అసెంబ్లీలో వైసీపీ రగడ.. ఏం జరిగిందంటే!
బిగ్గరగా అరుస్తూ..గవర్నర్ ప్రసంగానికి అడుగడుగునా అడ్డుతగిలారు.
By: Tupaki Desk | 24 Feb 2025 6:07 AM GMTఏపీ అసెంబ్లీ వైసీపీ ఎమ్మెల్యేలు ఆందోళనలు, నిరసనలతో అట్టుడికింది. సోమవారం ఉదయం సభ ప్రారంభం కాగానే.. గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్.. ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. దీనికి ముందే.. సభకు చేరుకున్న వైసీపీ అధినేత జగన్ నాయకత్వలోని ఆ పార్టీ సభ్యులు.. గవర్నర్ ప్రసంగం ప్రారంభించగానే.. నిరసనకు దిగారు. తమ తమ స్థానాల్లో నిలబడి.. నినాదాలతో హోరెత్తించారు. బిగ్గరగా అరుస్తూ..గవర్నర్ ప్రసంగానికి అడుగడుగునా అడ్డుతగిలారు.
దీంతో తొలి పదినిమిషాల సమయంలోనే నాలుగు నుంచి ఐదారు సార్లు.. గవర్నర్ తన ప్రసంగాన్ని నిలుపుదల చేయాల్సి వచ్చింది. మధ్య మధ్యలో ఆయన వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల వైపు సీరియస్‌గా చూశారు. అయినప్పటికీ.. వైసీపీ సభ్యులు ఎక్కడా వెనక్కి తగ్గకుండా.. తమ దారిలో తాము అన్నట్టుగా వ్యవహరించారు. ``ప్రతిపక్షంగా గుర్తించండి.. ప్రజాస్వామ్యాన్ని కాపాడండి!`` అని బిగ్గరగా నినదించారు. మరికొద్ది సేపటికి స్పీకర్ పోడియం వద్దకు వచ్చి ప్లకార్డులు ప్రదర్శించి మరీ నిరసనను ఉద్రుతం చేశారు.
ప్రతిపక్షంగా ఉన్న తమను ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించాలని వైసీపీ సభ్యులు డిమాండ్, ప్రజాస్వామ్యా న్ని రక్షించాలని కోరారు. మాజీ సీఎం జగన్ ఎమ్మెల్యేలకు నేతృత్వం వహించగా.. శాసన మండలి సభ్యులకు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ నేతృత్వం వహించారు. వైసీపీ సభ్యులు ఆందోళన, నిరసనల మధ్యే గవర్నర్ తన ప్రసంగాన్ని కొనసాగించారు. కాగా.. కొద్దిసేపు ఆందోళన చేసిన వైసీపీ సభ్యులు.. జగన్ సూచనలతో సభ నుంచి వాకౌట్ చేశారు.