దక్షిణాదిన పార్లమెంట్ సమావేశాలు...వైసీపీ ఎంపీ ప్రతిపాదన
తిరుపతికి చెందిన వైసీపీ ఎంపీ గురుమూర్తి పార్లమెంట్ సమావేశాలు దక్షిణాదిన నిర్వహించాలని ప్రధాని నరేంద్ర మోడీని కోరారు.
By: Tupaki Desk | 1 Dec 2024 2:14 PM GMTపార్లమెంట్ సమావేశాలు ఢిల్లీలోనే జరుగుతాయి. ఎందుకంటే ఢిల్లీ దేశానికి రాజధాని పార్లమెంట్ కూడా అక్కడే ఉంది. ఇటీవల చూస్తే మరో కొత్త పార్లమెంట్ భవనం కూడా నిర్మించారు. ఏకంగా 1200 మంది పార్లమెంట్ సభ్యులు హాయిగా కూర్చుని సెషన్స్ నిర్వహించేలా డిజైన్ చేశారు.
ఇదిలా ఉంటే వైసీపీ నుంచి లేటెస్ట్ గా కొత్త ప్రతిపాదన వచ్చింది. తిరుపతికి చెందిన వైసీపీ ఎంపీ గురుమూర్తి పార్లమెంట్ సమావేశాలు దక్షిణాదిన నిర్వహించాలని ప్రధాని నరేంద్ర మోడీని కోరారు. ఈ మేరకు ఆయన ప్రధానమంత్రికి ఒక లేఖ కూడా రాశారు.
ఆయన ఎందుకు దక్షిణాదిన పార్లమెంట్ సమావేశాలు నిర్వహించమని కోరుతున్నారు అంటే ఢిల్లీలో తీవ్ర స్థాయిలో కాలుష్యం ఉంది. అది సభ్యుల పనితీరుని తీవ్రంగా ప్రభావితం చేస్తోంది అని ఆయన పేర్కొంటున్నారు. దాంతో పార్లమెంట్ సమావేశాలు ఈసారికి దక్షిణాదిలో నిర్వహిస్తే జాతీయ సమగ్రతకు దోహదపడే అంశంతో పాటుగా కాలుష్యం బారి నుంచి కూడా బయట పడవచ్చు అని భావిస్తున్నారు. అంతే కాదు సభ్యుల పనితీరు కూడా మరింతగా మెరుగుపడుతుందని కూడా ఆయన అంటున్నారు.
అయితే దక్షిణాదిన ఏ రాష్ట్రంలో ఈ సమావేశాలు నిర్వహించాలన్నది మాత్రం ఆయన సూచించలేదు. మొత్తానికి ఢిల్లీలో కాలుష్యం అంతకంతకు పెరుగుతున్న నేపథ్యం ఉంది. ఈసారి చాలా ఎక్కువగా ఉంది. దాంతో ఎంపీలు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఐటీ సెక్టార్ సహా చాలా కంపెనీలు వర్చువల్ గానే వర్క్ కి ప్రిఫరెన్స్ ఇస్తున్నాయి. మరో వైపు పాఠశాల తరగతులకు కూడా ఆన్ లైన్ లోనే నిర్వహిస్తున్న నేపధ్యం ఉంది.
ఈ క్రమంలో పార్లమెంట్ సమావేశాలు దాదాపు పాతిక రోజుల పాటు జరుగుతున్నాయి. దాంతో సభ్యుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని గురుమూర్తి ఈ విధంగా ప్రధానికి ప్రతిపాదన చేశారు. ఆయన లేఖలో జాతీయ సమగ్రత అన్న పదం వాడారు. నిజానికి ఎపుడూ ఢిల్లీలోనే నిర్వహించే కంటే ఒక పార్లమెంట్ సెషన్ అయినా దక్షిణాదిన నిర్వహిస్తే జాతీయ సమగ్రత భావన మరింతగా పాదుకొంటుందన్నది మేధావుల ప్రజాస్వామ్య ప్రియుల భావన.
దానిని గురుమూర్తి తన లేఖలో పేర్కొన్నారు అని అనుకోవాలి. అయితే ఈ లేఖ గురుమూర్తి పార్లమెంట్ శీతాకాల సమావేశాల కంటే ముందే రాసి ఉంటే బాగుండేది అని అంటున్నారు. ఇపుడు చూస్తే కొంతవరకూ పార్లమెంట్ సాగుతోంది. ఈ నెల 20తో సెషన్ ముగుస్తుంది. దాంతో మరి గురుమూర్తి ప్రతిపాదనను కేంద్రం ఈసారికి కాకపోయినా వచ్చేసారికి అయినా పరిశీలిస్తుందా అన్న చర్చ అయితే ఉంది. ఏది ఏమైనా ఇది ఒక మంచి ప్రతిపాదన అని చాలా మంది అంటున్నారు. కేంద్రం రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాల్సి ఉంది.