. కేవలం డ్రై ఈస్ట్ మాత్రమే వచ్చిందని సీబీఐ నిర్ధారించింది. అయితే.. దీనిని ప్రచారం చేసుకోవడంలో వైసీపీ మీడియా విఫలమైంది.
+ తాజాగా తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై విచారణ చేపట్టిన కమిటీ.. కేవలం రెండు ట్యాంకర్లలో వచ్చిన నెయ్యిపైనే దృష్టి పెట్టిందని టీడీపీ అనుకూల మీడియా రాసింది. కానీ, వైసీపీ ఈ విషయాన్ని వదిలేసింది. ఇది పార్టీకి భారీ ఎఫెక్ట్ చూపిస్తోంది.
+ జనసేన నాయకుడు ఒకరు నిర్వహించిన అశ్లీల నృత్యాలు.. అనంతర పరిణామాలను భారీ రేంజ్‌లో వెలుగులోకి తీసుకువచ్చి.. సర్కారు వెన్నులో వణుకు పుట్టిస్తుందని వైసీపీ మీడియాపై ఆ పార్టీ నాయకులు ఆశలు పెట్టుకున్నా.. ఆ విషయంలోనూ వైసీపీ మీడియా పూర్తిగా చేతులు ఎత్తేసింది.
+ కేంద్రం ఇటీవల వైసీపీ పాలనపై ప్రశంసలు గుప్పించింది. జీడీపీ పెరిగిందని.. దీనికి కారణం వైసీపీ పాలననే నని చెప్పింది. కానీ, ఈ విషయాన్ని కూడా.. హైలెట్ చేయలేక పోయారు. దీంతో వైసీపీ మీడియా విఫలమైంది.
+ ఇలా అనేక విషయాల్లో వైసీపీ మీడియా చేతులు ఎత్తేసిన పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. ఒక వైపు కీలక నాయకులు మౌనంగా ఉండడం, మరోవైపు.. మీడియా కూడా సరిగా పనిచేయకపోవడంతో సంస్కరణలు తీసుకురావాలని ఆ పార్టీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు.