Begin typing your search above and press return to search.

ఊహించిందే జరిగింది.. వైసీపీ వదిలేసింది..

నాయకులు పోతే పోనీ అన్నట్లు అధిష్టానం వైఖరి ఉండటంతోనే ఎక్కువ మంది సేఫ్ జోన్ చూసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది.

By:  Tupaki Desk   |   19 March 2025 1:58 PM IST
ఊహించిందే జరిగింది.. వైసీపీ వదిలేసింది..
X

ఏపీలో ప్రతిపక్ష వైసీపీకి నేతలు వరుసగా బై బై చెప్పేస్తున్నారు. ఒకరు తర్వాత ఒకరుగా అధికార కూటమికి దగ్గరవుతున్నారు. మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులే కాకుండా ఎమ్మెల్సీ, ఎంపీ పదవుల్లో ఉన్నవారు సైతం వైసీపీకి రాజీనామా చేస్తుండటం చర్చనీయాంశమవుతోంది. తాజాగా పల్పాడు జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ పార్టీకి తన పదవికి రాజీనామా చేశారు. ఆయన పార్టీ వీడతారంటూ చాలా కాలంగా ప్రచారం జరుగుతున్నా, సర్దిచెప్పి పార్టీలో కొనసాగేలా చేయడంలో వైసీపీ విఫలమైనట్లు భావిస్తున్నారు. నాయకులు పోతే పోనీ అన్నట్లు అధిష్టానం వైఖరి ఉండటంతోనే ఎక్కువ మంది సేఫ్ జోన్ చూసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది.

వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత చాలా మంది నేతలు పార్టీని వీడారు. ప్రధానంగా గత ప్రభుత్వంలో మంత్రి పదవులు నిర్వహించిన వారితోపాటు సమాన హోదా అనుభవించిన వారు సైతం పార్టీకి రాం రాం చెప్పేశారు. ఆళ్ల నాని, బాలినేని శ్రీనివాసరెడ్డి, సామినేని ఉదయభాను, కిలారి రోశయ్య ఇలా పార్టీలో క్రియాశీలంగా పనిచేసిన వారే రాజీనామా చేసి వెళ్లిపోయారు. ఇక రాజ్యసభ సభ్యులుగా ఉన్న విజయసాయిరెడ్డి, క్రిష్ణయ్య, మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు సైతం పార్టీకి గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే. అదేవిధంగా ఎమ్మెల్సీలుగా పనిచేసిన బల్లి కల్యాణ్ చక్రవర్తి, కర్రి పద్మశ్రీ, పోతుల సునీత కూడా తమ పదవులను వదులుకున్నారు. ఇప్పుడు ఈ లిస్టులో మర్రి రాజశేఖర్ చేరారు.

2004లో స్వతంత్ర అభ్యర్థిగా చిలకలూరిపేట నుంచి గెలిచిన మర్రి రాజశేఖర్ ఆ తర్వాత కాంగ్రెస్ లో చేరారు. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ప్రధాన అనుచరుడిగా మారారు. ఆ క్రమంలోనే వైసీపీ అధినేత జగన్ కు దగ్గరై ఆ పార్టీ ఆవిర్భావం నుంచి కొనసాగుతున్నారు. 2014లో చిలకలూరిపేట నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన రాజశేఖర్ ఓటమి చెందారు. 2019లో మళ్లీ పోటీ చేయాలని భావించినా, అప్పుడు టీడీపీ నుంచి వచ్చిన విడదల రజినికి వైసీపీ అవకాశం ఇచ్చింది. ఆ తర్వాత రాజశేఖర్ కు ఎమ్మెల్సీగా ఎంపిక చేసింది. అయితే 2024లో మళ్లీ ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేయాలని భావించారు. ఆ సమయంలో సిట్టింగు ఎమ్మెల్యేకు టికెట్ ఇవ్వకపోయినా, రాజశేఖర్ కు కూడా వైసీపీ చాన్స్ ఇవ్వలేదు. ఆ ఎన్నికల్లో వైసీపీ ఓటమి తర్వాత మళ్లీ విడదల రజినిని తీసుకువచ్చి చిలకలూరిపేట ఇన్చార్జిగా నియమించడంపై రాజశేఖర్ అసంతృప్తికి లోనయ్యారు. అప్పటి నుంచి ఆయన పార్టీ మారతారని ఊహాగానాలు వినిపిస్తున్నా, వైసీపీ అధిష్టానం పట్టించుకోలేదని చెబుతున్నారు. దీంతో తన దారి తాను చూసుకోవడమే బెటర్ అనుకున్న రాజశేఖర్ టీడీపీతో సంప్రదింపులు జరిపినట్లు చెబుతున్నారు. ఆయన చేరికకు టీడీపీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆయన వైసీపీ నుంచి తప్పుకున్నారు.