బీజేపీ గూటికి వైసీపీ ఎంపీలు.. ఒకరికి పదవి.. మరొకరికి ఆత్మ రక్షణ..!
ఏపీలో రాజకీయాలు మరోసారి వేడెక్కనున్నాయా? కీలక వైసీపీలు ఇద్దరు బీజేపీకి జై కొట్టనున్నారా? అంటే.. ఔననే సంకేతాలు రానే వస్తున్నాయి.
By: Tupaki Desk | 6 Feb 2025 6:43 AM GMTఏపీలో రాజకీయాలు మరోసారి వేడెక్కనున్నాయా? కీలక వైసీపీలు ఇద్దరు బీజేపీకి జై కొట్టనున్నారా? అంటే.. ఔననే సంకేతాలు రానే వస్తున్నాయి. రాజకీయాల్లో ఏమైనా జరగొచ్చు.. అనే సూత్రానికి ఈ ఇద్దరు ఎంపీలు కూడా.. పక్కా సాక్ష్యంగా నిలవనున్నారని చెబుతున్నారు. ఇటీవల ఓ ఎంపీ.. తను నిబద్ధతంగా వైసీపీలోనే ఉండిపోతానని చెప్పుకొచ్చారు. కానీ, చిత్రం ఏంటంటే.. ఆ మరుసటి రోజే ఆయన.. పెద్దలతో డీల్ కుదుర్చుకున్నట్టు తెలిసింది.
ఈ విషయం వైసీపీ అధినేత జగన్‌కు కూడా తెలిసింది. అయితే.. ఆయన ప్రయత్నించినా.. కేవలం పై పైనే జరుగుతుంది కాబట్టి.. ప్రయోజనం లేదు కాబట్టి ఆయన మౌనంగా ఉన్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కేంద్ర ప్రాజెక్టుల్లో భారీ కాంట్రాక్టరుగా ఉండడం.. వైసీపీ హయాంలో చేసుకున్న ఒప్పందాలు కొనసాగుతున్న నేపథ్యంలో సదరు ఎంపీపై సహజంగానే ఒత్తిడి ఉన్నట్టు ఆయనే స్వయంగా చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో ఆయన బీజేపీకి జై కొట్టక తప్పని పరిస్థితి ఏర్పడింది.
ఇక్కడే మరో కీలక పదవి కూడా ఎదురు చూస్తున్నట్టు సమాచారం. పార్లమెంటు ఉప సభాపతి పోస్టు ప్రస్తుతం ఖాళీగా ఉంది. ఈ నేపథ్యంలో దానిని సదరు ఎంపీకి ఇచ్చే ఆలోచన దిశగా కమల నాథులు ప్రయత్నం చేస్తున్నారు. ఇక, సీమకు చెందిన లోక్‌సభ సభ్యుడు ఒకరు పార్టీ మారే దిశగా పావులు కదుపుతున్నారని తెలిసింది. ఈయన కుటుంబంపై కేసులు చుట్టు ముడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆత్మ రక్షణలో పడిన ఈ పెద్ద కుటుంబం బీజేపీని సంప్రదించిందని సీమ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది.
అయితే.. ఈ విషయంలో బీజేపీ పెద్దలు.. చూస్తాం-చేస్తాం అంటూ.. సాగదీత ధోరణిలో ఉన్నారు. ఈ పరిణామాల వెనుక పార్టీ మార్పును కమల నాథులు కోరుకుంటున్నట్టు తెలిసింది. దీనికి అంగీకరిస్తే.. సేఫ్ అవుతారన్న భావన పెద్ద కుటుంబంలో జరుగుతోంది. ప్రస్తుతం మనల్ని మనం రక్షించుకోకపోతే.. వచ్చే ఎన్నికల సమయానికి ఏమీ మిగలకుండా పోతుంది! అని ఈ కుటుంబానికి చెందిన సీనియర్ నాయకుడు ఒకరు వ్యాఖ్యానించడం.. బీజేపీ వైపు తొంగి చూస్తున్నారనడానికి బలం చేకూరుస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.