Begin typing your search above and press return to search.

వైసీపీ రాజ్యసభ ఎంపీలు పోతే పార్టీకి ఏమీ ఇబ్బంది ఉండదా?

ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాల అనంతరం పలువురు వైసీపీ నేతలు పక్క చూపులు చూస్తున్నారంటూ జరిగిన ప్రచారానికి తాజాగా బలం చేకూరిందని తెలుస్తోంది.

By:  Tupaki Desk   |   29 Aug 2024 4:57 AM GMT
వైసీపీ రాజ్యసభ ఎంపీలు పోతే పార్టీకి ఏమీ ఇబ్బంది ఉండదా?
X

పార్లమెంట్ లో తమకు చాలా బలం ఉందని.. తమ ఎంపీల అవసరం పెద్దల సభలో కేంద్రానికి ఉందని.. అంశాలవారీగానే బిల్లులకు తమ మద్దతు ఉంటుంది తప్ప బ్లైండ్ గా ఉండదని వైసీపీ ఎంపీలు ఇప్పటికే పలుమార్లు చెప్పిన పరిస్థితి. అయితే అనూహ్యంగా వైసీపీ రాజ్యసభ సభ్యులు పెద్ద సంఖ్యలో పార్టీ మారేందుకు సిద్ధమయ్యారనే వార్త ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.

ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాల అనంతరం పలువురు వైసీపీ నేతలు పక్క చూపులు చూస్తున్నారంటూ జరిగిన ప్రచారానికి తాజాగా బలం చేకూరిందని తెలుస్తోంది. ఇందులో భాగంగా... పలువురు రాజ్యసభ ఎంపీలు కూటమి పార్టీల వైపు ఆకర్షితులయ్యారని అంటున్నారు. ఇందులో కొంతమంది టీడీపీ, ఒకరు జనసేన, మిగిలిన వారు బీజేపీ వైపు వెళ్లనున్నారని తెలుస్తోంది.

వాస్తవానికి రాజ్యసభలో ప్రస్తుతం టీడీపీ, జనసేనల బలం శూన్యంగా ఉన్న సంగతి తెలిసిందే! ఈ క్రమంలో వైసీపీకి 11 మంది సభ్యుల బలం ఉంది. ఈ సమయంలో వైసీపీలోని మెజార్టీ సభ్యులు కూటమిలోని మూడు పార్టీల్లోనూ చేరేందుకు రంగం సిద్ధమైందని అంటున్నారు. ఈ మేరకు సుమారు 7గురు వైసీపీ రాజ్యసభ సభ్యులు కండువాలు మార్చేందుకు సిద్ధమయ్యారని చెబుతున్నారు.

ఇందులో భాగంగా... మోపిదేవి వెంకట రమణ, బీదా మస్తాన్ రావు ఈ రోజు వైసీపీకి రాజీనామా చేయనున్నారని సమాచారం. వీరిద్దరూ గురువారం ఢిల్లీలో రాజ్యసభ ఛైర్మన్ ను కలిసి తమ రాజీనామాలు సమర్పించబోతున్నారని అంటున్నారు. ఇదే క్రమంలో... అయోధ్య రామిరెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, మేడా రఘునాథరెడ్డి, ఆర్ కృష్ణయ్య, గొల్ల బాబూరావులు కూడా పార్టీ మారడానికి సిద్ధమయ్యారంటూ ప్రచారం జరుగుతోంది.

వీరిలో మోపిదేవి వెంకటరమణ, బాబూరావు, మస్తాన్ రావు, కృష్ణయ్య లు టీడీపీలోకి వెళ్లేందుకు చర్చలు జరుగుతున్నాయని చెబుతుండగా... అయోధ్య రామిరెడ్డి, సుభాష్ చంద్రబోస్, మేడా రఘునాథ రెడ్డి బీజేపీలో చేరనున్నట్లు చెబుతున్నారు. ఈ ఏడుగురిలో ఒకరు జనసేనలో చేరే అవకాశం ఉందని అంటున్నారు. దీంతో... రాజ్యసభలో వైసీపీ బలం 4కు పడిపోనుందని చెబుతున్నారు.

అంటే... మిగిలిన వారిలో వైసీ సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి, నిరంజన్ రెడ్డి, పరిమల్ నత్వానీ మాత్రమే వైసీపీలో ఉండనున్నారని అంటున్నారు. ఈ సందర్భంగా ఒక ఆసక్తికరమైన చర్చ తెరపైకి వస్తోంది. ఈ ఏడుగురు రాజ్యసభ సభ్యులూ రాజీనామాలు చేయడం వల్ల పార్టీకి ప్రత్యేకంగా వచ్చే నష్టం ఏమీ లేదనే కామెంట్లు వైసీపీ శ్రేణుల నుంచి వినిపిస్తున్నాయని అంటున్నారు.

అవును... పైన చెప్పుకున్నట్లుగా ఏడుగురు రాజ్యసభ సభ్యులు పార్టీని వీడటం వల్ల వైసీపీకి వచ్చే నష్టం ఏమీ లేదని చెబుతున్నారు. వీరిలో ఒక్కరికి కూడా ప్రజల్లో పలుకుబడి అంత లేదన్నది వైసీపీ వర్గాల నుంచి వినిపిస్తున్న మాటగా ఉంది. ఉదాహరణకు మోపిదేవి వెంకటరమణ విషయానికొస్తే... ఆయన ఎమ్మెల్యేగా ఓటమిపాలైన తర్వాత ఆయనను ఎమ్మెల్సీ చేసి మంత్రిపదవి ఇచ్చారు జగన్!

ఇక బీదా మస్తాన్ రావు పూర్తిగా తన వ్యాపారాల కోసమే రాజకీయాల్లోకి వచ్చారని.. మిగిలిన వారిలో మెజారిటీ సభ్యుల పరిస్థితి దాదాపు ఇదేనని.. వీరికి ప్రత్యేకంగా సొంత నియోజకవర్గాలంటూ ఏమీ లేవని.. గతంలో పోటీ చేసిన నియోజకవర్గాలకు వెళ్లినా వీరిని పరిగణలోకి తీసుకునే ప్రజానికం అతిస్వల్పమని చెబుతున్నారు.

ఈ నేపథ్యంలో అలాంటి నేతలు పార్టీని వీడినంత మాత్రన్న వైసీపీకి వచ్చిన నష్టం ఏమీ లేదని.. పైగా ప్రజల్లో పలుకుపడి ఉన్న మరికొంతమంది కొత్త నేతలకు అవకాశం రానుందని నొక్కి చెబుతున్నారు. దీంతో... ఈ ఏడుగురు ఎంపీలు పార్టీని వీడటం వల్ల రాజ్యసభలో పార్టీ బలం తగ్గొచ్చేమో కానీ.. క్షేత్ర స్థాయిలో ఏమాత్రం ప్రభావం చూపించదని వైసీపీ వర్గాలు గట్టిగా చెబుతున్నాయి.